నేత‌ల హామీల‌ను న‌మ్మ‌డం లేద‌ట‌…

Ananthapuram Poilitical news
అసలే ఎన్నికల ఏడాది. నాయకుల్లో టెన్షన్ మొదలైంది. అనంతపురం జిల్లాలో అయితే ఎన్నికల రాజకీయం ఊపందుకుంది. అన్ని పార్టీల నాయకులు గ్రామీణ ఓటర్లు, ముఖ్యంగా రైతులను ఆకట్టుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు.జిల్లాలో ఈ ఏడాది కురవాల్సిన దానికంటే 40 శాతం తక్కువగా వర్షం పడింది. గ్రామాల్లో ప్రజలు తాగు- సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. దీంతో వారిని సంతృప్తిపరచడానికి నేతలు పోటీలు పడుతున్నారు. ఎక్కడికక్కడ కాలువలు తవ్వించి నీటిని విడుదల చేయించుకుంటున్నారు. పాదయాత్రలతో పరుగులు తీస్తున్నారు.
అదృష్టవశాత్తూ తుంగభద్ర, శ్రీశైలం రిజర్వాయర్లు నిండటంతో హెచ్‌ఎల్‌సీ, హంద్రీనీవా ద్వారా నీరు జిల్లాకు చేరుతోంది. జీడిపల్లి రిజర్వాయర్ నుంచి వివిధ ప్రాంతాలకు నీటిని తరలిస్తున్నారు. మండలి చీఫ్ విప్ పయ్యావుల కేశవ్ ఉరవకొండ నియోజకవర్గంలో పలు చెరువులకు యుద్ధప్రాతిపదికన కాలువలు తవ్విస్తున్నారు. మూడేళ్లలో పూర్తికాని పనులను.. పదుల సంఖ్యలో జేసీబీలు, బుల్డోజర్లు పెట్టి రెండు నెలల్లో పూర్తిచేయడానికి కాంట్రాక్టర్లను పురమాయించారు. ఈ కాలువల గుండా పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. అందులో భాగంగానే శిర్పి చెరువుకు నీరందించడానికి ఏర్పాటుచేసిన కాలువ ద్వారా గంగవరం నుంచి పాదయాత్ర  మొదలుపెట్టి గ్రామ చెరువు దగ్గర గంగపూజ చేశారు. మంత్రి కాలవ శ్రీనివాసులు, ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డిని పిలిపించి భారీ సభను నిర్వహించారు. ఈసారి పయ్యావుల కేశవ్‌ను గెలిపిస్తే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరుగుతాయని పార్టీ కార్యకర్తలు ప్రచారం చేస్తున్నారు. వైసీపీ నేతలు కోర్టుకి వెళ్లి కాలువ పనులు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. అయితే ఆయకట్టు పెంచాలనే ప్రయత్నాలు చేయకుండా.. కేవలం ఉన్న చెరువులకు నీరందించి చేతులు దులుపుకుంటున్నారని ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ ఆరోపిస్తోంది.మరోవైపు పుట్టపర్తి ఎమ్మెల్యే, చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి మారాల రిజర్వాయర్‌కు నీటివిడుదల సందర్భంగా వేలాదిమందితో కాలువ గట్టు నుంచి డ్యాం వరకు పాదయాత్ర చేశారు. డ్యాం నిండితే చంద్రబాబును పిలిచి రెండు లక్షల మందితో విజయోత్సవ సభ నిర్వహిస్తామంటున్నారు. నీళ్లు తీసుకునిపోవడానికి అటు అధికారులు, ఇటు కాంట్రాక్టర్లపై వత్తిడి పెంచడంతో పనులు అడ్డదిట్టంగా, హడావుడిగా చేస్తున్నారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. నేతలు పోటాపోటీగా కాలువల పనులు చేపట్టడంతో రైతుల ఆనందం అంతాఇంతా కాదు. “దశాబ్దాలుగా నీటికోసం ఎదురుచూస్తున్నాం ఎన్నికల సందర్భంగానైనా ఇలా పనులు ఊపందుకోవడం ఆనందంగా ఉంది” అని వారు చెబుతున్నారు. మరి నాయకుల పాట్లు వారికి ఓట్లురూపంలో లాభిస్తాయో లేదో చూడాలి!
Ananthapuram Poilitical news, YCP Party Latest news, telugu news, MP JC. Divaker Reddy, Payyavula Keshav , AP Political News

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *