ఏఎన్ఆర్ పాత్ర‌లో న‌టిస్తున్న నాగ‌చైతన్య‌…

ఎన్‌టీఆర్ పౌరాణిక సినిమాల‌తో తెలుగు ప్ర‌జ‌ల హృద‌యాల్లో దేవుడిగా నిలిస్తే, సాంఘిక చిత్రాల‌తో సామాజిక చైత‌న్యం తెచ్చేందుకు త‌న వంతు కృషి చేశాడు అక్కినేని నాగేశ్వ‌ర‌రావు. ఆయ‌న న‌టించిన ‘దేవ‌దాసు’, ‘ప్రేమ్‌న‌గ‌ర్‌’, ‘ప్రేమాభిషేకం’ వంటి చిత్రాలు ఆల్ టైమ్ క్లాసిక్స్ చిత్రాలుగా తెలుగు సినీ చ‌రిత్ర‌లో నిలిచిపోయాయి.  ఏఎన్ఆర్ కు ఓ ప్ర‌త్యేక‌మైన బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఆయ‌న న‌ట‌న‌లో ఓ ఈజ్ ఉంటుంది. అందుకే ఆయ‌న‌ని ‘న‌ట‌సామ్రాట్‌’ అని పిలుస్తారు. అటువంటి ఏఎన్ఆర్ పాత్ర‌ను తెర‌పైన పోషించ‌డానికి సిద్ధ‌మ‌వుతున్నాడు ఆయ‌న మ‌న‌వ‌డు అక్కినేని నాగ‌చైత‌న్య.

అల‌నాటి అందాల తార‌, ‘మ‌హాన‌టి’ సావిత్రి జీవిత క‌థ ఆధారంగా ‘మ‌హాన‌టి’ బ‌యోపిక్ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో మ‌హాన‌టిగా కీర్తిసురేష్ టైటిల్ పాత్ర పోషిస్తోంది. సావిత్రి బ‌యోపిక్ అన‌గానే అందులో క‌చ్చితంగా అల‌నాటి లెజెండ్ న‌టులు ఏఎన్ఆర్‌, ఎన్‌టీఆర్ ఉండి తీరాల్సిందే. వారి పాత్ర‌ల‌ను వారి మ‌న‌వ‌ళ్ల‌తో న‌టింప‌చేయాల‌ని చిత్ర ఆరంభం నుంచి ప్ర‌య‌త్నిస్తోంది నిర్మాత స్వ‌ప్నా ద‌త్‌. తాజాగా త‌న తాతగారి పాత్ర‌ను పోషించేందుకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చేశాడు చైతూ. కేవ‌లం అతిథి పాత్ర కావ‌డంతో ఈ సినిమా కోసం రెండు రోజుల కాల్షీట్లు కూడా ఇచ్చాడు.

అయితే ఎన్‌టీఆర్ పాత్ర‌ను చేయ‌డానికి మాత్రం ఆయ‌న మ‌న‌వ‌డు జూనియ‌ర్ ఎన్‌టీఆర్ నిరాక‌రించాడు. కార‌ణం ఆయ‌న అతిథి పాత్ర‌లో న‌టించిన ‘చింత‌కాయల ర‌వి’, ఆయ‌న వాయిస్ ఓవర్ చెప్పిన ‘రామ‌రామ కృష్ణ కృష్ణ‌’ చిత్రాలు బాక్సీఫీస్ ద‌గ్గ‌ర ప‌రాజ‌యం చెంద‌డ‌మే. ఈ సెంటిమెంటు కార‌ణంగా ఆయ‌న ‘మ‌హానటి’ సినిమాలో అతిథి పాత్ర చేసేందుకు నిరాక‌రించారు. అయితే చిత్ర నిర్మాత స్వ‌ప్నా ద‌త్‌, ఎన్‌టీఆర్‌కు మంచి స్నేహితురాలు. దాంతో క‌చ్చితంగా ఆయ‌న‌ను ఒప్పించే ప‌నిలో ప‌డింది. అయితే ఎన్‌టీఆర్ ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ సినిమా, రాజ‌మౌళి సినిమాల కోసం శారీర‌కంగా సిద్ధ‌మ‌య్యేందుకు అమెరికా వెళ్లాడు. అత‌ను తిరిగి రాగానే త్రివిక్ర‌మ్ సినిమా మొద‌ల‌వుతుంది. దాంతో ఆయ‌న చాలా బీజీగా ఉంటాడు. ఒక‌వేళ ఎన్‌టీఆర్ క‌చ్చితంగా నో చెప్పిన‌ట్ల‌యితే, ఎన్‌టీఆర్ పాత్ర‌లో న్యాచుర‌ల్ స్టార్ నానినీ న‌టింప‌చేయాల‌ని చూస్తోంది చిత్ర యూనిట్‌. నాని సూట్ కాక‌పోతే పాత ఎన్‌టీఆర్‌నే గ్రాఫిక్స్ ద్వారా సృష్టించాల‌ని ప్ర‌య‌త్నిస్తున్నారు.

నాని హీరోగా వ‌చ్చిన ‘ఎవ‌డే సుబ్ర‌హ్మ‌ణ్యం’ చిత్ర ద‌ర్శ‌కుడు నాగ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ‘మ‌హాన‌టి’ సినిమా రూపొందుటుండ‌డంతో ఎన్‌టీఆర్ పాత్ర‌లో న‌టించేందుకు నాని నో చెప్ప‌డ‌నే ఆశాభావం వ్య‌క్తం చేస్తోంది చిత్ర‌యూనిట్‌. ఇందులో అక్కినేని వారి కోడ‌లు స‌మంత కూడా ఓ కీల‌క పాత్ర పోషిస్తుండ‌డం విశేషం. ‘అర్జున్‌రెడ్డి’ ఫేం షాలినీ పాండే, విజ‌య్ దేవ‌ర‌కొండ‌, దుల్క‌ర్ స‌ల్మాన్‌, అనుష్క‌, ద‌ర్శ‌కుడు క్రిష్‌, మోహ‌న్‌బాబు త‌దిత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మార్చి 28న విడుద‌ల‌వుతుంద‌ని ప్ర‌క‌టించిన ఈ చిత్రం, జూన్‌కి వాయిదా ప‌డుతున్న‌ట్టు స‌మాచారం.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ లొకేష‌న్‌.. గుంటూరులో!
జాతీయ ర‌హ‌దారి ప‌క్క‌న‌ పోలీసు స్టేష‌న్లు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *