క‌రువు జిల్లాలో అధికార పార్టీ నేత‌ల మ‌ధ్య పోరు

Ananthapuram News Update

అసలే కరువు జిల్లా! అక్కడ నీటి కోసం అధికారపార్టీ నేతలు సైతం ఒకరిపై ఒకరు యుద్ధాలు చేసుకుంటుంటారు. అలాంటి వాతావరణంలోనూ ఒక నేత మాత్రం ఎంచక్కా బోటు షికారు చేస్తున్నారు. “తాగేందుకు నీళ్లులేని జిల్లాలో బోటు షికారా?” అని ఆశ్చర్యపోతున్నారా! ఎన్నికల సీజన్ కావడంతో రాజకీయ నాయకులు ప్రతి అవకాశాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అనంతపురం జిల్లాలో ఈ సంవత్సరం తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. తాగు, సాగునీటి కోసం అధికారపార్టీ ఎమ్మెల్యేలే తగువులాడుకుంటున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితిల్లో ఉన్న జిల్లాలో బోటు షికార్లు ఏమిటా? అనే ప్రశ్న ఉదయిస్తుంది. కానీ ఈ దృశ్యాలు చూస్తే మాత్రం “ఔరా!” అని మీరు ఆశ్చర్యపోక తప్పదు! జిల్లా అంతటా నీటి కొరత ఉండగా అనంతపురంలో మాత్రం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి బోటు షికారును ప్రారంభించారు. అదేలా సాధ్యమైందంటే.. “ఆయన తలుచుకున్నారు.. సాకారమైంది- అంతే!” అనంతపురం నగర నడిబొడ్డు నుంచి మిడ్ పెన్నార్ దక్షిణ కాలవ పులివెందులకు వెళుతుంది. కాలువకు ఆనుకొని అనంతపురం శిల్పారామం ఉంది. తడకలేరు వాగుమీద రూరల్‌ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌.. షార్ట్‌కట్‌లో చెప్పాలంటే ఆర్‌డీటీ సహకారంతో కోటిన్నర రూపాయలు ఖర్చుపెట్టి పెద్ద చెక్‌డ్యామ్ నిర్మించారు. హెచ్ఎల్‌సీ నీరు శింగనమల చెరువుకు ఈ చెక్‌డ్యామ్ నుంచి వెళుతుంది. ఈ నేపథ్యంలోనే అనంత ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి ఓ ఆలోచన చేశారు. అనంత ప్రజలకు ఆటవిడుపునిచ్చే పిక్నిక్‌ సెంటర్లు లేవు. కనుక కొన్ని బోట్లు రప్పించి చెక్‌డ్యామ్‌లో వేయించారు. వీటిలో షికారు చేసే అవకాశం ప్రజలకు కల్పించారు. ఇటీవలే ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి, మేయర్‌ స్వరూప, డిప్యూటీ మేయర్‌ గంపన్న ఈ ఆహ్లాదకర కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి బోటు షికారు చేస్తూ సెల్‌ఫోన్‌లో పరిసరాలను చిత్రీకరించారు. ఈ సన్నివేశం అందరినీ ఆకట్టుకుంది. “ఎమ్మెల్యే మంచి ఆలోచన చేశారు. బోటు షికారు వల్ల ప్రజలకేమో ఆటవిడుపు. వసూలు చేసే రుసుము వల్ల సర్కారుకి ఆదాయం” అంటూ కొందరు ప్రభాకర్‌చౌదరిని అభినందిస్తున్నారు. అనంతపురం వాసుల మదిని గెలిచే ఆలోచనలు చేయడం ద్వారా ప్రభాకర్‌ చౌదరి తన ఓట్‌బ్యాంక్‌ని పెంచుకుంటున్నారని పరిశీలకులు కూడా అంటున్నారు. ముఖ్యంగా పర్యాటక ప్రేమికులు, యువత ఆయన పనులను ప్రశంసిస్తున్నారు. చూద్దాం ఇలాంటి చర్యలు ఎన్నికల్లో ఏ మేరకు ఉపయోగపడతాయో!

Ananthapuram News Update, Telugu news update Ananthapuram Latest news , Water Problem in Ananthapuram District, Ananthapuram  politics News,MLA Prabhakar Chowdary Boat Ride heats up Politics in Anantapur

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *