ప‌వ‌న్‌కి అన్ని డ‌బ్బులెలా వ‌చ్చాయి చెప్మా!

‘‘నా ద‌గ్గ‌ర డ‌బ్బులేవు. కేవ‌లం డ‌బ్బుల కోస‌మే ఇష్టం లేక‌పోయినా సినిమాల్లో న‌టిస్తున్నా…’’ ఇది స్వ‌యంగా జ‌న‌సేన అధినేత‌, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ జ‌న‌సేనాని ప్ర‌జా యాత్ర‌లో భాగంగా చెప్పిన మాట‌. అంటే ఆయ‌న‌కి ఆర్థిక క‌ష్టాలు ఉన్నాయ‌ని ఒప్పుకున్నాడు. అలాంటి ప‌వ‌న్‌, నేడు ఏకంగా రేట్లు మండిపోతున్న మంగ‌ళ‌గిరిలో రెండు ఎక‌రాలు కొని, అందులో విలాస‌వంత‌మైన ఇల్లు, జ‌న‌సేన పార్టీ కార్యాల‌య ఏర్పాటుకి శంఖుస్థాప‌న చేశాడు. ‘అజ్ఞాత‌వాసి’ విడుద‌లకు ముందు, డ‌బ్బులే లేని ప‌వ‌న్‌కి ఇప్పుడు ఇన్ని డ‌బ్బులు ఎక్క‌డి నుంచి వ‌చ్చాయా… అని రాజ‌కీయ విశ్లేష‌కులు, సినీ అభిమానులు చ‌ర్చించుకుంటున్నారు.

ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కి పెద్ద‌గా ఆస్తులేమీ లేదు. ఎన్‌టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ మాదిరిగా భార్య త‌ర‌పు నుంచి పెద్ద ఆస్తులేవీ క‌లిసి రాలేదు. వ‌చ్చినా మ‌నోడు భార్య‌ల‌తో పాటు వాటినీ వ‌దిలించుకున్నాడ‌ని అంద‌రికీ తెలిసిన విష‌య‌మే. అలాంట‌ప్పుడు ఆయ‌న‌కి ఇప్ప‌టికిప్పుడు భార్య‌త‌ర‌పు నుంచి పెద్ద‌గా ఆస్తులేవీ వ‌చ్చి ప‌డే ప‌రిస్థితి లేదు. అదీ కాక ప‌వ‌న్‌క‌ల్యాణ్‌ శంకుస్థాప‌న చేసిన మంగ‌ళ‌గిరి ఖాజా ఏరియాలో ఎంత లేద‌న్నా గ‌జం రేటు 16 వేల రూపాయ‌లు ఉంటుంది. రెండు ఎక‌రాల ఫ్లాట్ అంటే దాదాపు 16 కోట్ల రూపాయ‌ల‌కు పైనే ఖ‌రీదు చేస్తుంది. అభిమాన హీరో క‌దా… అని ఆయ‌న అభిమాని ఎవ‌రైనా, త‌న‌కి త‌క్కువ‌కి అమ్మినా మ‌హా అయితే కోటి త‌గ్గించి ఉండ‌వ‌చ్చు. అంటే 15 కోట్లు. ఇది కేవ‌లం జాగా కోస‌మే. మ‌రి ఇల్లు, పార్టీ ఆఫీస్ నిర్మాణానికి ఎంత లేద‌న్నా, మూడు, నాలుగు కోట్ల రూపాయ‌లు కావాలి. మ‌రీ రిచ్‌గా క‌ట్టాల‌నుకుంటే ఇంకా ఎక్కువే అవుతుంది.

ప‌వ‌న్‌క‌ల్యాణ్ అజ్ఞాత‌వాసి సినిమాకి 25 కోట్ల రూపాయ‌లు పుచ్చుకున్నాడ‌ని టాక్ వినిపించింది. అది నిజ‌మ‌ని అనుకున్నా, ఆ సినిమా ఘోర ప‌రాజ‌యం చెంద‌డంతో అందులో చాలాభాగం నిర్మాత‌కి తిరిగి ఇచ్చేశాడ‌ని ఆయ‌న అభిమానులు ప్ర‌చారం చేశారు. ఆ ప్ర‌చారం నిజ‌మ‌ని న‌మ్మితే, ఇప్పుడు ఈ డబ్బు ఎక్క‌డ నుంచి అందింద‌ని అనుమానం వ్య‌క్తం అవుతోంది. త‌న‌ తండ్రి మంగ‌ళ‌గిరి ప్రాంతంలో కానిస్టేబుల్గా ప‌నిచేశాడ‌ని, అందుకే ఆయ‌న ప‌నిచేసిన ప్రాంతంలో సొంత ఇల్లు క‌ట్టుకోవ‌డం ఆనందంగా ఉంద‌ని అన్నాడు ప‌వ‌న్ క‌ల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ. ఇన్ని డ‌బ్బులు ఎలా వ‌చ్చాయో మాత్రం చెప్ప‌లేదు.

ఇదిలా ఉండ‌గా జ‌న‌సేన పార్టీ ‘జనసేన శతఘ్ని’ తాజాగా ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై ఓ వీడియో విడుద‌ల చేసింది. ఇందులో గ‌డిచిన ఆరేళ్ల‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ 75 కోట్లు సంపాదించాడ‌ని, అందులో 25 కోట్లు ప‌న్నుల రూపంలో చెల్లించాడ‌ని చెప్పింది. ఇంత నిజాయితీ గ‌ల నాయ‌కుడు ఇంకెక్క‌డైనా దొర‌కుతాడా? అంటూ సొంత నాయ‌కుడిని పొగిడేసింది. మ‌రి ఆరేళ్ల ఖ‌ర్చుల మాటేంటి?  మిగిలిన‌దంతా ఇప్పుడు ఇంటికి ఖ‌ర్చు చేస్తే, భ‌విష్య‌త్తులో పార్టీ న‌డ‌వ‌డం ఎలా?  వ‌చ్చే ఏడాది ఎన్నిక‌ల్లో పార్టీ గెలిస్తే, స‌రే! ఓడిపోతే… జ‌న‌సేన‌, మ‌రో ప్ర‌జారాజ్యం అవుతుంద‌ని ప‌వ‌న్ అభిమానులు కూడా గుస‌గుస‌లు ఆడుకుంటుండ‌డం విశేషం.

బావ బాబుమోహ‌న్‌, నా కంటూ ముందుండేవాడు!
నటుడు సత్యనారాయణ కన్నుమూత

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *