మార్చి 22న పార్టీ ఇస్తానంటున్న నిఖిల్‌

‘స్వామి రారా’, ‘కార్తికేయ’, ‘సూర్య వర్సెస్ సూర్య’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా!’, ‘కేశవ’..  ఇలా ప్రతీ సినిమాలో ఏదో ఒక ప్రత్యేకత, కొత్తదనం ఉండాలని కోరుకునే నేటి తరం హీరోల్లో నిఖిల్ ముందుంటాడు. ప్రస్తుతం నిఖిల్ ‘కిర్రాక్ పార్టీ’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కన్నడ లో కేవలం 4 కోట్లతో తెరకెక్కి 50 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన ‘కిర్రిక్ పార్టీ’ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా రూపొందుతోంది. 
హిందీ టీవీ సీరియ‌ల్స్‌లో న‌టించే సిమ్రాన్ ప‌రీంజా ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.  ఒరిజినల్ లో ర‌ష్మికా మందానా పోషించిన పాత్రను తెలుగులో సిమ్రాన్ పోషిస్తోంది. సంయుక్తా హెగ్దే మరో ముఖ్యమైన పాత్రలో నటిస్తుంది. ఒరిజినల్ వర్షన్ లోనూ ఈమె ఇదే పాత్రలో కనిపించింది.
నిఖిల్ తో ‘కార్తికేయ’ సినిమా తీసిన దర్శకుడు చందూ మొండేటి ఈ చిత్రానికి మాట‌లు రాస్తుండగా… ‘స్వామి రారా’ తీసిన దర్శకుడు సుధీర్ వ‌ర్మ స్క్రీన్ ప్లే సమకూర్చుతుండడం విశేషం.
కన్నడ మాతృతకు సంగీతం అందించి, దాని ఘన విజయానికి కారణమైన అజ‌నీష్ లోక్‌నాథ్ తెలుగులో కూడా సంగీతం అందిస్తున్నాడు. అతనికి ఇదే తొలి తెలుగు సినిమా కావడం గమనార్హం.
శ‌ర‌ణ్ కొప్పిశెట్టి అనే నూతన ద‌ర్శ‌కుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే చాలా రోజుల కిందట విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లోనే కిర్రాక్ పార్టీ చిత్రాన్ని ఫిబ్రవరి 9న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. అయితే అనివార్య కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం కావడంతో రిలీజ్ ను వాయిదా వేశారు. ప్రస్తుతం కొత్త విడుదల తేదీ ఖరారు చేస్తూ ఓ ప్రకటన చేశారు. మార్చి నెల 22న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు.
 ఫిబ్రవరి చివరన పరీక్షల సీజన్ మొదలవుతుంది. ‘కిర్రాక్ పార్టీ’ వచ్చే సమయానికి అందరికి సెలవులు మొదలవుతాయి. కలెక్షన్లకు ఎటువంటి ఢోకా ఉండదు. ఇంకా ఆలస్యం చేస్తే, తర్వాతి వారంలో ‘మహానటి’, ‘ఎమ్మెల్యే’, ‘రంగస్థలం’ సినిమాలు కాచుకుని ఉన్నాయి. కాబట్టి నిఖిల్ సరైన సమయంలో బాక్సాఫీస్ దగ్గర కిర్రాక్ పార్టీ చేసుకునేందుకు సిద్ధం అవుతున్నాడు.
ఎకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రాంబ్ర‌హ్మం సుంక‌ర దీనికి నిర్మాత గా వ్యవహరిస్తున్నారు.
మెట్రో రైళ్ల వేగం పెంచాలి..
రేపే కమల్ పార్టీ ప్రకటన..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *