ఉండేదెవ‌రు…..పార్టీల‌ను వీడేదెవ‌రు..

AP Political News

ఏపీలో రాజకీయ వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. అన్ని పార్టీలు తమ దూకుడు పెంచాయి. ప్రభుత్వ పథకాలను జనంలోకి తీసుకువెళ్లేందుకు అధికారపార్టీ ప్రజాప్రతినిధులు తలమునకలై ఉంటే.. ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకుని ప్రతిపక్ష పార్టీల నాయకులు బిజీగానే గడుపుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ప్రస్తుతం జరుగుతున్న చర్చలన్నీ నాయకుల స్థితప్రజ్ఞతపైనే కేంద్రీకృతమయ్యాయి. ఇదేదో బరువైన పదంగా అనిపిస్తున్నా అర్థం చాలా సింపుల్! ఆయా పార్టీల్లో ఉండేదెవరు? వేరే పార్టీల్లోకి జంప్ చేసేదెవరు? అన్న అంశంపైనే వాడివేడి కబుర్లు సాగుతున్నాయి. ఏ రాజకీయ పార్టీకైనా పశ్చిమగోదావరి జిల్లా చాలా కీలకం! ఇక్కడ ఓటర్ల నాడిని బట్టి రాష్ట్రంలో పరిస్థితులను అంచనా వేస్తాయి ఆయా పార్టీలు. ఎందుకంటే చదువుతో సంబంధం లేకుండా ఇక్కడ ఓటర్లు రాజకీయ పరిణతిని ప్రదర్శిస్తుంటారు. అందుకే తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌పార్టీలు పశ్చిమ ఓటర్లను ఆకట్టుకోవడానికి ఎన్నో ఫీట్లు చేస్తుంటాయి. తాజాగా ఆ జాబితాలోకి జనసేన కూడా చేరింది. ఇప్పటికే వైసీపీ, జనసేన పార్టీల అధినేతలు ఇద్దరూ జిల్లాలో తమ యాత్రలు పూర్తిచేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా తాడేపల్లిగూడెంలో ధర్మపోరాట దీక్షచేసి, పరోక్షంగా ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. పార్టీపరంగా చూస్తే, గ్రామదర్శిని- గ్రామవికాసం పేరు మీద ప్రజాప్రతినిధులు ప్రజల వద్దకు వెళుతున్నారు. జిల్లాలో అన్ని రాజకీయపార్టీలు బిజీబిజీగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే “వచ్చే ఎన్నికల నాటికి ఆయారామ్‌లు- గయారామ్‌లు ఎవరు?” అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. టీడీపీ నుంచి ద్వితీయశ్రేణి నేతలు, వైసీపీ నుంచి కొందరు ముఖ్యనేతలు జంప్‌ జిలానీలుగా మారవచ్చునన్నది తాజా చర్చల సారాంశం! ఎన్నికలు తరుముకొస్తున్న వేళ.. ధీమాగా ఉన్న పార్టీ ఏదయినా ఉందంటే అది తెలుగుదేశమే! జిల్లాలో ఉన్న మొత్తం పదిహేను నియోజకవర్గాల నుంచి టీడీపీ అభ్యర్థులే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగుల్లో ఒకరిద్దరు మినహా, అందరికీ టిక్కెట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ తరుణంలో ఆ పార్టీ ప్రజాప్రతినిధుల్లో పెద్దగా హడావుడి లేదు. ఎటొచ్చి ద్వితీయశ్రేణి నాయకుల్లోనే కొంత అస్థిరత ఉందంటున్నారు విశ్లేషకులు. గతంలో టిక్కెట్లు ఆశించి భంగపడిన వారికి, ఈసారి కూడా టిక్కెట్ రాకపోతే, వేరే పార్టీలోకి జంప్ అవుతారనే టాక్ వినిపిస్తోంది. అటువంటి వారిలో కొందరు జిల్లాస్థాయి పదవులు అనుభవిస్తున్న వారు కూడా ఉన్నారట! ప్రధానంగా రిజర్వ్‌డ్ నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఉంటుందంటారు విశ్లేషకులు. అలాగని డెల్టా నియోజకవర్గాల్లో లేరని కాదు. “ఈసారి టిక్కెట్ ఇవ్వాల్సిందే. ఇవ్వకపోతే, మా దారి మేము చూసుకుంటాం..” అని కొందరు నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారట. నిడదవోలు, కొవ్వూరు, పోలవరం, నరసాపురం నియోజకవర్గాల నేతలు సహా జిల్లాలో ఇతర ప్రాంతాల్లో మరికొందరు నేతలు ఇదే పాట పాడుతున్నారట. అంతేకాదు, ప్రస్తుతం జిల్లాస్థాయి పదవిలో ఉన్న ఒక నాయకుడు, ఆయన గురువు కూడా అదే ఆలోచనలో ఉన్నారనేది టీడీపీ వర్గాల టాక్. ఇలా ఆలోచిస్తున్న వారిలో ఎక్కువ శాతం మంది జనసేన వైపు చూసే అవకాశాలు ఉన్నాయట! ఇక వైసీపీలో గయారామ్‌లపైనే ఎక్కువగా చర్చ సాగుతోందంట. కొంతమంది అసెంబ్లీ నియోజకవర్గాల కన్వీనర్లను ఆ పార్టీ అధినేత మార్చే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. జగన్ పాదయాత్ర సాగిన సమయంలో ఆచంట కన్వీనర్‌ను మార్చి, ఆ స్ధానంలో వేరేవారిని నియమించిన సంగతి తెలిసిందే! ఈ అంశంపై పార్టీవర్గాల్లో ఇంకా చర్చ సాగుతునే ఉందట. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. కనీసం అయిదారు నియోజకవర్గాల కన్వీనర్లను జగన్ మార్చే అవకాశం ఉందనేది రాజకీయ విశ్లేషకుల వాదన. రెండు, మూడు చోట్ల ఇప్పటికే ఆ ప్రక్రియ మొదలైందట. అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్ రాకపోతే, చివరి నిముషంలో వీరు తట్టాబుట్టా సర్దుకుని, పక్క పార్టీకి జంప్ అయ్యే అవకాశమే ఎక్కువ ఉందంటున్నారు పరిశీలకులు! వీరితోపాటు ద్వితీయశ్రేణి నాయకులు ఆ దోవలో వెళ్లే అవకాశాలు లేకపోలేదంటారు వారు. అంతిమంగా ఈ జంపింగ్‌ల వలన ఎక్కువగా లాభపడేది జనసేనే అనేది విశ్లేషకుల అభిప్రాయంగా ఉంది. టీడీపీ నుంచి వైసీపీలోకి, వైసీపీ నుంచి టీడీపీలోకి వెళితే పెద్దగా ఒరిగేది ఏమి ఉండదు. అసెంబ్లీ టికెట్లు కూడా రావు. అదే జనసేనలోకి వెళితే, కొంత అవకాశం ఉంటుందని జంప్‌ జిలానీలు భావిస్తున్నారట! అందువలన వీరిందరికీ లాస్ట్ డెస్టినేషన్ జనసేనే అన్న టాక్‌ బలంగా వినిపిస్తోంది. అంటే భవిష్యత్తులో జనసేన వలసలతో నిండిపోతుందన్నమాట. ఇదండీ పశ్చిమగోదావరి జిల్లాలో ఆయారామ్‌లు, గయారామ్‌లపై సాగుతున్న చర్చ. చూద్దాం.. ఏం జరగబోతుందో!

AP Political News, Telugu news, AP Latest News, West Godavari District , TDP , YCP Political News in West Godavari District 

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *