రివ్యూ: పూర్ ‘ఇంటిలిజెంట్’

నటీనటులు : సాయి ధరమ్ తేజ్, లావణ్య త్రిపాఠి, రాహుల్ దేవ్, బ్రహ్మానందం, సప్తగిరి, జయప్రకాష్ రెడ్డి తదితరులు
సంగీతం: థమన్ యస్.యస్
నిర్మాత: సి.కళ్యాణ్
కథ-మాటలు: శివ ఆకుల
దర్శకత్వం: వి.వి.వినాయక్
రేటింగ్: 1.5
మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సాయి ధరమ్ తేజ్.. చేసింది కొద్ది సినిమాలే అయినా అనతికాలంలోనే మంచి ఈజ్ వున్న నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. పోలీకల్లో మేనమామను పుణికిపుచ్చుకున్న ఈ యంగ్ హీరో… తన మేనమామ మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఖైది నం150’లాంటి బ్లాక్ బస్టర్ సినిమాకు దర్శకత్వం వహించిన వి.వి.వినాయక్ డైరెక్షన్లో ‘ఇంటిలిజెంట్’ సినిమా చేశాడు. ఈ సినిమా ఈనెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. లావణ్య త్రిపాఠి జంటగా నటించింది. బాలయ్యతో ఇటీవలే ‘జైసింహా’తో మంచి హిట్టుకొట్టిన నిర్మాత సి.కళ్యాణ్.. ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ఈ రోజే విడుదలైంది. మరి సాయిధరమ్ తేజ్ ‘ఇంటిలిజెంట్’గా ఏమాత్రం మెప్పించాడో చూద్దాం పదండి.
కథ: సిన్సియర్ సాఫ్ట్ వేర్ ఉద్యోగి తేజ(సాయిధరమ్ తేజ్). చాలా నిజాయతీ పరుడు. పనిలోనూ.. కంపెనీ యజమాని పట్ల ఎంతో విశ్వాసంతో పనిచేస్తుంటాడు. అలాంటి కంపెనీ యజమాని(నాజర్)ను విలన్(రాహుల్ దేవ్) అండ్ గ్యాంగ్ అంత మొదించి కంపెనీని స్వాధీనం చేయసుకోవాలనుకుంటారు. ఎంతో మంచి వాడైన తేజ.. మరి కంపెనీని.. తన యజమానిని విలన్ అండ్ గ్యాంగ్ నుంచి ఎలా రక్షించుకోగలిగాడు? అందుకోసం అతను ఎత్తిన అవతారం ఏంటి? ఈ క్రమంలో అతనికి విలన్ నుంచి ఎదురైన అడ్డంకులను ఎలా అధిగమించాడనేదే ‘ఇంటిలిజెంట్’ మిగతా కథ.
కథ.. కథనం విశ్లేషణ: ఇదొక పాత చింతకాయ పచ్చడి కథ. విలన్ దౌర్జాన్యాలను.. హీరో వేరే ముసుగులో ఎలా అరికట్టి భరతం పట్టాడనే కథలు కోకొల్లలు చూశాం. సాఫ్ట్ వేర్ ఎంప్లాయి అయిన హీరో.. తన కంపెనీని, తన యజమానిని విలన్ గ్యాంగ్ బలవంతంగా కబ్జా చయాలని చూస్తే.. మారు వేశంలో ధర్మాబాయిగా మారి హీరో ఎలా రక్షించాడనే కథ.. కథనాలు ఏమాత్రం ఆకట్టుకోవు. ఇలాంటి రొటీన్ కథలను నిర్మాత, హీరో, దర్శకుడు తెరకెక్కించానికి ఎందుకు అనుకున్నారో కూడా తెలీదు అనిపిస్తుంది. సినిమా చూస్తున్నంత సేపు ఒకటే ఇరిటేషన్. అసలు ఖైదీ నం150 సినిమాను తీసిన దర్శకుడేనా ఈ సినిమాకు దర్శకత్వం వహించింది అన్నంత అసహనం దర్శకుడిమీద కలుగుతుంది. పోనీ.. కథనం.. సంభాషణలతోనైనా మెప్పించడానికి రచయిత శివ ఆకులు ప్రయత్నించాడా అంటే ఎక్కడా తన పెన్ కు పదును పెట్టలేదు. ఏదో అక్కడక్కడ సప్తగిరి, బ్రహ్మానందం, జయప్రకాష్ రెడ్డి మీద రాసుకున్న రొటీన్ కామెడీ సీన్లు తప్ప.. ఏ కోశానా సినిమాలో ఇంట్రెస్టింగ్ చూసే అంశాలు లేవు. ఈ సినిమాతో సాయిధరమ్ తేజ్.. మరో ఫ్లాపును తన ఖాతాలో వేసుకున్నాడు.
నటీనటుల విషయానికొస్తే… ఇందులో సాయిధరమ్ తేజ్.. ఎప్పటిలాగే పాటలు, డ్యాన్సులతో అదరగొట్టేశాడు. అక్కడక్కడ కామెడీ కూడా పండించాడు. సినిమాను తీరం దాటించడానికి శాయశక్తులా ప్రయత్నించాడు కానీ… అందు తగ్గ స్టఫ్ కథ.. కథనాలలో లేకపోవడంతో తను కూడా ఏమీ చేయలేకపోయాడు. దాంతో మరో ఫ్లాప్ అతనిని పలకరించిందనే చెప్పొచ్చు. లావణ్య త్రిపాఠి గ్లామర్ కే పరిమితం అయింది. ఆమె గురించి చెప్పాడానికి ఏమీ లేదు. చాలా కాలం తరువాత బ్రహ్మానందం ‘జై సింహా’తో సెకెండ్ ఇన్నింగ్ ప్రారంభించి పర్వాలేదు అనిపించాడు. ఇందులో కూడా అతని కామెడీ ఏమంత చెప్పుకోదగ్గదిగా లేదు. సప్తగిరి కామెడీ సీన్స్ బాగున్నాయి. జయప్రకాష్ రెడ్డి, దువ్వాసి మోహన్ పాత్రలు పర్వాలేదు. రాహుల్ దేవ్ పాత్ర కూడా రొటీన్ గా నే వుంది.
పాతకాలం నాటి అరిగిపోయిన కథను తిరగ రాసిన రచయిత ఆకుల శివకు ఈ ప్రాజెక్ట్ ఫెయిల్యూర్ లో మేజర్ షేర్ దక్కుతుంది. ఏమాత్రం ఆకట్టుకోలేని కథ, కథనాలతో ప్రేక్షకులను విసిగించేశాడు దర్శకుడు వి.వి.వినాయక్. గతంలో ఆయన తీసిన చిత్రాలలో అఖిల్ కొంత నిరాశ పరచినా… ఇంటిలిజెంట్ మాత్రం దాన్ని మించిపోయిందనే చెప్పొచ్చు. ఆయన ఏమాత్రం ఎఫర్ట్ పెట్టలేదనే చెప్పొచ్చు. పాటలు పర్వాలేదు. థమన్ మ్యూజిక్ సో..సో. ఎడిటింగ్ ఒకే. సినిమాటోగ్రఫి బాగుంది. దుబాయ్ అందాలను బాగా చూపించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
‘మెహబూబా’ టీజర్ విడుద‌ల‌
విదేశీ నటులతో ర‌వికుమార్ చావ‌లి 'సూపర్ స్కెచ్' !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *