బాబుకీ గ‌తిప‌డుతుంద‌ని ఊహించారా?

CHANDRABABU MET RAHUL

* ఈ చ‌రిత్ర ప‌చ్చ‌టి సిరాతో
* కాంగ్రెస్‌కు వ్య‌తిరేకంగా ఆవిర్భ‌వించిన తెదేపా
* అదే కాంగ్రెస్‌తో పొత్తుకు సై అంటున్న చంద్ర‌బాబు

ఔను.. ఆంధ్రుల రాజ‌కీయ చ‌రిత్ర‌లో వినూత్న అధ్యాయంగా చెప్పుకునే ఈ సంఘ‌ట‌న‌ను ఏ సిరాతో రాయ‌వ‌చ్చు. ఎరుపు కాదు.. న‌లుపు కానే కాదు.. ఆకు పచ్చ ఆహా కాద‌బ్బా.. ప‌సుపు ప‌చ్చా.. ఔను ఇది అతికిన‌ట్లు స‌రిపోతుందేమో.. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ రంగు కూడా అదే క‌దా!

భార‌త‌దేశాన్ని అప్ర‌తిహ‌తంగా ప‌రిపాలిస్తూ.. దేశ స్వాతంత్య్రంలో కీల‌క పాత్ర పోషించిన కాంగ్రెస్ పార్టీని ఎదురించి, తెలుగుజాతి ఆత్మాభిమానాన్ని నిల‌బెట్టేందుకు ఆవిర్భ‌వించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అదే కాంగ్రెస్‌తో జ‌త‌క‌ట్టి.. గ‌జ్జెక‌ట్టి.. కూట‌మి పెట్టి.. నీకిన్ని.. నాకిన్ని అంటూ సీట్లు పంచుకునే ఘ‌ట్టాన్ని చ‌రిత్ర‌లో నిలిచిపోయే సంఘ‌ట‌న‌గా రాజ‌కీయ విశ్లేష‌కులు చెప్ప‌డం ఎంత‌వ‌ర‌కూ నిజ‌మో.. ఈ సంఘ‌ట‌న‌ను ప‌సుపు ప‌చ్చ రంగుతో లిఖించ‌డం అనేది కూడా అంతే నిజం కూడా. పైగా గ‌డిచిన మూడున్న‌ర ద‌శాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీని పూర్తిగా వ్య‌తిరేకించి.. తీవ్రంగా విమ‌ర్శించి.. జీవితాంతం పోరాటం చేసిన తెలుగుదేశం పార్టీ.. ఆ పార్టీ అధినేత‌గా ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు.. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీతో.. ఆ పార్టీ అధినేత‌తో సీట్ల స‌ర్దుబాటు నేప‌థ్యంలో భేటి కానుండ‌టం దేశ‌రాజ‌కీయ చ‌రిత్ర‌లో.. మ‌రీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల చ‌రిత్ర‌లో అస‌లు సిస‌లైన రాజ‌కీయ కొంగొత్త ప‌రిణామంగా చెప్పుకోవ‌చ్చు.

* ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఏర్ప‌డిన‌ప్ప‌ట్నుంచి 1983 వ‌ర‌కూ స‌మైక్య ఏపీని ఏలిన కాంగ్రెస్ పార్టీని గ‌ద్దె దించేందుకు తెలుగుదేశం పార్టీని అప్ప‌టి ప్రముఖు సినీ న‌టుడు నందమూరి తార‌క రామారావు 1982లో స్థాపించారు.ఆంధ్రుల ఆత్మ‌గౌర‌వాన్ని కించ‌ప‌రిచేలా ప‌రిపాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ పాల‌న‌ను అంత‌మొందించేందుకు ఎన్టీయార్ ద‌ళితులు, బీసీలు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాల‌ను స‌మీక‌రించ‌డంలో ఘ‌న‌విజ‌యం సాధించారు. ప్ర‌జ‌ల్లో ఆయ‌నకున్న మాస్ ఇమేజ్ అందుకు పూర్తిగా స‌హ‌క‌రించింది. అందుకే, ఆంధ్ర‌ప్ర‌దేశ్ చ‌రిత్ర‌లోనే మొద‌టిసారిగా కాంగ్రెసేత‌ర ప్ర‌భుత్వాన్ని కేవ‌లం తొమ్మిది నెల‌ల కాలంలోనే ఏర్పాటు చేయ‌గ‌లిగారు. ఇక‌, అప్ప‌ట్నుంచి తెలుగుదేశం పార్టీ ఏపీలోనూ.. అటూ కేంద్రంలోనూ కీల‌క‌మైన పాత్ర పోషిస్తూనే ఉంది. అది కూడా కాంగ్రెస్‌కు బ‌ద్ధ‌శ‌త్రువుగా కొన‌సాగుతూనే ఉంది. పార్టీ ఏ ల‌క్ష్యంతో ఆవిర్భ‌వించిందో, అదే ల‌క్ష్యంతో టీడీపీ పార్టీ కార్య‌క‌ర్త‌లు కూడా క్షేత్ర‌స్థాయిలో కాంగ్రెస్‌తో యుద్ధం చేస్తూనే వ‌స్తున్నారు. కాంగ్రెస్‌, టీడీపీల మ‌ధ్య అప్ర‌తిహ‌తంగా కొన‌సాగుతూ వ‌స్తున్న బ‌ద్ధ‌వైరం.. తాజా రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో భ‌విష్య‌త్తులో ఇక‌పై ఉండ‌క‌పోవ‌చ్చునేమో. అందులో భాగంగానే అత్యంత ముఖ్య‌మైన సంఘ‌ట‌న జ‌రుగ‌నున్న‌ట్లు స్ప‌ష్ట‌మైన సంకేతాలు అందుతున్నాయి. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో.. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు భేటీ అనేది ఎన్టీఆర్ ఆత్మ ఘోషిస్తుందా? లేదా? అనేది ప‌క్క‌న పెడితే.. టీడీపీ చ‌రిత్ర‌లో అత్యంత కీల‌క‌మైన‌, అవ‌శ్య‌క‌మైన‌, ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన ప‌రిణామంగా మిగిలిపోతుంది.

* తెలంగాణ‌లో పార్టీ మ‌నుగ‌డ ప్ర‌శ్నార్థ‌క‌మ‌య్యేలా ఉన్న ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటున్న టీడీపీ పార్టీ.. ప్ర‌స్తుతం తెలంగాణ‌లో జ‌రుగ‌నున్న శాస‌న‌స‌భ ఎన్నిక‌ల్లో భాగంగా కూట‌మి క‌ట్ట‌డ‌మ‌నేది కీల‌కం, అవ‌శ్యంగా మారింది. అదే స‌మ‌యంలో బీజేపీ, సీపీఐ, సీపీఎం పార్టీల‌తో స‌హా టీఆర్ఎస్‌తోనూ గ‌తంలో స‌మ‌యానుకూలంగా పొత్తు పెట్టుకున్న చ‌రిత్ర టీడీపీకి ఉంది. కానీ, ఇప్పుడు అదే టీఆర్ఎస్‌ను ఓడించేందుకు ఏ పార్టీకి ప్ర‌త్యామ్నాయంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లారో.. అదే కాంగ్రెస్‌తో టీడీపీ చేతులు క‌ల‌ప‌డ‌మేనది ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన ప‌రిణామం. ఇలాంటి స‌మ‌యం ఒక‌టి వ‌స్తుంద‌ని ఆనాడు పార్టీని స్థాపించిన ఎన్టీఆర్ కానీ, మామ‌కు వెన్నుపోటు పొడిచి స‌రికొత్త రాజ‌కీయాల‌కు తెర‌తీసి రాష్ట్ర‌, దేశ రాజ‌కీయాల్లో కీల‌క పాత్ర పోషించిన చంద్ర‌బాబు నాయుడు కానీ.. క‌ల‌లోనైనా అనుకోని ఉండ‌రు. కాంగ్రెస్ అధినేత‌ను క‌లిసి సీట్లు పంచుకునే ఒక‌రోజు వ‌స్తుంద‌ని.. అయితే ఇప్పుడు ఆ స‌మ‌యం రానే వ‌చ్చింది. రాహుల్ గాంధీని స్వ‌యంగా క‌లుసుకుని సీట్ల స‌ర్దుబాటు కోసం చ‌ర్చించేందుకు టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ఢిల్లీ వెళుతుండ‌టం, రాజ‌కీయ చ‌రిత్ర‌లో లిఖించ‌ద‌గ్గ ప‌రిణామ‌మే. అందుకే, ఏ సిరాతో దీనిని రాయాల‌నేది.. అందుకు సిద్ధంగా ఉండే రంగు.. ప‌చ్చ రంగు కాక మ‌రేమిటి?

HISTORICAL MEETING BETWEEN RAHUL AND BABU 

– బీచు బాబా

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *