తాతా మ‌న‌వ‌ళ్ల మ‌ధ్య పోరు

East Godavari News

తాత మాట తప్పాడని మనవడు- మనవడు గీత దాటాడని తాత.. ఇలా వాదోపవాదాలు సాగుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఆ తాతా- మనవళ్ల ఆధిపత్యపోరు ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రాజకీయాన్ని రసకందాయంలో పడేసింది. దీంతో పార్టీ క్యాడర్‌ తీవ్ర అయోమయానికి గురవుతోంది. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు.. ఆయన మనవడు, ప్రస్తుత జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడు వరుపుల రాజా మధ్య ఇటీవల గ్యాప్ బాగా పెరిగింది. నిన్నటివరకూ “నా వారసుడు రాజానే..” అని చెప్పారు సుబ్బారావు. ఇప్పుడేమో “రాజా దగ్గరకెళ్లారో కబడ్దార్..” అంటూ కార్యకర్తలపై ఉరుముతున్నారు. దీంతో మనవడికి వారసత్వం అందించడం ఇష్టంలేక సుబ్బారావు పక్క చూపులు చూస్తున్నారా? అన్న అనుమానాలూ కలుగుతున్నాయి. అసలీ గొడవకు కారణమేంటో తెలియాలంటే కాస్త వెనక్కి వెళ్లాలి.వరుపుల రాజాకి జిల్లా రాజకీయ నేతలందరితో సత్సంబంధాలున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందే జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన వరుపుల రాజా సామర్థ్యాన్ని చంద్రబాబు గుర్తించారు. రాష్ట్రస్థాయిలో ఆప్కాబ్ ఉపాధ్యక్ష పదవిని కూడా ఆయనకి కట్టబెట్టారు. గత ఎన్నికలు, అంతకు ముందు ఎన్నికలల్లో రాజా క్రియాశీలక పాత్ర పోషించారు. వరుపుల సుబ్బారావు పోల్ మేనేజ్‌మెంట్ మొత్తం ఆయనే చూస్తూ వచ్చారు. అయినా వరుపుల సుబ్బారావు కొన్నిసార్లు రాజాకు దక్కాల్సిన అవకాశాలకు అడ్డంపడిన సందర్భాలు ఉన్నాయట! గతంలో జరిగిన సహకార ఎన్నికల్లో డీసీసీబీ అధ్యక్షుడిగా రాజా పోటీపడుతున్నప్పుడు సుబ్బారావు తీవ్రంగా వ్యతిరేకించారట. రాజాను అతని స్వగ్రామమైన లంపకలోవలో సొసైటీ అధ్యక్షుడిగా నెగ్గకుండా చేసి.. తద్వారా డీసీసీబీ అధ్యక్ష బరిలో ఆయన లేకుండా చేయాలని సుబ్బారావు ప్రయత్నించారన్నది రాజకీయవర్గాల కథనం. కానీ ఆ ఎత్తులన్నీ చిత్తుచేయడం ద్వారా రాజా డీసీసీబీ పీఠాన్ని దక్కించుకున్నారు.2014 సార్వత్రిక ఎన్నికల్లో సుబ్బారావు తన అవసరం కొద్దీ రాజాను కొందరు పెద్దల ద్వారా బుజ్జగించారు. మళ్లీ ఆయనకే పోల్ మేనేజ్‌మెంట్ అప్పగించారు. ఈసారి తనకు సహకరిస్తే.. 2019 ఎన్నికల్లో రాజాకే తమ కుటుంబ రాజకీయ వారసత్వాన్ని అప్పగించి తాను పక్కకు తప్పుకుంటానని పెద్దల సమక్షంలో సుబ్బారావు హామీ ఇచ్చారట! నిజానికి వరుపుల రాజా తాత జోగిరాజు రాజకీయ వారసత్వాన్నే వరుపుల సుబ్బారావు అందుకున్నారు. అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ తాత పేరే కలిగిన జోగిరాజు అలియాస్ రాజాకు తిరిగి ఆ వారసత్వాన్ని అప్పగించాలన్నది ఆ కుటుంబ అభిలాష! దీనికి బలం చేకూరుస్తూ సుబ్బారావు కూడా ఒక సమావేశంలో “వరుపుల రాజానే ప్రత్తిపాడు నియోజకవర్గంలో వరుపుల కుటుంబ రాజకీయ వారసుడు” అని ప్రకటించారు కూడా! అంతేకాదు- తాతా- మనవళ్లిద్దరూ టీడీపీలోకి వచ్చాక.. నియోజకవర్గ పాలన పూర్తిగా రాజానే నడిపించేవారు. సుబ్బారావు కూడా ప్రతి కార్యకర్తనూ మనవడి వద్దకే పంపేవారు. సుబ్బారావు వైసీపీ పక్షాన నెగ్గి తెలుగుదేశంలోకి రావడంతో ఆ వర్గాన్నీ.. టీడీపీ శ్రేణులనీ రాజా బాగానే సమన్వయం చేసి నడిపించేవారు. వచ్చే ఎన్నికల్లో వారసత్వ అవకాశం తనదే అన్న ధీమా, తాత కూడా అక్కడక్కడా ఆ విషయాన్ని ప్రకటిస్తుండటంతో రాజా స్పీడ్ పెంచారు. వరుపుల కుటుంబం పేరిట స్థాపించిన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నేత్రవైద్య శిబిరాలు, లైసెన్స్ మేళాలు, ఉద్యోగ మేళాలు, పిల్లలకు యూనిఫాంలు, పుస్తకాల పంపిణీ.. ఇలా పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారంచుట్టిన రాజా గత ఏడాది ఒక్కసారిగా తన విశ్వరూపం చూపించారు. నియోజకవర్గంలో ఇంటింటికీ సర్వే చేయించి.. ప్రజల ఆరోగ్య సమస్యలను క్రోడీకరించారు. అందుకు అవసరమైన మెగా వైద్యశిబిరాన్ని నిర్వహించారు. ఆఖరికి కాన్సర్‌కి కూడా ఉచితంగా వైద్యం అందించేందుకు రాజా ఏర్పాట్లుచేశారు. దీంతో ఆ వైద్య శిబిరానికి అనూహ్య స్పందన వచ్చింది. యాభై వేలమంది వరకూ నియోజకవర్గ ప్రజలు హాజరయ్యారు. 270 మందికి పైగా ప్రముఖ డాక్టర్లు ఈ శిబిరంలో చికిత్సలు అందించారు. ఇలా అంతకంతకూ పెరిగిపోతున్న మనవడి ప్రాభవం చూసిన తర్వాత ఆ తాతకు ఒకింత అసూయ కలిగిందన్నది కార్యకర్తల ఉవాచ! ఆపై కొద్దిరోజులకు నియోజకవర్గంలో జరిగిన రాజా పుట్టినరోజు వేడుకలు అగ్నికి ఆజ్యం పోశాయి. ఈ వేడుకకు 20 వేలమంది పైగా కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. ఈ పరిణామంతో తాతా- మనవళ్ల మధ్య గ్యాప్ మరింత పెరిగింది. ఇంతకీ ఈ కార్యక్రమాలన్నింటిలో సుబ్బారావు కూడా పాల్గొనడం ఆసక్తికర కోణం! మనవడు తనను మించిపోతున్నాడని గ్రహించిన ఎమ్మెల్యే సుబ్బారావు మళ్లీ రాజాను దూరంపెట్టడం ప్రారంభించారు. రాజా దగ్గరకు వెళ్లిన ఏ కార్యకర్తా తన వద్దకు రావద్దంటూ సుబ్బారావు హుకుం జారీచేశారు. ఎలక్షన్ మేనేజ్‌మెంట్ నిపుణుడిగా, జనసమీకరణలో సిద్ధహస్తుడిగా టీడీపీ పెద్దల వద్ద రాజాకు మంచి గుర్తింపు ఉంది. ఆ మధ్య జరిగిన కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో యనమల చెప్పడంతో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కొన్ని సీక్రెట్ ఆపరేషన్స్ వరుపుల రాజాకు అప్పగించారు. వాటిని రాజా సమర్థవంతంగా పూర్తిచేశారు. ఈ సందర్భంగా రాజా టాలెంట్ గురించి చంద్రబాబు చెవిన వేశారట పుల్లారావు. అలాగే కాకినాడలో జరిగిన చంద్రబాబు ధర్మపోరాట దీక్ష ఏర్పాట్లు, జనసమీకరణలో రాజా కీలకంగా వ్యవహరించారు. ఈ విషయాన్ని కూడా ఇన్‌ఛార్జ్‌ మంత్రి కళా వెంకట్రావు చంద్రబాబుకు వివరించారట. దీంతో చంద్రబాబు నుంచి ఒకసారి వచ్చి కలవమని రాజాకు పిలుపు అందింది. ఈ సందర్భంగా తన ట్రాక్ రికార్డ్‌ను.. తాతకీ తనకీ గత ఎన్నికల్లో కుదిరిన ఒప్పందాన్నీ ముఖ్యమంత్రికి పూసగుచ్చినట్టు వివరించారట రాజా! తదుపరి చంద్రబాబు, లోకేశ్‌ల ఆశీర్వాదం తీసుకుని తిరిగి వచ్చారు. రెట్టించిన ఉత్సాహంతో నియోజకవర్గంలో పనిచేయడం ప్రారంభించారు. క్రమక్రమంగా సిగ్నల్స్ అన్నీ రాజాకు అనుకూలంగా కనిపిస్తుండటంతో స్థానిక కార్యకర్తలు, ప్రజలూ కూడా 2019 టీడీపీ టిక్కెట్‌ రాజాదే అన్న ట్రాక్‌లోకి వచ్చేశారు.
ఈ వరుస ఘటనలను జీర్ణించుకోలేని సుబ్బారావుకు చిర్రెత్తుకొచ్చింది. అదే సమయంలో తనకు వయసు పైబడుతుండటం.. తన కొడుకులిద్దరూ రాజకీయ వారసత్వం అందిపుచ్చుకోకపోవడం కూడా ఆయనలో అసహనాన్ని పెంచాయంటున్నారు పరిశీలకులు. ఏదైతేనేం- “2019లో కూడా నేనే ఎమ్మెల్యేగా పోటీచేస్తాను” అని చెప్పడం ప్రారంభించారు సుబ్బారావు. ఈ తరుణంలో టీడీపీ క్యాడర్ అయోమయానికి గురయ్యింది. పైగా రాజాతో తిరుగుతున్నారంటూ చాలా మంది అసలుసిసలైన టీడీపీ కార్యకర్తలను ఎమ్మెల్యే సుబ్బారావు దూరం పెడుతున్నారు. ఈ పరిస్థితిని కూడా అవకాశంగా మలుచుకున్నారు రాజా! తాత దూరంపెట్టినవారికి అండగా ఉంటున్నారు. వారి పనులు చక్కదిద్దుతూ వాళ్లందరినీ తన వర్గంగా కూడగట్టుకుంటున్నారు. మొత్తంగా చూస్తే సుబ్బారావు కంటే, రాజా వద్దకెళ్లే కార్యకర్తల సంఖ్య బాగా ఎక్కువైంది. కొందరు కార్యకర్తలైతే “గత ఎన్నికల్లో మీరిచ్చిన మాటనే తప్పితే ఎలా?” అని సుబ్బారావును అడిగారట. “వారసత్వాన్ని నేను అప్పగించేవరకూ ఆగాలి కదా! రాజా ముందే తొందరపడ్డాడు. నేను హర్ట్ అయ్యాను. అందుకే మళ్లీ పోటీ చేస్తానంటున్నా..” అంటూ వరుపుల కయ్యిమని లేచారట. “మీ ఇద్దరికీ గొడవెందుకు సార్!” అని నచ్చచెప్పబోయిన ఒక మండలస్థాయి సీనియర్ కార్యకర్తను సుబ్బారావు ఇటీవల బండబూతులు తిట్టారట. దీంతో ఆ సీనియర్ కార్యకర్తకి ఒళ్లు మండిపోయిందట! నియోజకవర్గంలో కొందరు ముఖ్య కార్యకర్తలను కూడేసి సుబ్బారావుకు వ్యతిరేకంగా ఒక రహస్య భేటీని నిర్వహించారట! రాజా మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా చాలా కూల్‌గా క్యాడర్‌ను పెంచుకుంటూ వెళుతున్నారు. చంద్రబాబుతో పాటు, లోకేశ్‌తోనూ టచ్‌లో ఉంటున్నారు. జిల్లాలో టీడీపీ పెద్దలైన యనమల, రాజప్పలతో మంచి రిలేషన్స్ మెయింటైన్‌ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైన ప్రత్తిపాడు టీడీపీ టిక్కెట్ దక్కించుకోవాలన్న పట్టుదలతో తంటాలు పడుతున్నారు. వీస్తున్న ఎదురు గాలిని గమనించిన సుబ్బారావు ట్రెండ్‌ మార్చారు. ఇటీవల సంభవించిన తితలీ తుఫాన్ వంకతో తన పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకున్నారు. మరోవైపు వరుపుల సుబ్బారావుకు స్వయానా అన్న కొడుకు అయిన వరుపుల తమ్మయ్యబాబు ఇటీవల టీడీపీని వీడి జనసేనలోకి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే సుబ్బారావు, తమ్మయ్యబాబు ఇద్దరూ లింగంపర్తిలో ఒకే ఇంటిలో నివసిస్తారు. ఈ కారణంగా ఇప్పుడు ఎమ్మెల్యే సుబ్బారావు ఇంటిపైన జనసేన జెండా ఎగురుతూ కనిపిస్తోంది. టీడీపీ జెండా ఎక్కడా కనిపించడం లేదు. ఈ తరుణంలో “సుబ్బారావు త్వరలో వేయబోయే కొత్త అడుగులకు ఈ పరిణామం సంకేతమా?” అన్న అనుమానం టీడీపీ క్యాడర్‌కి కలుగుతోంది. సుబ్బారావే తమ్మయ్యబాబును జనసేనలోకి పంపారని కొందరు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. నియోజకవర్గ ప్రజలేమో “ఇదెక్కడి కిరికిరి రాజకీయంరా బాబూ?” అని ఆశ్చర్యపోతున్నారు. మారుతున్న పరిస్థితులను టీడీపీ అధిష్టానం నిశితంగా గమనిస్తూనే ఉందట! ఇదండీ ప్రత్తిపాడులో సాగుతున్న వరుపుల ఫ్యామిలీ రాజకీయ రగడ!! దీనిపై టీడీపీ హైకమాండ్‌ ఎలా స్పందిస్తుందో అని కార్యకర్తలంతా ఆసక్తిగా చూస్తున్నారు.

East Godavari News , Pathipadu mla varuvula subba rao , Varuvula Raja, Fighting between grand Father and grand sons , Political war between grand Father and grand sons in East Godavari.

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *