కేన్సర్‌ కణితులపై వీర్యకణాలతో ఔషధ ప్రయోగం

మహిళల జననాంగ మార్గాల్లోని కేన్సర్‌ కణితుల వద్దకు నేరుగా ఔషధాలను తీసుకెళ్లడానికి వీర్యకణాలను ఉపయోగించవచ్చని జర్మనీకి చెందిన ‘ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఇంటిగ్రేటివ్‌ నానోసైన్సెస్‌’ పరిశోధకులు వెల్లడించారు. వీర్యకణాలను తొలుత ఔషధ ద్రవంలో ఈదేలా చేసి, ఆ తర్వాత ఇనుప పూత పూసిన హెల్మెట్‌ వంటిదాన్ని వాటి తలకు అమర్చి.. అయస్కాంతం సహాయంతో దాన్ని బయటి నుంచే నడిపించి, నిర్దేశిత లక్ష్యానికి చేర్చవచ్చని.. అక్కడుండే కేన్సర్‌ కణితిలోకి ఆ వీర్యకణం చొచ్చుకుపోయేలా చేయవచ్చని వారు చెబుతున్నారు. తద్వారా ఆ కేన్సర్‌ కణితిని నిర్మూలించవచ్చని వివరించారు. శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలను వదిలి కేవలం కేన్సర్‌కణాలను, కణితులను లక్ష్యంగా చేసుకుని ఔషధాన్ని ప్రయోగించే రకరకాల నానోవాహకాల తయారీకి శాస్త్రజ్ఞులు చాలాకాలంగానే కృషి చేస్తున్నారు. కానీ, వాటికి చాలా పరిమితులు ఉంటున్నాయి. ఈ నేపథ్యంలోనే.. ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని జననాంగ మార్గం గుండా వేగంగా ఈదగలిగే శక్తి సహజంగా ఉన్న వీర్యకణాలపై జర్మన్‌ శాస్త్రజ్ఞులు దృష్టి సారించారు. ప్రయోగశాలలో ఎద్దు వీర్యకణాలతో పరిశోధనలు చేశారు. విజయవంతంగా కేన్సర్‌ కణితులే లక్ష్యంగా ఔషధాన్ని ప్రయోగించగలిగారు. అయితే, ఈ పద్ధతిలో కూడా కొన్ని ఇబ్బందులున్నాయి. వీర్యకణం దారి తప్పి తన సహజ లక్షణం ప్రకారం అండంలోకి చొచ్చుకుపోతే గర్భం వచ్చే ప్రమాదం ఉంది. రెండో ఇబ్బంది.. కణితిలోకి మందును ప్రవేశపెట్టిన తర్వాత, ఇనుప పూత పూసిన హెల్మెట్‌ లోపలే ఉండిపోతుంది. వాటిని బయటకు తీయడం మరో ఇబ్బందికరమైన ప్రక్రియ. తదుపరి దశల్లో వీటన్నిటినీ అధిగమించాల్సి ఉంది.
పనిలో అంతరాయాలకు ‘ఫ్లోలైట్‌’తో చెక్‌
రోహిణి వ్రతం పంచాంగం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *