సీఎం చంద్ర‌బాబు మాట‌ల్లో ద‌క్షిణాది భావన..!

ఉత్తారాది ఆధిప‌త్యం, ద‌క్షిణాదిని నిర్ల‌క్ష్యానికి గురౌతోంది.. అన‌గానే ఎవ‌రికైనా గుర్తొచ్చేది జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఎందుకంటే, జ‌న‌సేన పార్టీ పెట్టిన ద‌గ్గ‌ర నుంచీ దాదాపు అన్ని ప్ర‌ధాన స‌భ‌ల్లోనూ ద‌క్షిణాది నిర్ల‌క్ష్యానికి గురౌతోంద‌ని ప‌వ‌న్ మాట్లాడుతూ ఉండేవారు. అయితే, ఇప్పుడు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు నోట కూడా దాదాపు అలాంటి మాట‌లే వ‌స్తున్నాయి. ఆయ‌న కూడా ద‌క్షిణాది, ఉత్తరాది అంటూ స‌భ‌లో మాట్లాడారు. ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు సంద‌ర్భంగా ఆయ‌న శాస‌న మండ‌లిలో మాట్లాడారు. మ‌రోసారి కేంద్రంపై విమ‌ర్శ‌లు చేశారు. విభ‌జ‌న హామీలు నెర‌వేర్చాల‌నీ, ఆంధ్రా ప్ర‌యోజ‌నాల‌ను కాపాడాలంటూ కేంద్రానికి మ‌రోసారి విజ్ఞ‌ప్తి చేశారు.
సెంటిమెంట్ పేరు చెప్పి ఆందోళ‌న‌లు చేస్తే నిధులు కేటాయింపుల‌పై ఎలాంటి ప్ర‌భావం ఉండ‌ద‌ని కేంద్రం అంటోంద‌ని సీఎం చంద్ర‌బాబు గుర్తు చేశారు. అయితే, అదే సెంటిమెంట్ కి గౌర‌వించి నాడు రాష్ట్ర విభ‌జ‌న చేసింది కేంద్ర‌మే క‌దా అన్నారు. రాష్ట్ర విభ‌జ‌నలో భాజ‌పాకి కూడా భాగ‌స్వామ్యం ఉంద‌నీ, ఆంధ్రాను విడ‌గొట్టేందుకు వారు కూడా నాడు పార్ల‌మెంటులో ఆమోదం తెలిపార‌న్నారు. అందుకే, విభ‌జ‌న హామీలు అమ‌లు చేయాల్సిన బాధ్య‌త భాజ‌పా సర్కారుపై ఉంద‌న్నారు. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో అప్ప‌టి సెంటిమెంట్ ను ఏవిధంగా అయితే గౌర‌వించారో, ఇప్పుడు ఏపీ ప్ర‌త్యేక హోదా సెంటిమెంట్ ను కేంద్రం గౌర‌వించాల‌న్నారు. ఇక‌, నిధుల గురించి మాట్లాడుతూ మీ డ‌బ్బూ మా డ‌బ్బూ అనే తేడా ఎక్క‌డా ఉండ‌ద‌నీ, ఇదంతా ప్ర‌జ‌ల సొమ్ము మాత్ర‌మే అవుతుంద‌న్నారు. దేశానికి అత్య‌ధికంగా ప‌న్నులు చెల్లిస్తున్న‌ది దక్షిణాది రాష్ట్రాలేన‌నీ, కేంద్రానికి అధిక ఆదాయం ఇస్తున్న‌ది ప్రాంతాలు ఇవేన‌నీ, వీటితో ఉత్త‌రాదిని అభివృద్ధి చేసుకుంటున్నార‌ని చంద్ర‌బాబు ఆరోపించారు. ప్ర‌త్యేక హోదా అనేది ఆంధ్రుల హ‌క్కు అనీ, దాన్ని క‌చ్చితంగా ఇచ్చితీరాలంటూ డిమాండ్ చేశారు.
మొత్తానికి, ద‌క్షిణాది నుంచే కేంద్రానికి అత్య‌ధికంగా ప‌న్నులు వెళ్తున్నాయ‌నీ, కేంద్రం ఆదాయంలో అధిక భాగం ఇక్క‌డి నుంచే స‌మ‌కూరుతోంద‌ని వ్యాఖ్యానించ‌డం కాస్త ప్ర‌త్యేకంగానే చూడాలి. ఎందుకంటే, గ‌తంలో ఎప్పుడూ ఇలాంటి వాద‌న‌న ఆయ‌న నోట విన‌లేదు. అంతేకాదు, ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా ప‌దేప‌దే ఇదే టాపిక్ మాట్లాడితే.. చాలా మంది నాడు విమ‌ర్శించారు. దేశాన్ని రెండుగా ఎందుకు చూస్తున్నార‌ని అనేవారు. కానీ, ఇప్పుడు చంద్ర‌బాబు కూడా అలాంటి అభిప్రాయాన్నే ప‌రోక్షంగా వ్య‌క్తం చేస్తున్నారు.
ఆశావ‌హుల‌ను అలా బుజ్జ‌గించాల్సి వ‌స్తోంద‌న్న‌మాట‌..!
కోమ‌టిరెడ్డి కొత్త రూల్స్ చెబుతున్నారే..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *