మొన్న కేజ్రీవాల్.. నిన్న కుమారస్వామి.. రేపు పవన్ అట

AP Political news
2013 ఎన్నికల్లో కేజ్రీవాల్ ఊహించని విధంగా సీఎం అయ్యారు.. 2018లో కుమారస్వామి నాటకీయ పరిణామాల మధ్య ముఖ్యమంత్రి పీఠాన్ని అదీష్టించారు.. 2019లో పవన్ కల్యాణ్ కూడా ఇదే సీన్ రిపీట్ చేయబోతున్నారట. ఈ మాటలు అన్నది ఎవరో కాదు.. స్వయానా జనసేన అధినేత పవన్ కల్యాణే. వచ్చే ఎన్నికల్లో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించాలని చూస్తున్నాడు జనసేనాని. ఇదే విషయాన్ని తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన బహిరంగ సభలో వెల్లడించాడు. గతంలో కూడా పలుమార్లు ఈ తరహా వ్యాఖ్యలు చేసినా.. ఇప్పుడు మాత్రం గతంలో జరిగిన ఘటనలు ఉదాహరణగా చూపించి మరీ చెప్పడం చర్చనీయాంశం అయింది. 2013 ఢిల్లీలో జరిగిన ఎన్నికల్లో పూర్తి మెజారిటీ రాకపోయినా.. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కేజ్రీవాల్ సీఎం అయ్యారు. అలాగే 2018 కర్నాటక ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు సాధించిన బీజేపీ అధికారాన్ని చేపట్టలేదు. కానీ, తక్కువ సీట్లు గెలిచిన కుమారస్వామి అధికార పీటంపై కూర్చున్నారు. ఇక్కడ కూడా అదే కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఇది జరిగింది. ఇదే సీన్ ఏపీలో కూడా రిపీట్ అవుతుందని పవన్ అనుకుంటున్నాడు. గత ఎన్నికల్లో టీడీపీ-వైసీపీ మధ్య పోటీ జరిగింది. ఇప్పుడు జనసేన ఎంట్రీతో అక్కడ త్రికోణ పోటీ జరగనుంది. దీన్ని ఉద్దేశించే పవన్ కల్యాణ్ ఈ తరహా వ్యాఖ్యలు చేస్తున్నట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇదిలాఉండగా, 2014 ఎన్నికలకు ముందే పార్టీని స్థాపించినా.. ఆ ఎన్నికల్లో పోటీ చేయకుండా తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చాడు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఇలా నాలుగేళ్ల వరకు పవన్ ఆ పార్టీలతోనే స్నేహబంధం కొనసాగించాడు. గుంటూరులో జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు తెలుగుదేశం ప్రభుత్వానికి ఎదురు తిరిగాడు. ఈ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర మంత్రులు, నాయకులపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇక అప్పటి నుంచి టీడీపీపై తన పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు. ప్రజాపోరాటయాత్ర పేరిట రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నాడు. ఎక్కడ సభ పెట్టినా ప్రభుత్వాన్నే టార్గెట్ చేయడం.. అక్కడి లోకల్ లీడర్లపై ఆరోపణలు చేయడం వంటి చేస్తున్నాడు. అదే సమయంలో పార్టీ బలోపేతానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. రాష్ట్రంలోని వివిధ పార్టీలకు చెందిన సీనియర్ నేతలను జనసేనలోకి ఆహ్వానిస్తున్నాడు. ఇప్పటికే పలువురు ఆ పార్టీలోకి జంప్ అవగా, మరికొందరు వారి బాటలో పయనించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక ఎన్నికల సమయానికి ఇతర పార్టీల్లో టికెట్ ఆశించి భంగపడిన చాలా మంది ఆశావాహులు తమ పార్టీలోకి వస్తారనే ఆశతో జనసేన ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఆ పార్టీ మరింత బలపడడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.

AP Political news, Kjriwal, Kumaraswamy, Pavan kalayan , Pavan latest  news in AP, Telugu news, Tdp news, telugu Breaking news

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *