ఫోన్‌ చేస్తే.. చెప్పకండి!

Don’t Disclose Personal Details

* హలో! నమస్తే.. మేము ఐఆర్‌డీఏ నుంచి ఫోన్‌ చేస్తున్నాం. ఫలానా బీమా సంస్థ నుంచి మీకు రూ.లక్ష వచ్చాయి. మీ వివరాలు చెబితే వెంటనే మీకు డబ్బు పంపిస్తాం!

* గుడ్‌ మార్నింగ్‌! ఖాతాలో మీ వివరాలను అప్‌డేట్‌ చేయాలి! మీ వివరాలు చెప్పండి. లేకపోతే ఖాతా రద్దవుతుంది!

ఇలాంటి ఫోన్లు మీకూ వచ్చాయా? వీటిని పట్టించుకోకండి. మీ వివరాలను చెప్పకండి.  మీ వ్యక్తిగత వివరాలు పూర్తిగా రహస్యం. క్రెడిట్‌, డెబిట్‌ కార్డు నెంబర్లు, సీవీవీ సంఖ్య, ఓటీపీ, రహస్య సంఖ్యలు, పాస్‌వర్డ్‌లు ఇవన్నీ కూడా కేవలం మీరు వాడుకునేందుకే. ఎవరికీ చెప్పకూడదు. బ్యాంకు నుంచి ఫోన్‌ చేస్తున్నామని చెప్పినా సరే. కొంతమంది బ్యాంకు ఉద్యోగులే ఖాతాదారుల సమాచారాన్ని దొంగిలించి మోసాలకు పాల్పడుతున్నట్లు ఇటీవల కొన్ని సంఘటనలు రుజువు చేస్తున్నాయి.

* ఫోన్‌ చేసి మీ బ్యాంకు ఖాతా, పాన్‌ కార్డు నెంబరు, మీ చిరునామాలు కూడా చెప్పేస్తుంటారు. నిజంగానే బ్యాంకు నుంచి ఫోన్‌ వచ్చిందని మనం భ్రమపడేలా చేస్తారు. ఎలాగో మన సమాచారం కొంత మోసగాళ్లకు అందితే మిగతా విషయాన్ని మన దగ్గర్నుంచి తీసుకోవాలని చూస్తుంటారు. మీకు ఏదైనా కావాలని అనిపిస్తే ఆయా బ్యాంకుల అధీకృత ఫోన్‌ నెంబర్లలో సంప్రదించండి. నిజంగా బ్యాంకుకు ఏ సమాచారం కావాలని అడిగి తెలుసుకొని, అవసరమైతే సమీపంలో బ్యాంకు శాఖను సంప్రదించండి.

* సామాజిక వేదిక వెబ్‌సైట్లలో మీకు సంబంధించిన పూర్తి వివరాలను పెట్టడం ఇప్పుడు ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. కొంతమంది బ్యాంకు ఖాతా వివరాలను, పాన్‌, ఆధార్‌ కార్డుల ఫొటోలను సామాజిక సైట్లలో పెడుతుంటారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదు.

* ఇంటర్నెట్‌ సెంటర్లలో సాధ్యమైనంత వరకూ ఆన్‌లైన్‌ లావాదేవీలు నిర్వహించకపోవడమే ఉత్తమం. తప్పనిసరి పరిస్థితుల్లో ఆన్‌లైన్‌ వ్యవహారాలు నిర్వహిస్తే..మీ ఆన్‌లైన్‌ ఖాతా పాస్‌వర్డ్‌ను మార్చేయండి.

* కొన్నిసార్లు మనం ఆన్‌లైన్‌ పాస్‌వర్డ్‌లను మర్చిపోయే అవకాశం ఉంది. ఇలాంటప్పుడు కొత్త పాస్‌వర్డ్‌ను ఏర్పాటు చేసుకునేందుకు వన్‌ టైం పాస్‌వర్డ్‌ (ఓటీపీ)ని పంపిస్తాయి బ్యాంకులు. వీటిని వాడగానే వెంటనే మీ ఫోన్‌ లేదా ఈమెయిల్‌ నుంచి తొలగించి వేయండి. బ్యాంకు నుంచి వచ్చిన ఓటీపీలను ఎప్పటికప్పుడు తీసేయడం మంచిది.

* నమ్మకమైన వెబ్‌సైట్లలో మాత్రమే క్రెడిట్‌ కార్డులను ఉపయోగించి చెల్లింపులు చేయాలి. మీరు బిల్లులు చెల్లించేప్పుడు కూడా కచ్చితంగా సంక్షిప్త సందేశాలు వచ్చేలా ఏర్పాటు చేసుకోండి.

మీ కార్డు/ఖాతాలో ఏదైనా మోసం జరిగినట్లు గుర్తిస్తే వెంటనే బ్యాంకు సేవాకేంద్రానికి ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలి. కార్డును నిలిపివేయాల్సిందిగా కోరాలి. ఆ తర్వాత మీ ప్రాంతంలోని సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయాలి.

Personal Finance Stories

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *