పోస్టల్ ఓటుకు భలే డిమాండ్

Demand For Postal votes

  • రూ.5వేల నుంచి రూ.10వేల వరకు ఆఫర్
  • ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతల ద్వారా ప్రయత్నాలు

తెలంగాణ ఎన్నికల్లో పోలింగ్ కు ఇంక ఒక్క రోజు మాత్రమే గడువు ఉంది. బుధవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియడంతో అభ్యర్థులు తదుపరి వ్యూహాల్లో మునిగిపోయారు. కీలకమైన పోల్ మేనేజ్ మెంట్ కు కసరత్తు చేస్తున్నారు. ఎలాగైనా గెలిచి తీరాలనే తపన ప్రతి ఒక్కరిలో కనిపిస్తోంది. దీంతో ఓటు రేటు కూడా భారీగానే పెరిగింది. నియోజకవర్గాలను బట్టి ఓటుకు రూ.500 నుంచి ఏకంగా రూ.4 వేల వరకు ఇవ్వడానికి కూడా సై అంటున్నారు. కొంతమంది అభ్యర్థులను పోస్టల్ బ్యాలెట్లపైనా దృష్టి సారించారు. కొంత మంది ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతల ద్వారా పోస్టల్‌ బ్యాలెట్లను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాము కోరిన అభ్యర్థికి పోస్టల్‌ బ్యాలెట్‌లో ఓటేసి చూపిస్తే ఒక్కో ఓటుకు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు చెల్లిస్తామని ఆఫర్ ఇస్తున్నట్టు సమాచారం. డబ్బుతోపాటు ఖరీదైన బ్రాండ్ల మద్యం కూడా ఆఫర్‌ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ విధుల్లో దాదాపు లక్షన్నర మంది ప్రభుత్వ అధికారులు, సిబ్బంది, ఉపాధ్యాయులు పాల్గొంటున్నారు. వీరు కాకుండా బందోబస్తు నిర్వహించే పోలీసులు దీనికి అదనం. పోలింగ్‌ రోజు స్వస్థలాల్లో ఉండి ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలు లేకపోవడంతో ఎన్నికల సంఘం వీరికి పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు వేసే సదుపాయం కల్పించింది. దరఖాస్తు చేసుకున్న ఎన్నికల సిబ్బందికి పోస్టల్‌ బ్యాలెట్లను సరఫరా చేసింది. ఈ నెల 7న రాష్ట్ర శాసనసభ ఎన్నికల పోలింగ్‌ జరగనుండగా, 11న ఓట్లను లెక్కించనున్నారు. ఓట్ల లెక్కింపుకు 24 గంటల ముందు వరకు సంబంధిత నియోజకవర్గంలోని తహసీల్దార్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పెట్టెల్లో పోస్టల్‌ బ్యాలెట్లను వేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. గతంలో కొందరు అభ్యర్థులు కేవలం పోస్టల్‌ ఓట్ల మెజారిటీలో గెలిచిన సందర్భాలూ ఉన్నాయి. ఈ పరిస్థితి ఏర్పడితే గట్టెక్కేందుకు పోస్టల్‌ ఓట్ల సహాయపడవచ్చని భావించి అభ్యర్థులు భావిస్తున్నారు. దీంతో భారీగా డబ్బు వెదజల్లడానికి వెనుకాడటంలేదు. మామూలు ఓటు రూ.4 వేల వరకు పలుకుతుండగా.. పోస్టల్ ఓటుకు రూ.10 వేల వరకు పలకడం విశేషం.

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *