కాంగ్రెస్‌లో డీఎస్‌కు ప్రాధాన్యత ద‌క్కెనా…!

Congress Party Latest News

ధర్మపురి శ్రీనివాస్. మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం. రాజకీయ పుట్టుకనిచ్చిన కాంగ్రెస్‌కు చెయ్యిచ్చి కారెక్కారు. మూణ్నాళ్ల ముచ్చట కోసం కాంగ్రెస్‌కు చెయ్యిచ్చారని గిట్టనివారు అనుకునే మాట. అయితే అంతటి సీనియర్ నేత భవితవ్యం ఇప్పుడు డోలాయమానంలో పడింది. కొన్ని రోజులుగా గులాబీపార్టీకి ఆయన కానివాడయ్యారు. “పార్టీ నుంచి సస్పెండ్ అయినా చేయండి.. లేదా నాపై చేసిన ఆరోపణలకు బహిరంగ క్షమాపణ అన్నా చెప్పండి” అని ఆయన మొత్తుకుంటున్నా పట్టించుకునేవారు లేరు. ఏదో ఒకటి తేల్చాలంటూ గులాబీ దళపతి కేసీఆర్‌కూ ఆయన లేఖ రాశారు. తనకు పార్టీలో అన్యాయం జరిగిందంటూ మీడియా సమావేశంలో గగ్గోలుపెట్టారు. నిజామాబాద్ ఎంపీ కవితతోపాటు జిల్లాకు చెందిన పలువురు నేతలు తనను టార్గెట్ చేశారని వాపోయారు. ఆ సందర్భంగా ఆయన సంధించిన ప్రశ్నలు, విసిరిన సవాళ్లకు టీఆర్ఎన్ నాయకులెవరి నుంచీ ఎలాంటి స్పందనా రాలేదు. సీఎం సంగతి అటుంచితే జిల్లా నేతలు సైతం ఆయన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ పరిస్థితుల్లో కనీసం తన తనయుడు సంజయ్‌ని ఎలాగైనా ఎన్నికల బరిలోకి దింపాలనే పట్టుదలతో డీఎస్ ఉన్నారు. అంతకన్నా ముందు తనను రాజకీయంగా ఇరకాటంలో పడేసిన టీఆర్ఎస్‌తో తాడోపేడో తేల్చుకోవాలనుకుంటున్నారు. ఎంపీ కవితతో పాటు జిల్లా నాయకులంతా కలిసి ఆయన్ని పార్టీనుంచి సస్పెండ్ చేయాలని తీర్మానించింది మొదలు.. స్వీయ అస్థిత్వం కోసం డీఎస్‌ పావులు కదపడం మొదలుపెట్టారు. ఆ సమయంలోనే సంజయ్ లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కోవడం ఆయనను మరింత కుంగదీసింది. సంజయ్‌పై కేసు నమోదుకావడం, ఆయన అరెస్టయి జైలుకెళ్లడం వరకు అనేక నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సంజయ్‌పై కేసు వ్యవహారంలో గులాబీ పెద్దల ప్రమేయముందనే ప్రచారం జరిగింది. తనతో పాటు తన కుటుంబ సభ్యులపైనా కుట్ర జరుగుతోందంటూ డి.శ్రీనివాస్‌ గులాబీ నేతలపై బహిరంగంగానే ధ్వజమెత్తారు కూడా! టీఆర్ఎస్‌ను వీడితే రాజ్యసభ పదవి పోతుందనే భయంతోనే డీఎస్ రాజీనామా చేయడం లేదనే అభిప్రాయాలూ ఉన్నాయి. అయితే ఉన్నపళంగా పార్టీకి రాజీనామా చేసి వెళితే ఆ పార్టీ నేతల ఆరోపణలు ఒప్పుకున్నట్టు అవుతుందని డీఎస్ భావిస్తున్నట్టు సమాచారం. అలాగని టీఆర్ఎస్‌లో కొనసాగే అనుకూల పరిస్థితులు కూడా లేవు. ఆయన అనుచరులైతే పార్టీలో కొనసాగడానికి ససేమిరా అంటున్నారు. ఇన్ని అవమానాలు భరిస్తూ, వేధింపులు ఎదుర్కొంటూ కొనసాగలేమని కొంతకాలంగా చెబుతూ వస్తున్నారు. దీంతో ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ వైపు డీఎస్ మొగ్గుచూపుతున్నారు. ఇప్పటికే పలుమార్లు కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడారు కూడా! ఢిల్లీలోనూ కాంగ్రెస్ పెద్దలను కలిసి తన మనసులోని మాట చెప్పారు. సంజయ్‌కు నిజామాబాద్ అర్బన్ లేదా నిజామాబాద్ రూరల్ టిక్కెట్ ఇస్తామంటే వెంటనే కాంగ్రెస్‌లో చేరతామని చెప్పారట. దీంతోపాటు తనకూ ఓ పోస్టు ఖాయంచేయాలని కోరారట. రాజ్యసభ లేదా మండలి సభ్యత్వంపై హామీ ఇస్తే చాలని కూడా అన్నారట. ఈ అంశాలకు ఓకే చెబితే అనుచరులతో కలిసి కారు దిగి హస్తం అందుకుంటానని డీఎస్‌ అంటున్నారట. అయితే డీఎస్ ప్రతిపాదనలపై కాంగ్రెస్ హైకమాండ్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. రాష్ట్రనాయకత్వంతో మాట్లాడిన తర్వాత చెబుతామని వర్తమానం పంపారట. ఆలోగానే జిల్లాకు చెందిన డాక్టర్ భూపతిరెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆయన తన అనుచరులతో కలిసి ఢిల్లీలో రాహుల్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన చేరికతో డీఎస్ ప్రతిపాదన పెండింగ్‌లో పడినట్టు తెలుస్తోంది. ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక తుదిదశకు చేరింది. పార్టీ చీఫ్ సభలు, సమావేశాలతో కాంగ్రెస్ రాజకీయ రంగస్థలం కూడా రక్తికడుతోంది. ఈ పరిస్థితుల్లో తన పాత్ర ఏమిటన్నది డీఎస్‌కు పాలుపోవడం లేదు. అయితే టీఆర్ఎస్‌లోనే ఉంటూ కాంగ్రెస్‌పార్టీకి పనిచేసే ఆలోచనా ఆయన మదిలో ఉన్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. అధికారికంగా టీఆర్ఎస్‌లో ఉంటూ అనధికారికంగా కాంగ్రెస్‌కు సేవకుడిగా ఉన్నట్టన్న మాట! ఆ మేరకు ఎప్పుడో క్లారిటీకి వచ్చిన డీఎస్ తన ప్రధాన అనుచరులను ఈ మధ్యే కాంగ్రెస్‌పార్టీలోకి పంపారు. నిజామాబాద్, డిచ్‌పల్లి, జక్రాన్‌పల్లి మండలాలకు చెందిన పలువురు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌పార్టీలో చేరారు. తాను వచ్చినా రాకున్నా కాంగ్రెస్ గెలుపు కోసం సీరియస్‌గా పనిచేయాలని వారితో చెప్పారట డీఎస్‌. ముఖ్యంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డిని డీఎస్ టార్గెట్ చేసినట్టు చెప్పుకుంటున్నారు. భూపతిరెడ్డితో కలిసి బాజిరెడ్డిని ఓడించేందుకు ఆయన కంకణం కట్టుకున్నారని ప్రచారం జరుగుతోంది. అంటే నిజామాబాద్ రాజకీయ రణరంగంలో పాత్రధారిగా మాత్రమే కనిపిస్తున్న డీఎస్సే అసలైన సూత్రధారి అని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి డీఎస్ తన పంతం నెగ్గించుకుంటారా? బాజిరెడ్డిని ఓడిస్తారా? సంజయ్‌కు ఎలాంటి దారిచూపుతారు? అసలు ఆయన భవితవ్యం ఎలా ఉండబోతోంది? ఈ విషయాలపై క్లారిటీ రావాలంటే మరికొంత కాలం వేచిచూడక తప్పదేమో!

Congress Party Latest News, Dharmapuri Srinivas latest News, Telugu Latest News, Congress Political news, Telanagana congress Political News, Telugu Breaking news

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *