పరగడుపున నిమ్మరసం ఎందుకు?

ఉదయంపూట పరగడుపునే నిమ్మరసం తాగడం మేలని ఆరోగ్య నిపుణులు చెబుతుండటం తరచూ వింటూ ఉంటాం. నిమ్మకాయలు అందరికీ అందుబాటులో ఉండేవే. అందరినీ వేధించే అధిక బరువు సమస్య పరిష్కారంలో నిమ్మరసం కూడా సహాయపడుతుంది. మరి నిమ్మకాయలో ఉండే పోషక పదార్థాలు, అవి మన శరీరానికి ఎలా ఉపయోగపడతాయో తెలుసుకుందామా?

  1. అధిక బరువు తగ్గించుకునే యత్నంలో ఉన్నవారికి గోరువెచ్చటి నిమ్మరసంలో తేనె కలుపుకుని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. నిమ్మలో పీచుపదార్థం పాళ్లు ఎక్కువ. ఇది ఆకలిని తగ్గించి, చాలాసేపటి వరకు పొట్ట నిండుగా ఉన్న భావన కలిగిస్తుంది. నిమ్మరసం, తేనెల మిశ్రమానికి ఉండే ఆల్కలైన్ గుణం వల్ల వేగంగా బరువు తగ్గడంలో తోడ్పడుతుంది.

  2. రోజూ నిమ్మరసం తాగడం వల్ల మీ చర్మంలో వచ్చే మార్పు చూసి మీరే ఆశ్చర్యపోతారు. నిమ్మరసం రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కొత్త రక్తకణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. నిమ్మలో ఉండే విటమిన్ సి, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ముడతల బారి నుంచి రక్షిస్తాయి. దీనివల్ల చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.

  3. గోరువెచ్చటి నిమ్మరసం రోగనిరోధక వ్యవస్థను చైతన్యవంతంగా మారుస్తుంది. జలుబు, ఫ్లూ వంటివి రాకుండా నిరోధించడంలో విటమిన్ – సి అద్భుతంగా పని చేస్తుంది. అది నిమ్మలో అధికంగా ఉంటుంది కాబట్టి రోగనిరోధకశక్తిని పెంచుతుంది. పైగా శరీరానికి ఉండే ఇనుమును శోషించుకునే సామర్థ్యాన్ని నిమ్మరసం (Lemon juice) పెంచుతుంది.

  4. నిమ్మలో ఉండే ఆమ్లతత్వం, తేనెలోని ఔషధ గుణాలు నోటి దుర్వాసనను అరికట్టడానికి ఉపయోగపడతాయి. ఇవి నోటిని శుభ్రం చేసి, లాలాజలం ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. లాలాజలం దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియా నశించేలా చేస్తుంది. నిద్రించేటప్పుడు నాలుకపై పేరుకునే తెల్లటి పొరను నిమ్మరం నిరోధిస్తుంది. ఆహారం తిన్నాక ఏర్పడే బ్యాక్టీరియా వల్ల ఈ పొర ఏర్పడుతూ ఉంటుంది. ఇదే నోటి దుర్వాసనకు కారణమవుతుంటుంది.

  5. నిమ్మకాయలో ఉండే పదార్థాలు కాలేయం ఎక్కువ బైల్ ను ఉత్పత్తి చేసేలా ప్రేరేపిస్తాయి. తద్వారా జీర్ణక్రియ మెరుగవుతుంది. అంతేకాదు.. అనవసర వ్యర్థాలను, టాక్సిన్లను జీర్ణవ్యవస్థ బయటికి పంపేసేలా చేసే గుణం నిమ్మకాయకు ఉంది. రోజూ గోరు వెచ్చటి నిమ్మరసం తాగడం వల్ల అజీర్తి, గుండెల్లో మంట లాంటి సమస్యలు దరిచేరవు. అమెరికన్ క్యాన్సర్ ఇన్స్ స్టిట్యూట్ గోరువెచ్చటి నీటిలో నిమ్మరసం, తేనె కలుపుకుని తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదని సిఫారసు చేసింది.

  6. నిమ్మలో ఉండే సిట్రిక్, ఆస్కార్బిక్ ఆమ్లాలు శరీర పీహెచ్ స్థాయులను సమతౌల్యంగా ఉండేలా చేస్తాయి. ఎసిడిటితో బాధపడేవారికి శరీర పీహెచ్ లెవెల్ మంచిగా ఉండటం తప్పనిసరి. అలా నిమ్మరసం ఎసిడిటీ నుంచి కూడా కాపాడుతుందని తేలింది. పొద్దున్నే పరగడుపున నిమ్మరసం తాగడం వల్ల ఎసిడిటీని నివారించవచ్చు.  అందుకే.. ఉదయం వేళలో అల్పాహారానికి కనీసం అరగంట ముందుగా ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో ఒక స్పూన్ నిమ్మరసం, కొంచెం తేనె కలుపుకుని తాగితే.. ఆరోగ్యానికి అన్ని విధాల మంచిది..

 

మ‌హిళా దినోత్స‌వం రోజే అమానుషం
మూలాలు మ‌రుస్తున్న కేసీఆర్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *