క‌ర్ణాట‌క‌లో కూడా భాజ‌పాకి తెలుగువారి టెన్ష‌న్‌..!

ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో భాజ‌పా వ్య‌తిరేక‌త రోజురోజుకీ పెరుగుతోంద‌ని అన‌డంలో ఏమాత్రం సందేహం లేదు. రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత భాజ‌పా ఆదుకుంటుంద‌నీ, న‌రేంద్ర మోడీ ప్ర‌ధాని అయితే ఏదో చేస్తార‌న్న ఆశ‌తో ఆద‌రించారు. అయితే, గ‌డ‌చిన నాలుగేళ్ల‌లో ఆంధ్రాకి కేంద్రం చేసిందేం లేదంటూ అధికార పార్టీ టీడీపీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తుండ‌టం, ఆ పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు రాజీనామాలు, త్వ‌ర‌లోనే ఎన్డీయే పొత్తు నుంచి బ‌య‌ట‌కి వ‌చ్చేందుకు టీడీపీ రెడీ ఉండ‌టం.. ఈ ప‌రిణామాల‌న్నీ భాజ‌పాకి కొంత త‌ల‌నొప్పిగా మారుతున్న వ్య‌వ‌హారాలే. అయితే, బ‌య‌ట‌కి ఆ ఫీలింగ్ క‌నిపించ‌నీయ‌కున్నా… లోలోపల భాజ‌పాలో అంత‌ర్మ‌థ‌నం బాగానే జ‌రుగుతోంద‌న‌డానికి క‌ర్ణాట‌క ఎన్నిక‌ల అంశ‌మే ఒక ఉదాహ‌ర‌ణ‌..!
క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న సంగ‌తి తెలిసిందే. అక్క‌డ ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మ‌రోసారి త‌మ ఆధిప‌త్యాన్ని కాపాడుకోవ‌డం కోసం సిద్ధ‌రామ‌య్య కూడా భాజ‌పాతో ధీటుగానే పోరాటం చేస్తున్నారు. అయితే, తిమ్మిని బ‌మ్మి చేసైనా స‌రే క‌న్న‌డనాట భాజ‌పా స‌ర్కారు ఆధిప‌త్యంలోకి రావాల‌న్న పంతంతో ఆ పార్టీ నేత‌లు ఉన్నారు. అయితే, ఇక్క‌డ వీరికి కొత్త‌గా పంటికింద రాయిలా మారుతున్న స‌మ‌స్య ఏంటంటే… కర్ణాట‌క‌లో స్థిర‌ప‌డ్డ తెలుగువారు..! బ‌ళ్లారి, కోలార్‌, బెంగ‌ళూరు వంటి ప్రాంతాల్లో చాలామంది తెలుగువారు ఉంటున్నారు. ఉపాధి కోసం ఎన్నో యేళ్ల కింద‌ట ఆ రాష్ట్రానికి చేరుకుని, అక్క‌డే స్థిర‌ప‌డ్డ‌వారు కొన్ని నియోజ‌క వ‌ర్గాల్లో పెద్ద సంఖ్య‌లో ఉన్నారు. వీరంద‌రికీ ఆంధ్రా మూలాలు ఉన్నాయి.
అయితే, ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌యోజ‌నాల‌ను భాజ‌పా ప‌ట్టించుకోవ‌డం లేద‌నే వ్య‌తిరేక భావ‌న ఆంధ్రాలో మెండుగా ఉంది. కాబ‌ట్టి, త‌మ సొంత రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న భాజ‌పాకి తాము ఎందుకు ఓటెయ్యాల‌నే అభిప్రాయం అక్క‌డి తెలుగువారిలో క‌లిగితే.. భాజ‌పాకి పెద్ద స‌మస్యే అవుతుంది. అందుకే, ముంద‌స్తుగా తెలుగువారి ప్రాభ‌వం ఉన్న ప్రాంతాల్లో భాజ‌పా నేత‌లు స‌మావేశాలు నిర్వ‌హించ‌బోతున్నారు. త‌ద్వారా అక్క‌డి తెలుగు ప్ర‌జ‌ల మూడ్ ఎలా ఉందో తెలుసుకుంటార‌ట‌. వాస్త‌వం ఏంటంటే… మూడ్ గురించి ప్ర‌త్య‌కంగా తెలుసుకోవాల్సిన ప‌నేముంది..?  ఆంధ్రాకు అన్యాయం జ‌రుగుతోంద‌న్న భావ‌న క‌లిగితే.. ఆంధ్రులు పక్క‌రాష్ట్రంలో ఉన్నా వేరే దేశంలో ఉన్నా ఎమోష‌న‌ల్ గా స్పందించ‌డం అనేది స‌హ‌జ‌మైన అంశం క‌దా! ఆంధ్రాలో భాజ‌పా వ్య‌తిరేక‌త ఇప్పుడు క‌ర్ణాట‌క‌లో కూడా ఆ పార్టీకి స‌మస్య‌గా మారే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.
తెలంగాణకు మరో ప్రముఖ పరిశ్రమ
అంత‌వర‌కూ రాఘ‌వేంద్ర‌రావు ఎదురుచూడాలా..?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *