సలాం.. అస్లాం

మానవత్వానికి కులం ఉండదు.. మతం ఉండదు.. ప్రాంతం కూడా ఉండదు. మనిషికి మనిషే సాయం చేయాలి.. ఈ విషయంలో ఢిల్లీ నార్త్ జోన్ డీసీపీ అస్లాం ఖాన్ ఔదార్యం తెలుసుకుంటే ఆమెకు హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం. తన కులం కాదు.. తన మతం కాదు.. తన ప్రాంతం కాదు.. అస్సలు వారెవరో కూడా తెలియదు. కానీ ప్రతినెలా తనకొచ్చే జీతంలో సగభాగాన్ని ఆమె వారి బ్యాంకు ఖాతాలో వేస్తున్నారు. ప్రతిరోజూ ఫోన్ చేసి యోగ క్షేమాలు కనుక్కుంటున్నారు. ఉద్యోగరీత్యా ఎంత బిజీగా ఉన్నప్పటికీ వారితో మాట్లాడకుండా తన రోజును ముగించరు. ఖాకీలంటే కఠినత్వం ఒక్కటే కాదు.. కారుణ్యం కూడా ఉందని నిరూపిస్తున్నారు. ఇంతకీ అస్లాం ఎవరికి ఎందుకు సాయం చేస్తున్నారో తెలుసుకోవాలంటే ఆరు నెలలు వెనక్కి వెళ్లాల్సిందే.

2018 జనవరి 9. చీకటి పడింది. జమ్మూకాశ్మీర్ లోని ఫ్లోరా గ్రామానికి చెందిన సర్దార్ మాన్ సింగ్ ఢిల్లీ సమీపంలోని జహంగీర్ పురి జిల్లాకు తన ట్రక్కులో లోడ్ తీసుకొచ్చి దింపేశాడు. అనంతరం తిరుగు ప్రయాణమయ్యాడు. మేనకోడలి పెళ్లి కోసం దాచిన రూ.80 వేలు ఆయన దగ్గరే ఉన్నాయి. తెల్లవారితే ఇంటికి చేరుకోవచ్చు. భార్యాపిల్లలతో ఖుషీగా గడపొచ్చని ఆలోచించుకుంటూ ట్రక్కు నడుపుతున్నాడు. ఒకచోట దారి తప్పాడు. దీంతో కనిపించినవారిని అడుగుతూ ముందుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో నలుగురు దొంగలు మాన్ సింగ్ పై దాడి చేసి అతడి దగ్గరున్న డబ్బులు లాక్కున్నారు. ఏమాత్రం భయపడని సింగ్.. వారిని గట్టిగా ప్రతిఘటించి తన సొమ్ము చేజిక్కించుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో వారిలో ఒకడు మాన్ సింగ్ ను కత్తితో విచక్షణారహితంగా పొడవడంతో అక్కడే కుప్పకూలాడు. అతడి గుప్పిట్లో కొన్ని నోట్లు రక్తంతో తడిసి అలాగే ఉండిపోయాయి. మరుసటి రోజు పత్రికల్లో వచ్చిన ఈ వార్తను ఢిల్లీ నార్త్ జోన్ డీసీపీ అస్లాం ఖాన్ చదివారు. మాన్ సింగ్ మరణంలో ఆ కుటుంబం పరిస్థితి ఏమవుతుందో అని ఆందోళన చెందారు. వారికి ఎంతో కొంత సాయం చేయాలని నిర్ణయించుకున్నారు. వెంటనే రంగంలోకి దిగి వారి వివరాలు కనుక్కునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఎట్టకేలకు సింగ్ పెద్ద కుమార్తె బల్జీత్ ఫోన్ నంబర్ సంపాదించి, ఆమెకు ఫోన్ చేశారు. కానీ స్విచ్ ఆఫ్. అలా ప్రతిరోజూ ఆ నంబర్ కు ఫోన్ చేస్తూనే ఉన్నారు. చివరకు 20 రోజుల తర్వాత ఫోన్ రింగై బల్జీత్ మాట్లాడింది. తనతోపాటు అమ్మ, చెల్లి, తమ్ముడు ఉన్నాడని చెప్పింది. వారంతా చదువుకుంటున్నారని తెలుసుకున్న డీసీపీ.. ఇకపై ప్రతినెలా కొంత మొత్తం పంపిస్తానని, వాటితో ఎలాంటి ఆటంకం లేకుండా చదువుకోవాలని సూచించారు. చెప్పినట్టుగానే ఫిబ్రవరి నుంచి ప్రతినెలా తన జీతంలో సగ భాగాన్ని ఆ కుటుంబానికి పంపిస్తున్నారు. కేవలం డబ్బు పంపేసి ఊరుకోకుండా, రోజూ బల్జీత్ తో మాట్లాడతారు. ‘‘నాన్నను కోల్పోయి దిక్కు తోచని స్థితిలో ఉన్న మాకు అస్లాం మేడమ్ అండగా నిలిచారు. మేం ఇప్పటివరకు ఆమెను కలవలేదు. అయినప్పటికీ ప్రతినెలా తన జీతం నుంచి కొంత మొత్తాన్ని మాకు పంపిస్తున్నారు. దేవుడే మేడమ్ రూపంలో మాకు సహాయం చేస్తున్నారు. నేను కూడా ఐపీఎస్ చదవి మేడమ్ చేస్తున్నట్టుగా పది మందికీ సాయం చేస్తా’’ అని బల్జీత్ వెల్లడించింది. ఆ పిల్లల ముగ్గురి చదవులు పూర్తయ్యే వరకు తాను డబ్బు పంపుతూనే ఉంటానని అస్లాం ఖాన్ పేర్కొన్నారు. హ్యట్సాఫ్ మేడమ్.

Telugu Breaking News, TS News

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *