సెల్ఫీల్లేక స‌ప్ప‌గా జ‌గ‌న్ పాద‌యాత్ర‌

JAGAN PADAYATRA ISSUES

తానొకటి తలిస్తే.. దైవం మరొకటి తలిచాడు అన్న చందంగా తయారైంది ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ పాదయాత్ర వ్యవహారం! ఇంతవరకు మూడు సెల్ఫీలు- ఆరు పలకరింపులతో సాఫీగా సాగిన ప్రజాసంకల్పయాత్ర.. కోడి కత్తి దాడి ఘటన తర్వాత సంక్లిష్టంగా మారింది. జగన్ పాదయాత్ర ఇప్పుడు ఆ పార్టీకి చెందిన వాళ్లకే అగ్నిపరీక్షగా మారింది. ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర చేపట్టి 290 రోజులు దాటింది. 12 జిల్లాల్లో సుమారు మూడువేల కిలోమీటర్ల సాఫీగా సాగింది. యాత్రలో భాగంగా విద్యార్ధులతో సెల్పీలు, వృద్ధులకు ముద్దులు, తాత – అవ్వలకు పలకరింపులు వంటివి బాగానే పండాయి. అయితే ఇటీవల ఊహించని ఘటన చోటుచేసుకుంది. విశాఖ ఎయిర్‌పోర్టులో కోడి కత్తితో జగన్‌పై దాడి జరిగింది. ఆ తర్వాత పాదయాత్ర కష్టతరంగా మారిందని పలువురు కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. ఇదివరకు పాదయాత్రలో జగన్‌కి చాలామంది చేరువకి వచ్చేవారు. అలాంటివారిని ఆయన పలుకరించేవారు. ఫోటోలకు ఫోజులిచ్చేవారు. ఇలాంటి సన్నివేశాలను మీడియా క్యాచ్‌ చేసేది. అయితే ఇప్పుడు ఆయన పాదయాత్రకి భద్రత పెంచారు. పోలీసుల ఆంక్షల పట్ల ఎలా వ్యవహరించాలో తెలియని పరిస్థితి వైసీపీ శ్రేణులకు ఏర్పడిందట! దీనికి తోడు కత్తి దాడి తర్వాత పాదయాత్ర చేపట్టిన నియోజకవర్గాలలోనూ, గ్రామస్థాయిల్లోనూ పనిచేసే జగన్ సొంత మీడియా విలేకరులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయట! అ విషయాలే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. జగన్‌పై కోడి కత్తితో దాడి జరిగిన తర్వాత ఆయనకు ఏపీ పోలీసులు భారీగా భద్రతను పెంచారు.

విజయనగరం జిల్లాలో పునఃప్రారంభమైన పాదయాత్ర కోసం మూడంచెల భద్రతను ఏర్పాటుచేశారు. కల్వర్టుల వద్ద, పాదయాత్ర సాగే రహదారికి ఇరువైపుల బాంబ్‌ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో పరిశీలించాకే యాత్రకు అనుమతి ఇస్తున్నారు. జగన్ కోసం ఏర్పాటు చేసిన శిబిరాలను సైతం పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. రాత్రివేళ జగన్ బస చేసే ప్రాంతాలు కూడా ఆంధ్ర, ఒడిషా సరిహద్దు ప్రాంతాల్లో ఉండటంతో ప్రత్యేకంగా రెండు పెట్రోలింగ్ బృందాలతో గస్తీ నిర్వహిస్తున్నారు. పాదయాత్రలో ప్రతి పోలీస్ అధికారి రహస్య కెమేరాలు ధరించి విధులు నిర్వర్తిస్తున్నారు. డ్రోన్‌లు, ప్రత్యేక వీడియో కెమేరాలతో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. 25 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను రంగంలోకి దించారు. వీరితో పాటు మరో 20 మంది స్పెషల్ బ్రాంచ్, సివిల్ పోలీసులు సాధారణ దుస్తుల్లో పహారా కాస్తున్నారు. గతంలో సర్కిల్ పరిధిలో ఉండే పోలీసులు మాత్రమే బందోబస్తు నిర్వహించేవారు. తాజాగా ఇద్దరు డీఎస్పీలు, ఒక సీఐ, పదిమంది ఎస్సైలతో కలిపి సబ్ డివిజన్ స్థాయి వరకు పోలీసులంతా పాదయాత్ర విధుల్లోనే ఉంటున్నారు. గతంలో భద్రతా సిబ్బంది 60 మంది వరకే ఉంటే ప్రస్తుతం 140 మందికి పైగానే బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జగన్ వ్యక్తిగత సిబ్బందితో పాటు పాదయాత్రలో పాల్గొంటున్న అభిమానులందరి ఆధార్ కార్డులను పరిశీలిస్తున్నారు. వారిలో ఎవరికైనా నేరచరిత్ర ఉందేమోనని ఆరా తీస్తున్నారు. జగన్‌కు కలవడానికి వచ్చే ప్రతి ఒక్కరినీ మెటల్ డిటెక్టర్‌తో తనిఖీ చేశాకే అనుమతిస్తున్నారు. జగన్‌తో పాటు రోప్ లోపల ఉండే ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం, వ్యక్తిగత భద్రతా సిబ్బందికి ఎరుపురంగు కార్డులిచ్చారు. రోప్ వెలుపల విధులు నిర్వర్తించే సిబ్బందికి ఆకుపచ్చ కార్డులిచ్చారు. జగన్‌తో పాటు ఇడుపులపాయ నుంచి పాదయాత్రలో పాల్గొంటున్న 50 మంది సాధారణ పౌరులకు నీలంరంగు కార్డులను ఇచ్చారు. రోప్ పార్టీలు గతంలో రెండు మాత్రమే ఉంటే ఇప్పుడు నాలుగు బృందాలుగా పని చేస్తున్నాయి.

* జగన్‌పై కోడికత్తి దాడి అనంతరం పోలీసులు కొన్ని అంక్షాలు విధించడంతో ఆయన సొంత మీడియాలో పని చేస్తున్న విలేకరులకు, పార్టీ కార్యకర్తలకు కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. ఇదివరకు మాదిరిగా జగన్ పాదయాత్రలో పలకరింపులకు, ముద్దులకు, సెల్ఫీలకు ఎవరినీ పోలీసులు అంత తేలికగా రానివ్వడం లేదు. దీంతో తన పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉందని వైసీపీ అధినేత జగన్ సహా పార్టీ నేతలు భావిస్తున్నారట. అందుకే పాదయాత్రలో తన వద్దకు ఎవరు రావాలి.. ఎవరిని సెల్ఫీల కోసం పంపించాలి వంటి అంశాలపై ఆయా నియోజకవర్గాలు, గ్రామాల్లో పనిచేసే విలేకరులకు, పార్టీ కార్యకర్తలకు బాధ్యతను అప్పగించినట్టు వినికిడి! ఈ రకమైన టార్గెట్‌లు విధించడంతో పార్టీ శ్రేణులు అయోమయస్థితిలో పడ్డాయట. ఈ నేపథ్యంలో జగన్ పాదయాత్రలో సెల్ఫీలు, పలకరింపులకు మహిళలను ఎంపికచేసి, వారికి పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇప్పించడం అనేది ఒక సమస్యగా మారిందని ఆ పార్టీ కార్యకర్తలే చెవులు కొరుక్కుంటున్నారు.తమ పార్టీకి లాభపడుతుందనుకున్న కోడి కత్తి దాడి.. చివరకు తమకే చేటు తెస్తోందని వైసీపీ వర్గాలు తలపోస్తున్నాయి. పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చిన తమకి ఆంక్షాల పేరుతో ఇబ్బందులు ఎదురుకావడం.. కోడి కత్తి దాడి వ్యవహారంలో ఆశించిన స్థాయిలో సెంటిమెంట్ పండకపోవడం ఆ పార్టీ నేతలకు నిరాశ కలిగిస్తున్నాయట! ఈ సమస్య నుంచి వారెప్పుడు బయటపడతారో చూద్దాం!

PADAYATRA ISSUES OF JAGAN

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *