రివ్యూ: బోరింగ్.. మనసుకు నచ్చింది

రేటింగ్: 1.5

సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె మంజుల ఘట్టమనేని తొలిసారిగా మెగా ఫోన్ పట్టి చేసిన సినిమా ‘మనసుకు నచ్చింది’. ఫ్లాపుల్లో వున్న సందీప్ కిషన్, అమైరా దస్తూర్, త్రిదా చౌదరి ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ఇది. ఆమెనే రచన, దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి మంజుల ఘట్టమనేని దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమాత్రం ఆకట్టుకుందో చూద్దాం పదండి.

కథ: సూరజ్(సందీప్ కిషన్), నిత్య(అమైరా దస్తూర్) చిన్ననాటి స్నేహితులు. వారిద్దరికీ పెళ్లి చేయాలనుకుంటారు పెద్దలు. అయితే పెళ్లి పీటల మీద నుంచే ఇద్దరూ గోవాకి పారిపోతారు. అలా పారిపోయిన సూరజ్, నిత్య ఇద్దరూ గోవాలో ఎంజాయ్ చేస్తుంటారు. అక్కడ నిక్కి(త్రిద చౌదరి) మెడిటేషన్ నేర్చుకోవడానికి నిత్య వద్దకు వస్తుంది. సూరజ్ ఆమెకు కనెక్ట్ అయ్యి ప్రేమించేస్తాడు. నిత్య.. అక్కడ హాలిడేస్ కోసం వచ్చిన అభి(అదిత్)ను ఇష్టపడుతుంది. అయితే సూరజ్.. నిక్కికి దగ్గరయ్యే సమయంలో నిత్య… సూరజ్ ని ప్రేమిస్తున్నట్టు ఫీలవుతుంది. మరి వీరిద్దరి ప్రేమ ఎలాంటి పరిణామాలకు దారి తీసింది. చివరకు నిత్య, సూరజ్ ఇద్దరూ ఒక్కటయ్యారా? నిక్కి ప్రేమ చివరకు ఏమైందనేదే మిగతా కథ.
కథ.. కథనం విశ్లేషణ: మనసుకు నచ్చింది.. సినిమాకు టైటిల్ కి ఏమాత్రం సంబంధం లేని సినిమా. బోరింగ్.. కథ కథనాలతో విసిగెత్తించే సినిమా ఇది. ఏమాత్రం పేపర్ వర్క్ చేయకుండా కేవలం.. లొకేషన్స్.. సినిమాటోగ్రఫీని నమ్ముకుని తెరకెక్కించారు. ఎక్కడా ఆసక్తికరమైన సీన్స్ గానీ.. ఎమోషన్స్ గానీ లేకుండా సాదా సీదాగా తెరకెక్కించారు. అసలు ఫ్రెండ్స్ గా వున్న హీరో… హీరోయిన్లిద్దరికీ పెద్దలు ఎందుకు పెళ్లి చేయాలనుకుంటారో? వారి మధ్య ఎలాంటి ఎమోషన్స్ వున్నాయో అనేది కూడా తెలియకుండా పెళ్లి చేయాలనుకోవడం.. వాళ్లిద్దరూ పెళ్లిని కాదనుకుని పారిపోడం… మళ్లి ఇద్దరూ ఒక్కటవ్వడం.. ఇలాంటి స్టోరీ ఎప్పుడో దశాబ్దన్నర క్రితం ‘నువ్వే కావాలి’ సినిమా చూశాం. దాన్నే స్లో నేరేషన్ తో ప్రకృతికి ముడిపెట్టి తెరకెక్కించారు. ఇందులో ప్రధాన బలం సినిమాటోగ్రఫీ. బ్యాక్ గ్రౌండ్ స్కోర్. హీరోయిన్ల అందాలు. అంతే.. ఇంతకు మంచి చెప్పడానికి ఏమీ లేదు. బ్యాడ్ లక్ వన్స్ అగైన్ సందీప్ కిషన్. మంజుల ఘట్టమనేని మంచి కథ.. కథనాలు రాసుకుని వుంటే.. సూపర్ స్టార్ అబిమానులకు పండగే అయ్యేది.
సందీప్ కిషన్ నటన పర్వాలేదు. అలానే అమైరా దస్తూర్, త్రిద చౌదరి అందాలు యూత్ ని బాగా ఆకట్టుకుంటాయి. అందమైన గోవా లొకేషన్స్ లో వీరి అందాలు మరింత అందంగా తెరకెక్కించారు. వీరితో పాటు నటించిన ప్రియదర్శన్ నటన పర్వాలేదు. ఎప్పుడూ నవ్వించే పాత్రలు వేసే ప్రియదర్శన్ ఇందులో కొంత సీరియస్ పాత్ర వేశారు. అది పెద్దగా కనెక్ట్ అవ్వదు. అదిత్ వున్నది కాసేపే అయినా… పెద్దగా ఆకట్టుకోడు. మిగతా పాత్రలు వేసిన నాజర్, గీత పాత్రలు అంతంత మాత్రమే.
చిత్రానికి దర్శకత్వం వహించిన మంజుల ఘట్టమనేని ఏమాత్రం ఆకట్టుకునే కథ.. కథనాలను తెరకెక్కించలేకపోయారు. సినిమా మొదటి రీల్ మొదలు.. చివరి దాకా నత్తనడకలా సాగిపోతుంది సినిమా. దాంతో ప్రేక్షకులు భారంగా కూర్చోవాల్సిన పరిస్థితి. ఎప్పుడెప్పుడు సినిమా అయిపోతుందా అని ఎదురు చూడాల్సిన పరిస్థతి ప్రేక్షకులది. సంగీతం కూడా అంతంత మాత్రమే. నేపథ్య సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటింగ్ ఇంకాస్త కట్ చేస్తే బాగుండు. ఓవరాల్ గా సందీప్ కిషన్ కి బ్యాడ్ లక్.
జే.ఎఫ్.సి కీ మా సంఘీభావం..
మెట్రోరైలులో యువతికి లైంగిక వేధింపులు...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *