కారు కొంటున్నారా? అయితే ఇవి గ‌మ‌నించండి!

కార్లు కొనాలని భావించే వారికి కార్ల కంపెనీలు రాయితీలతో స్వాగతం పలుకుతున్నాయి. వీరికి తోడుగా బ్యాంకులు, బ్యాకింగేతర సంస్థలు కూడా వివిధ రకాల రుణ సదుపాయాల్ని కల్పిస్తున్నాయి. అందుబాటులో ఉన్న ఈ అవకాశాన్ని వినియోగించుకునే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి.

పండుగలు సమీపిస్తుండటంతో వివిధ కార్ల షోరూం డీలర్లు రుణ సంస్థలతో ప్రత్యేక ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఈ తరుణంలో వడ్డీ రాయితీలతోపాటు, నేరుగా వినియోగదారుడికి ప్రయోజనం కల్పించేలా కూడా డీలర్లు ప్రయత్నిస్తున్నారు.

∗ ఈ వడ్డీ రాయితీల నుంచి మనం మేలు పొందాలంటే వాస్తవంగా మనకు వస్తున్న ప్రయోజనం ఏమిటనేదానిపై దృష్టి పెట్టాలి. త‌క్కువ‌ వడ్డీకే కారు రుణం అని అన్నారంటే.. అందులో కొన్ని కనిపించని రుసుములు ఉండేందుకు అవకాశం ఉంది. మనం తిరిగి చెల్లించడం ప్రారంభించి, రుణం పూర్తయ్యేసరికి ఈ లెక్క ఎక్కువే తేలవచ్చు.

∗ ఒకసారి మీరు ఏ కారు కావాలి? ఎవరి దగ్గర్నుంచి రుణం తీసుకోవాలని నిర్ణయించుకోవడం పూర్తయ్యాక, ఏ డీలర్‌ ఎక్కువ రాయితీలు, లేదా కారు ఉపకరణాలు ఇస్తున్నారనే విషయాన్ని ఆరా తీయండి.

∗ రుణం తీసుకునేప్పుడే ఎంత ఈఎంఐ చెల్లించాల్సి వస్తుందనే విషయంలో స్పష్టత ఉండాలి.

∗ మీకు ఎంత రుణం వస్తుందో కూడా ముందుగానే తెలుసుకోండి. దీనికోసం నేరుగా బ్యాంకులను సంప్రదించడం చేయకండి. ఆన్‌లైన్‌లో దీనికోసం ఎన్నో మార్గాలున్నాయి. బ్యాంకులను సంప్రదించిన ప్రతిసారీ మీ వివరాలు సిబిల్‌ నివేదికలో చేరుతాయని మర్చిపోకండి.

∗ రుణం ఇచ్చేముందు బ్యాంకులు మీ వయసు, ఆదాయం, ప్రస్తుతం ఉన్న కంపెనీలో ఎన్నాళ్ల నుంచి పనిచేస్తున్నారు లాంటి విషయాలను పరిగణనలోనికి తీసుకుంటాయి. 28 ఏళ్ల వయసులో ఉన్నవారికి రుణం ఎక్కువ మొత్తంలో రావచ్చు. అదే, 57 ఏళ్ల వయసులో కారు రుణం పొందడం అంత సులభమేమీ కాదు. కొన్ని బ్యాంకులు కనీసం 25 ఏళ్ల వయసు దాటితేనే వాహన రుణాన్ని మంజూరు చేస్తున్నాయి.

∗ వార్షిక ఆదాయం విషయంలోనూ పరిమితులు విధిస్తున్నాయి బ్యాంకులు. జాతీయ బ్యాంకులు కనీసం రూ. 2,50,000 వార్షికాదాయం ఉన్నవారికే అప్పు ఇస్తున్నాయి.

 

ఆర్థిక సంబురాన్ని ఆస్వాదించాలంటే?
ఇలాంటి ఫోన్లు వ‌స్తే.. త‌స్మాత్ జాగ్ర‌త్త‌!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *