గాలిజ‌నార్ధ‌న్‌రెడ్డి ఎవ‌రితో 20 కోట్ల డీల్‌?

Gali Janardan Reddy

మరోసారి గాలి జనార్దన్ రెడ్డి కటకటాల పాలయ్యేందుకు సిద్దమయ్యాడు. కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి ప్రస్తుతం పరారీలో ఉన్నారు. బెంగళూరుకు చెందిన అంబిడెంట్ మార్కెటింగ్ కంపెనీ చీటింగ్ కేసులో చిక్కుకున్న ఆయన్ని అదుపులోకి తీసుకునేందుకు బెంగళూరు సీసీబీ పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బెంగళూరు పోలీసు కమిషనర్‌ సునీల్‌ కుమార్‌ మీడియా సమావేశంలో వివరించారు.
2016౼17లో స్థాపించిన అంబిడెంట్ కంపెనీ వినియోగదారులను మోసగించినట్లు గత జనవరిలో ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు ఆ సంస్థపై పలుమార్లు దాడులు చేపట్టారు. ఈ కేసు నుంచి కాపాడాల్సిందిగా జనార్దన్‌ రెడ్డి పీఏ అలీఖాన్‌ను అంబిడెంట్ సంస్థ ఛైర్మన్ ఫరీద్‌ కలిశారు. ఈడీ కేసుల నుంచి తప్పించేందుకు రూ.20.5కోట్ల డీల్ కుదిరింది. ఒప్పందంలో భాగంగా రూ.18.5కోట్లను బెంగళూరుకు చెందిన అంబికా జ్యూయలర్స్‌ సంస్థ యజమాని రమేశ్‌ కొఠారి ఖాతా నుంచి బళ్లారికి చెందిన రాజ్‌మహల్‌ జ్యూయలర్స్ యజమాని రమేశ్‌కి పంపించాడు. ఈ సొమ్ముతో 57 కేజీల బంగారం జనార్దన్‌ రెడ్డి పీఏ అలీఖాన్‌కు అందజేశారు. ఒప్పందంలో భాగంగా మిగిలిన సొమ్మును నగదు రూపంలో చేరవేశారు. అంబిడెంట్ సంస్థ వినియోగదారుల ఫిర్యాదులు పెరుగుతున్న నేపథ్యంలో గత 10 రోజులుగా విచారణ ముమ్మరం చేశారు.
వారం రోజుల క్రితం ఫరీద్, రాజ్‌మహల్ జ్యూయలర్స్‌ యజమాని రమేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నగదు లావాదేవీలు జరిగిన ఖాతాలను జప్తు చేశారు. పరారీలో ఉన్న గాలి జనార్దన్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు సీసీబీ పోలీసులు గాలిస్తున్నారు. గాలి జనార్దన్ రెడ్డి, ఆయన అనుచరుల మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా హైదరాబాద్‌లో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తెలంగాణా పోలీసుల సహకారంతో బెంగళూరు పోలీసులు జనార్దన్‌ రెడ్డిని అరెస్టు చేసేందుకు యత్నిస్తున్నారు. సెర్చ్ వారెంట్‌తో బెంగళూరు, బళ్లారిలోని జనార్దన్‌రెడ్డి నివాసాల్లో మూడు సీసీబీ బృందాలు తనిఖీలు చేస్తున్నాయి. బెంగళూరులోని గాలి జనార్దన్‌ రెడ్డి నివాసం పారిజాత అపార్ట్‌మెంట్‌లో తనిఖీలు చేసేందుకు సీసీబీ పోలీసులు వెళ్లారు. అయితే ఇంటికి తాళం వేసి ఉండటంతో రెండుగంటల పాటు శ్రమించిన పోలీసులు ఎట్టకేలకు కీ మేకర్ సాయంతో తలుపులు తెరిచి సోదాలు చేశారు. ఇదిలా ఉండగా జనార్దన్‌ రెడ్డి దేశం విడిచి పారిపోయే అవకాశాలు ఉండటంతో లుకౌట్ నోటిసులు జారీ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేస్తున్నారు. మరోవైపు ఏసీపీ సుబ్రమణ్య నేతృత్వంలో హైదరాబాద్‌లో తనిఖీలు ముమ్మరం చేశారు.

Gali Janardan Reddy, Gali Janardan Reddy ED Case, Telugu news, Gali Janardan Reddy latest news on ED case, Bangalore CBI Police

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *