న‌రేంద్ర‌ మోడీ.. ముందునుయ్యి.. వెన‌క గొయ్యి!

న‌రేంద్ర‌ మోడీ.. ఉత్తర ప్రదేశ్ ఓటర్లను తీవ్రస్థాయిలో ప్రభావితం చేయటానికి 2014లో తానే స్వయంగా వారణాసి నుంచి బరిలోకి దిగి .. గరిష్టంగా 71 సీట్లను గెలవటం ద్వారా ఆ రాష్ట్ర ప్రజల మనసుల్ని కొల్ల‌గొట్టారు. నేడు అదే కార్యక్షేత్రం నుంచి వెనకడుగు వేస్తున్నారా? 2019 ఎన్నికల్లో వేరే స్థానానికి మారే యోచన చేస్తున్నారా? అధికారం చేపట్టిన వెంటనే తనకు గిట్టని సీనియర్లను ’75’ నిబంధనతో క్యాబినెట్ కు దూరం పెట్టిన మోడీ.. నేడు అదే సీనియర్లను ప్రసన్నం చేసుకుని , ఐక్య ప్రతిపక్షం సవాలును సమర్థంగా ఎదుర్కోవాలనుకుంటున్నారా? ఈ ప్రశ్నలన్నింటికీ ఆస్కారం కలిగించే రీతిలో ప్రధాని మోడీ ప్రస్తుత వ్యవహార శైలి ఉంది.

ప్రస్తుతం యూపీ పర్యటనలో ఉన్న మోడీ ఈమేరకు సొంతపార్టీ శ్రేణులతోపాటు ప్రత్యర్థి రాజకీయ పార్టీలకూ సాధారణ ప్రజానీకానికీ కావాల్సినన్ని సంకేతాలిచ్చారు. భాజపా సీనియర్ నేత మురళీమనోహర్ జోషి..మళ్ళీ పోటీచేయాలని మోడీ ఆకాంక్షించారు. గతంలో వారణాసి ఎంపీగా ఉన్న జోషిని పక్కనబెట్టి మరీ మోడీ తానే అక్కడి నుంచి పోటీచేసి.. ఆయన్ను క్యాబినెట్ లోకి సైతం తీసుకోవడం ఇష్టంలేక , చివరికి 75 ఏళ్ళు నిండిన వారికి క్యాబినెట్ లో చోటు లేదని నిర్ణయించారు. క్యాబినెట్ లోకి తీసుకుని ఆ తర్వాత రాజ్యసభ అవకాశం ఇస్తారని జోషీ ఆశగా ఎదురుచూసినా అడియాసే అయింది. 2019 ఎన్నికల ప్రచారాన్ని స్వయంగా ప్రారంభించి.. పార్టీని నడిపించాలంటూ తన గురువైన ఎల్.కె. ఆద్వానీని మోడీ ఇప్పటికే కోరారని పార్టీ వర్గాల సమాచారం. ఇన్నాళ్ళూ ప్రధాని పదవిలో కొనసాగుతూ అన్నీ తానే అయి నడిపిస్తున్న మోడీ.. ఇటీవలికాలంలో రాజకీయంగా ఎదురు దెబ్బలు తగులుతుండటంతో.. తాను దూరం పెట్టిన సీనియర్లు మళ్ళీ చురుగ్గా పార్టీ ఉన్నతి కోసం పని చేస్తేనే కానీ పునరధికారం సాధ్యం కాదన్న అభిప్రాయంతో నాయకత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఇది పార్టీలో సహజంగానే చర్చనీయాంశంగా మారింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి , ఉప ముఖ్యమంత్రి మౌర్యలు రాజీనామా చేసిన గోరఖ్ పూర్ , పూల్ పూర్ లోక్ సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో భాజపా ఘోరంగా ఓడిపోయింది. ఉత్తరప్రదేశ్ లోని ప్రతిపక్షాలన్నీ ఐక్యంగా పనిచేసిన అద్భుతమైన దృశ్యం అక్కడ ఆవిష్కృతమైన కారణంగానే భాజపా మట్టి కరిచింది. ఈ పరిణామం మోడీ – అమిత్ షా ద్వయంతోపాటుగా యావత్ భాజపా శ్రేణుల్ని కలవరపర్చాయి. దీర్ఘకాలంగా పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ రెండు నియోజకవర్గాల్లో పార్టీ తుడిచిపెట్టుకుపోవటాన్ని భాజపా శ్రేణులు జీర్ణించుకోలేకపోయాయి. ‘ఐక్యప్రతిపక్షం’ భవిష్యత్తు లోనూ ఇలాగే పోటీచేసి.. మోడీకి షాక్ ఇస్తామని , వారణాసిలోనూ మోడీపై గెలిచేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్సాహంగా ప్రకటించారు. దీనితో మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిపై యావత్ దేశం దృష్టీ నిలిచింది. ఆద్యాత్మిక పరంగా ‘కాశీ‘, విద్యా పరంగా ‘బెనారస్‘ , వ్యాపార పరంగా ‘వారణాసి ‘గా ప్రజలు వ్యవహరించే ఈ పుణ్యక్షేత్రంపై దేశప్రజలకు ఎంతో మక్కువ. దీనికి ప్రాతినిధ్యం వహించటం ద్వారా మెజారిటీ మతస్థుల అభిమానం పొందవచ్చన్న మోడీ ఆలోచన గరిష్టంగా ఫలితాన్నిచ్చి , యూపీలోని మొత్తం 80 లోక్ సభ సభ సీట్లలో 71 స్థానాల్ని భాజపా గెలుచుకోగలిగింది. ఇప్పుడంతటి ఫలితాలు సాధించేందుకు ప్రయత్నించటం ఓ రకంగా అవివేకమనే చెప్పాలి. ఈ కారణంగా వచ్చే ఎన్నికల్లో వారణాసి కాకుండా మరోచోట పోటీ చేయాలన్న ఆలోచనలో మోడీ ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే ఉద్దేశ్యంతో భాజపాలో తనకంటే సీనియర్లయిన నాయకులను మోడీ వ్యూహాత్మకంగా ఇలాంటి విషయాల్ని విడమర్చి చెప్పి ఉంటారని సమాచారం. సాధారణంగా ప్రధాని అంతటివారు నియోజకవర్గం మారితే.. కొత్తసీటుకు జరగబోయే ఎన్నిక పైనే దేశ ప్రజల కేంద్రీకృతమై ఉంటుంది. కానీ రేపు మోడీ వారణాసిని వదిలిపెడితే.. ఓటమి భయంతోనే వదలి వెళ్ళిపోయారన్న అపప్రధ అప్పనంగా వచ్చేస్తుంది. వద్దులెమ్మని వారణాసిలోనే కొనసాగితే మాత్రం ..’ఐక్య ప్రతిపక్షం’ దెబ్బకు ఏమాత్రం తట్టుకుని నిలబడాల్సిన అనివార్యమౌతుంది.

Modi Updates, Modi Latest News, Modi Breaking News

– వికాస్‌ (editor.tsnews@gmail.com)

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *