24 KISSES REVIEW

24 KISSES Movie

`మిణుగురులు`తో జాతీయ అవార్డుని సొంతం చేసుకున్న దర్శ‌కుడు అయోధ్య‌కుమార్ `24 కిస్సెస్‌` అనే టైటిల్‌తో సినిమాను అనౌన్స్ చేయ‌గానే.. అదేంట్రా బాబూ! ఈయ‌న కూడా ఒక సినిమాకే మ‌సాల సినిమా చేయాల‌నుకున్నాడే అని అంద‌రూ అనుకున్నారు. `మిణుగురులు`కి అప్రిషియేష‌న్స్, అవార్డులు వ‌చ్చినా.. క‌మ‌ర్షియ‌ల్‌గా సినిమా స‌క్సెస్ కాక‌పోవడంతో తాను రూట్ మార్చుకున్నాన‌ని డైరెక్ట‌ర్ ఇన్ డైరెక్ట్‌గా హింట్ కూడా ఇచ్చాడు. ఏం చేద్దాం.. `అర్జున్ రెడ్డి`, `ఆర్ ఎక్స్ 100` కాలం రా! బాబూ అని అంద‌రూ అనుకున్నారు. మ‌రి `24 కిస్సెస్` ద్వారా ద‌ర్శ‌కుడు అయోధ్య‌కుమార్ ఏం చెప్పాల‌నుకున్నాడ‌నేది తెలియాలంటే క‌థ‌లోకి వెళ‌దాం..

బ్యాన‌ర్స్‌: సిల్లీ మాంక్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, రెస్పెక్ట్ క్రియేష‌న్స్
న‌టీనటులు: ఆదిత్ అరుణ్, హెబ్బాప‌టేల్, న‌రేష్, రావు ర‌మేష్, అదితి మైఖెల్, శ్రీ‌ని కాపా, మ‌ధు నెక్కంటి త‌దిత‌రులు
ఎడిటింగ్: ఆల‌యం అనిల్‌
ఆర్ట్‌: హ‌రి వ‌ర్మ‌
సంగీతం: జోయ్ బారువా
ఛాయాగ్ర‌హ‌ణం: ఉద‌య్ గుర్రాల‌
నేప‌థ్య సంగీతం: వివేక్ పిలిప్‌
నిర్మాత‌లు: స‌ంజ‌య్ రెడ్డి, అనిల్ ప‌ల్లాల‌, అయోధ్యకుమార్ కృష్ణంశెట్టి
ద‌ర్శ‌క‌త్వం: అయోధ్య‌కుమార్ కృష్ణం శెట్టి

క‌థ‌:
చిల్డ్ర‌న్ ఫిలిం మేక‌ర్ ఆనంద్‌(అరుణ్ అదిత్‌) ఒక ప‌క్క సినిమాలు చేస్తూనే మ‌రో ప‌క్క వీధి బాల‌ల హ‌క్కుల కోసం పోరాడుతుంటాడు. మ‌రో ప‌క్క ఓ కాలేజ్‌లో సినిమాల‌కు సంబంధించిన గ్రూప్‌కు మెంట‌ర్‌గా క్లాసెస్ చెప్ప‌డానికి వెళ‌తాడు. అక్క‌డ శ్రీల‌క్ష్మి(హెబ్బా ప‌టేల్‌) ప‌రిచయం అవుతుంది. ఆనంద్‌లోని మాన‌వ‌త్వం చూసి శ్రీల‌క్ష్మి అత‌నితో ప్రేమ‌లో ప‌డుతుంది. ఓ సంద‌ర్భంలో ఇద్ద‌రూ ముద్దులు పెట్టుకునే స్థాయికి చేరుకుంటారు. ఆ స‌మ‌యంలో ఆనంద్‌కి ప్రేమంటే న‌మ్మ‌కం లేద‌ని.. కేవ‌లం ఓ ఇష్టంతోనే త‌న‌తో ఉంటున్నాడ‌ని తెలుసుకుంటుంది. వేరే అమ్మాయిల‌తో కూడా ఆనంద్‌కు శారీర‌క సంబంధం ఉంద‌ని తెలుసుకుని షాక్ తినడ‌మే కాకుండా.. ఆనంద్‌తో గొడ‌వ‌ప‌డి వెళ్లిపోతుంది. అప్పుడు అనంద్ ఏం చేస్తాడు? అస‌లు ప్రేమ‌, పెళ్లి అనేవి ఆనంద్‌కు ఎందుకు ఇష్ట‌ముండ‌దు? చివ‌ర‌కు ఆనంద్, శ్రీల‌క్ష్మి ఒక్క‌ట‌య్యారా? అనే విష‌యం తెలియాలంటే సినిమా చూడాల్సిందే…

విశ్లేష‌ణ‌:
ద‌ర్శ‌కుడు అయోధ్య‌కుమార్ ముద్దులు అనేవి ఓ ఇద్ద‌రి వ్య‌క్తుల మ‌ధ్య అనుబంధాన్ని నిజాయ‌తీతో చెప్పే ఓ ఎక్స్‌ప్రెష‌న్, నిజాయ‌తీతో కూడిన స‌మాధానం అని చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ముద్దు సీన్స్ ఉండ‌ట‌మే గ‌గ‌నం అయిపోయిన మ‌న సినిమాల్లో.. అర్జున్ రెడ్డి, ఆర్‌.ఎక్స్ 100లు లిప్ లాక్స్‌ను కామ‌న్ చేసేశాయి. వాటి బాట‌లో చాలా సినిమాలు రూపొందాయి కూడా. ఇప్పుడు 24 కిస్సెస్ అంటే 24 ముద్దులు ఎయే సందర్భాల్లో హీరో, హీరోయిన్ మ‌ధ్య ఉంటుంద‌నేది అంద‌రిలో ఆస‌క్తిక‌రంగా మారింది. అదీగాక ఇంత‌కు ముందు ప్ర‌స్తావించిన‌ట్లు ముద్దు అనేది ఎమోష‌న‌ల్ ఎక్స్‌ప్రెష‌న్‌.. ఆ ఎమోష‌న్స్ ఈ సినిమాలో మిస్ అయ్యింది. హీరో, హీరోయిన్ మ‌ధ్య ముద్దు సీన్స్ చూస్తే ఎమోషన్ క్యారీ కాదు.. పోనీ ల‌స్ట్ క‌న‌ప‌డిందా? అంటే అదీ లేదు. అడ్డ‌దిడ్డంగా ఉంటుంది. ఇలాంటి సినిమాలో న‌టించ‌డానికి ఒప్పుకున్న హెబ్బా ప‌టేల్‌ను అభినందించాలి. అయితే ఆమె మూతి ముద్దుల శ్ర‌మ వృథా అయ్యింద‌నే చెప్పాలి. అరుణ్ అదిత్ క్యారెక్ట‌ర్‌ను స‌రిగ్గా డిజైన్ చేయ‌లేదు. కాసేపు ప్రేమ ఉందంటాడు.. కాసేపు ఆక‌ర్ష‌ణ అంటాడు.. కాసేపు పెళ్లి చేసుకోను అంటాడు.. పిల్ల‌లు వ‌ద్దంటాడు.. ఇలాంటి క‌న్‌ఫ్యూజింగ్ క్యారెక్ట‌ర్‌ను క్రియేట్ చేసి ప్రేక్ష‌కుల‌ను తిక‌మ‌క‌పెట్టారు.సీనియ‌ర్ న‌రేశ్ పాత్ర‌కు పెద్ద‌గా ప్రాముఖ్య‌త లేదు. రావు ర‌మేశ్ పాత్ర చిరాకు పెడుతుంది. జోయ్ బారువా సంగీతం బావుంది. వివేక్ పిలిప్ నేప‌థ్య సంగీతం బావుంది. ఉద‌య్ గుర్రాల సినిమాటోగ్ర‌ఫీ బావుంది. ఏమున్నా లాభ‌మేంటి? క‌థ‌, క‌థ‌నం స‌రిగ్గా లేక‌పోవ‌డంతో ఇవేవీ ఎలివేట్ కాలేదు.

బోట‌మ్ లైన్‌: 24 కిస్సెస్‌.. చిరాకు పెట్టించే ప్రేమ‌క‌థ‌
రేటింగ్‌: 1.5/5

24 KISSES Movie , 24 KISSES Review, Telugu latest Movie 24 KISSES , Director Ayodya Kumar , Aadith Tarun , Hebba Patel , Telugu New Movie 24 KISSES

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *