ఏప్రిల్ ఎన్నిక‌ల కోసం  ముంద‌స్తు ప్ర‌చారం

Pre-election campaign for the April election

జనవరిలో జన్మభూమి, మార్చిలో ఇంటింటికీ తెలుగుదేశం, జూలైలో గ్రామదర్శిని, నగర దర్శిని.. వెనువెంటనే గ్రామవికాసం, తరవాత మళ్లీ గ్రామసభలు! ఇలా ఎమ్మెల్యేలను గ్రామాలకు పంపుతూ, ఇల్లిల్లూ తిరిగేలా ఏపీ సర్కారు రూపొందించిన  కార్యక్రమాలివి. అయితే ప్రభుత్వం ఇంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాలు చేపడితే గ్రామాల్లోకి వెళ్లేందుకు మొదట్లో ప్రజాప్రతినిధులు ఇబ్బంది పడ్డారట. మనసులో చంద్రబాబును తిట్టుకుంటూనే గ్రామాల్లోకి వెళ్లేవారట. కానీ ఇప్పుడు మాత్రం వారి ఆలోచన మారిందట.జన్మభూమి, ఇంటింటికి తెలుగుదేశం వంటి కార్యక్రమాల కోసం గ్రామాలకు వెళ్లాల్సిందేనని అధినేత చంద్రబాబు చెప్పిన ప్రతిసారీ ఎమ్మెల్యేలు ఇబ్బందిపడిపోయేవారట. కానీ ఆ ఎమ్మెల్యేలే ఇప్పుడు మనసులో చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు. దీనికి కారణం తెలంగాణలో ఎన్నికల సందర్భంగా ప్రజాప్రతినిధులకు ఎదురవుతున్న అనుభవాలే! తెలంగాణలో పలు గ్రామాల్లో ప్రజలు ఎమ్మెల్యేలకి చుక్కలు చూపిస్తున్నారు. ఊర్లోకి రానివ్వకుండా వారిని అడ్డుకోవడం, నల్లాలు, మోరీల మరమత్తుల గురించి నిలదీస్తున్న దృశ్యాలు ఏపీ ఎమ్మెల్యేలకు కనువిప్పు కలిగిస్తున్నాయి. తెలంగాణలో అధికారపార్టీ తాజా మాజీలకు గట్టిగానే నిరసనల సెగ తగులుతోంది. ఓట్ల కోసం వెళుతున్న అభ్యర్థులకు ఎదురవుతున్న నిలదీతలు, నిరసనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అశ్వారావుపేట టీఆర్ఎస్ ఎమ్మల్యేపైన ఏకంగా చెప్పులు విసిరిన ఘటన ఏపీ ఎమ్మెల్యేల్లో ప్రకంపనలు రేపింది. 2014లో ఎన్నికల్లో గెలిచి, ఇంతకాలం నియోజకవర్గాన్ని పట్టించుకోని నేతలకు ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. అయితే ఆంధ్రాలో కూడా కొందరు ఎమ్మెల్యేలకి ఇలాంటి సెగలు తప్పడం లేదట. చాలా రోజులుగా కొందరు ఎమ్మెల్యేలపై జనం అసహనంగా ఉన్నారు. అయితే ప్రజల్లో ఉన్న ఆ ఆగ్రహాన్ని చల్లార్చేందుకు, ప్రజలతో నిత్యం సంబంధాలు కొనసాగించేందుకు ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌ఛార్జులను ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రామాలకు పంపిస్తున్నారు. గత ఏడాది ప్రజాప్రతినిధులంతా నాలుగుసార్లు గ్రామాలకు వెళ్లారు.  ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఇల్లిల్లూ తిరిగారు. గ్రామీణుల సమస్యలు తెలుసుకోవడం, వాటిని అక్కడికక్కడే పరిష్కరించడం, తమ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను ట్యాబ్‌లో తీసి పార్టీ రాష్ట్రకార్యాలయానికి పంపడం వంటివి చేశారు. తను నిర్దేశించిన కార్యక్రమాన్ని లైట్‌గా తీసుకున్న వారిని ముఖ్యమంత్రి చంద్రబాబు గట్టిగానే మందలించారు. దీంతో అలాంటి వారు కూడా మనసులో చంద్రబాబును తిట్టుకుంటూనే గ్రామాల్లోకి వెళ్లారు. జన్మభూమి కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డులు, గ్రామాల్లో సిమెంట్ రహదారుల నిర్మాణం వంటి అంశాలపై దృష్టిపెట్టారు. ఇతర కార్యక్రమాల అమలు కోసం గ్రామసభలను ఏర్పాటుచేసి జనంతో ఎమ్మెల్యేలు మమేకమయ్యారు. రెండు నెలల నుంచి గ్రామ దర్శిని, నగర దర్శిని కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ప్రజాప్రతినిధులు అధికార యంత్రాంగంతో కలిసివెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని అక్కడికక్కడే వాటిని పరిష్కరిస్తున్నారు. ఇక రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో, ముఖ్యంగా ఎస్సీ కాలనీలలో సిమెంట్ రహదారుల నిర్మాణాన్ని పంచాయితీరాజ్‌శాఖ భారీగా చేపట్టింది. ఇందుకు ఉద్దేశించిన నరేగా నిధులను ఉపయోగించుకోవడంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని  కేంద్రమే ప్రకటించింది. మరుగుదొడ్ల నిర్మాణంలో కూడా దేశంలో ఏపీ అగ్రస్థానంలో ఉంది. పంచాయితీరాజ్‌ శాఖమంత్రి లోకేశ్‌ చేపట్టిన ఈ రెండు కార్యక్రమాలు దిగ్విజయంగా అమలవుతున్నాయి. ఈ పథకాలు నియోజకవర్గంపై ఎమ్మెల్యేలకు పట్టును పెంచాయి. సిమెంట్ రహదారుల ప్రారంభోత్సవాల సందర్భంగా కూడా మరోసారి ఎమ్మెల్యేలు గ్రామాలలో పర్యటించారు. ఇలా ఈ సంవత్సరకాలంలో అయిదుసార్లు ఎమ్మెల్యేలు గ్రామాలకు తరలివెళ్లారు. ప్రస్తుతం ఏపీలో నగర, గ్రామదర్శిని కార్యక్రమం జరుగుతోంది. ఆ వెంటనే జనవరిలో మళ్లీ జన్మభూమి ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చి తొలివారంలో ఎన్నికల షెడ్యూల్ వస్తుంది. అప్పటివరకు ప్రజాప్రతినిధులు ఏపీలో జనంలోనే ఉంటారన్న మాట! ఇదంతా ఒక ఎత్తయితే.. సీఎం తమనలా ఊళ్ల చుట్టూ తిప్పడం నిన్నమొన్నటి వరకూ కొందరు ఎమ్మెల్యేలకు నచ్చేది కాదట. అయితే ఎన్నికల వేళ తెలంగాణలో పరిస్థితులు చూస్తుంటే.. ఏపీ ఎమ్మెల్యేలు ఊపిరి పీల్చుకుంటున్నారట. ముఖ్యంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను జనం నిలదీస్తున్న తీరు, అడ్డుకుంటున్న ఘటనలు వారి కళ్లు తెరిపిస్తున్నాయట. తమను గ్రామాలకు పంపి చంద్రబాబు మంచిపని చేశారనీ, లేదంటే ఎన్నికల్లో తమకూ ఇలాంటి పరిస్థితే ఎదురయ్యేదనీ అనుకుంటున్నారట. చాలామంది మంత్రులు సైతం ఇదే అభిప్రాయాన్ని లోకేశ్ దగ్గర వ్యక్తం చేశారట. ఈ విషయంలో చంద్రబాబుకు చేతులెత్తి మొక్కాల్సిందేననీ, ఆయన అనుభవం, వ్యూహం తమకెంతో ఉపయోగపడుతున్నాయనీ సాక్షాత్తూ ఓ సీనియర్ మంత్రి క్యాబినెట్‌ భేటీలో చెప్పారట. ఇదీ ఏపీలో ప్రజాప్రతినిధుల మధ్య సాగుతున్న హాట్‌హాట్‌ చర్చ!

To Know more Honor Mobiles and with their Specification Click Here

Check out For Honor Prize in amazon

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *