జ‌న‌సేన‌లో డైల‌మా..

Dilemma in Janesan Party

జనసేనలో అంతర్మథనం సాగుతోంది. పొత్తులు ఉంటాయని ఒకవైపు ప్రచారం జరుగుతుంటే.. మరోవైపు పార్టీలోని కొంతమంది అటువైపు చూడొద్దని చెబుతున్నారు. ప్రజాస్వామ్య సూత్రాల ప్రకారం చర్చ జరిగితేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందనే భావనతో జనసేనలో ఇప్పుడు పొత్తులపై మాటామంతీ కొనసాగుతోంది. ఈ చర్చల సారాంశమో, ఏమిటో తెలియదు కానీ.. పవన్‌కల్యాణ్ తనకు ఏ పార్టీ అండ అవసరం లేదని విస్పష్టంగా చెప్పారు. అసలు జనసేనలో ఏం జరుగుతోంది? పవన్‌కల్యాణ్‌కు సన్నిహితులు ఏమి చెబుతున్నారు?రాష్ట్ర విభజన తర్వాత 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ అహ్మదాబాద్ వెళ్లి అప్పటి ప్రధాని అభ్యర్ధి నరేంద్రమోడీని కలుసుకున్నారు. ఆ తర్వాత ఎన్నికల ముందే తెలుగుదేశం, బీజేపీ పొత్తు పెట్టుకున్నాయి. ఇందులో భాగంగానే పవన్‌కల్యాణ్ కూడా రాష్ట్రంలో తెలుగుదేశానికి మద్దతు ఇచ్చారు. అనంతరం నాలుగేళ్ల తర్వాత జనసేన పార్టీ నాలుగో ఆవిర్భావ దినోత్సవం నాడు తెలుగుదేశంపై పవన్‌కల్యాణ్ తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. టీడీపీకి తాను మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. అప్పటినుంచీ టీడీపీ అధినేత చంద్రబాబు, పలువురు మంత్రులు, నారా లోకేశ్‌లపై ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఏపీలో మారుతున్న సమీకరణాలపై రకరకాల వాదోపవాదాలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే జనసేన వెనుక బీజేపీ ఉందని టీడీపీ నేతలు గట్టిగానే చెబుతున్నారు. అంతటితో ఆగకుండా 2019 ఎన్నికల నాటికి జనసేన, వైసీపీల మధ్య పొత్తు కుదురుతుందని కూడా ప్రచారం ప్రారంభించారు. వీరి ఇరువురిని కలిపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కూడా ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలోనే జనసేనలో అంతర్మథనం ప్రారంభమైంది. “2014 నాటి ఎన్నికల్లో మద్దతు ఇచ్చి తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకువచ్చాం. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి ఆ పార్టీని అధికారంలోకి తీసుకువస్తే.. ఇక మనం ఎప్పుడు ఎదగాలి?” అని జనసేన నేతలు కొందరు పవన్‌కల్యాణ్ వద్ద వాదన లేవదీశారని తెలిసింది. పైగా వైసీపీకి మద్దతిస్తే.. జగన్ గనుక సీఎం పీఠం ఎక్కితే వచ్చే టర్మ్‌ కూడా మనకి కష్టమవుతుందనీ, మనకి ప్రతిపక్ష పాత్రే మిగులుతుందనీ కొందరు జనసేన నేతలు వాదిస్తున్నారు కూడా! స్వయంగా పోటీచేసి సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు కైవసం చేసుకుంటే కర్నాటకలో జేడీఎస్ మాదిరిగా ఏపీలో చక్రం తిప్పవచ్చునన్నది మెజారిటీ జన సైనికులు, పార్టీ నేతల వాదనగా ఉంది. ఈ వాదనపైనే ఇప్పుడు జనసేనలో చర్చోపచర్చలు సాగుతున్నాయి. ఇటీవల విజయవాడలో జనసేన రాష్ట్ర కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా జనసేన అధినేత పవన్‌కల్యాణ్, ఆ పార్టీ మరో సీనియర్ నేత నాదెండ్ల మనోహర్ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా కొంతమంది మీడియా ప్రతినిధులు రాబోయే ఎన్నికలలో వైసీపీతో పొత్తు పెట్టుకుంటారా అని పవన్‌ని ప్రశ్నించగా, “తర్వాత మాట్లాడదాం” అంటూ దాటవేశారు. పార్టీలో కొంతమంది సీనియర్ నేతలు మాత్రం పవన్‌కల్యాణ్‌పై వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ వ్యక్తిగత విమర్శలు చేయడం, కాపు రిజర్వేషన్‌పై ఇప్పటికే తన వైఖరి కూడా ప్రకటించడంతో, ఆయనతో పొత్తు సరికాదనే వాదన లేవదీశారు. ఇప్పుడు తాజాగా 2019 ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంటే జనసేన భవిష్యత్తు ఇబ్బందికరంగా మారుతుందని విశ్లేషిస్తున్నారు. ఈ తరుణంలోనే పవన్‌కల్యాణ్‌ ఏ రాజకీయపార్టీ అండ తనకు అవసరంలేదని ప్రకటించడం గమనార్హం! ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయం రసకందాయంలో పడింది. ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలపై జనసేన దృష్టిపెట్టగా, కృష్ణాజిల్లా నుంచి రాయలసీమ వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పటిష్టమయ్యేందుకు ప్రయత్నిస్తోంది. రెండు ప్రాంతాలలో తెలుగుదేశం పార్టీకి గట్టి పోటీ ఇచ్చేందుకు ఈ రెండు పక్షాలూ కసరత్తులు చేస్తున్నాయి. జనసేన పాత్ర కీలకంగా మారడంతో వైసీపీలోని కొంతమంది సీనియర్ నేతలు మాత్రం పొత్తు ఉండాల్సిందేననీ, లేనిపక్షంలో చంద్రబాబును కట్టడిచేయడం సాధ్యం కాదనీ స్పష్టంచేస్తున్నారు. ప్రస్తుతం జనసేనలో జరుగుతున్న ఆసక్తికరమైన చర్చ ఏ పరిణామాలకు దారితీస్తుందోనని రాజకీయ వర్గాలు సైతం  ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
Dilemma in Janesan Party , Pavan kalyan Latest news, telugu Latest News, Janasena Party Latest News

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *