అప్ప‌టి ప్ర‌త్య‌ర్ధులు ఇప్పుడు ఒక‌ట‌య్యారు…

Jagityala Political news
జగిత్యాల రాజకీయ చరిత్రలోనే ఈసారి విచిత్రమైన పోరు జరగబోతోంది. ఇన్నాళ్లూ ప్రత్యర్థులుగా ఉన్న ఎల్. రమణ, జీవన్‌రెడ్డి ఒక్కటయ్యారు. 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ పార్టీలతో పొత్తుపెట్టుకున్న టీఆర్ఎస్ ఈసారి సింగిల్‌గా బరిలో దిగుతోంది. 2014లో ట్రయాంగిల్ పోటీ జరిగిన జగిత్యాలలో ఈసారి వార్ టీఆర్ఎస్, మహాకూటమి మధ్య సాగుస్తోంది. జగిత్యాలలో రెండు వారాలుగా చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు ఎవరికి మేలు చేస్తాయో, ఎవరికి నష్టం చేస్తాయో తెలీదు కానీ ఈసారి గెలుపును మాత్రం అన్ని పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పార్టీలే కాదు- ఎంపీ కవిత, జీవన్‌రెడ్డి, ఎల్.రమణ కూడా వ్యక్తిగత ప్రతిష్టగా భావిస్తున్నారు. ముగ్గురి మాటలు చలికాలంలో నెగళ్లను రాజేస్తున్నాయి. కూటమి పురుడుపోసుకుంటున్న దశలోనే ఎల్‌.రమణ నేరుగా జీవన్‌రెడ్డికి సపోర్ట్ చేశారు. జీవన్‌రెడ్డిని గెలిపించాలనీ, తమిద్దరిదీ సోదరబంధమనీ అన్నారు. ఈ పరిణామంతో కాంగ్రెస్ శ్రేణులు, తెలుగు తమ్ముళ్లు షాకయ్యారు. అంతటితో ఆగక జీవన్‌రెడ్డి గెలుపునకు లక్ష రూపాయల చెక్ అందించారు కూడా! ఆ షాక్‌ నుంచి రెండు పార్టీల కార్యకర్తలు ఇంకా తేరుకోవడం లేదనే చెప్పవచ్చు.
రమణేంటి? ఇలా చేస్తున్నారేంటి? అనే చర్చే అంతటా! టీడీపీ తెలంగాణ అధ్యక్షుడిగా జగిత్యాలలో ఆయన గెలవడం అత్యంత అవసరం. చిన్న వార్డులో ఓడితేనే “నీ ఇలాఖాలోనే గెలిపించుకోలేకపోయావ్.. నువ్వేం నాయకుడివి” అంటూ అవతలివాళ్లు టార్గెట్ చేస్తుంటారు. అలాంటిది కూటమిలోని ఓ పార్టీకి రమణ అధ్యక్షుడు. అందుకే ఈ గెలుపు రమణకు అంత్యంత కీలకం. ఇక్కడ కూటమి అభ్యర్థి గనుక ఓడితే రెండు రాష్ట్రాల్లోనూ ఆ పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ఇక జీవన్‌రెడ్డి. ఆయనకూ ఈసారి గెలుపు అత్యంత అవసరం. 2014లో ఇవే తనకు చివరి ఎన్నికలంటూ సెంటిమెంట్‌తో గెలిచిన జీవన్‌రెడ్డి మళ్లీ బరిలో దిగుతున్నారు. అసెంబ్లీలో అధికారపక్షంపై వాడివేడి విమర్శలను సంధిస్తారనే ప్రచారం ఉంది. ఈసారి సొంత బలానికి తోడు రమణ అండతో అత్యధిక మెజారిటీతో గెలవాలని ఆయన ఉవ్విళ్లూరుతున్నారు. ఎంపీ కవిత అయితే జగిత్యాల గెలుపును ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ఉత్తర తెలంగాణలో ఇంతవరకూ గులాబీజెండా ఎగరని స్థానం జగిత్యాలే! తాను ఎంపీ అయిన దగ్గర్నుంచీ జగిత్యాలపైనే ఎక్కువ దృష్టిపెట్టారు. కవిత ఢిల్లీలో ఉన్నా, హైదరాబాద్‌లో ఉన్నా మనసంతా జగిత్యాల మీదే ఉంటుందని స్థానిక టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సంజయ్‌కుమార్ చేసిన వ్యాఖ్యలు చాలు- కవిత ఏ స్థాయిలో జగిత్యాలపై కాన్‌సంట్రేట్‌ చేశారో చెప్పడానికి! మొన్నటిదాకా జగిత్యాల అంటే జీవన్‌రెడ్డి, ఎల్‌.రమణ మాత్రనే మదిలో మెదిలేవారు. ఇప్పుడు జగిత్యాల అంటే కవిత కూడా అన్న ప్రచారం జరుగుతోంది. ఈసారి ఎలాగైనా జగిత్యాలలో గులాబీజెండా రెపరెపలు చూడాలని కవిత తాపత్రయపడుతున్నారు. అందుకు తగ్గట్టుగా కష్టపడుతున్నారు. చాలా రోజులుగా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఆమె అనుకున్నట్టుగానే క్షేత్రస్థాయిలో గ్రౌండ్‌వర్క్ పూర్తయిందన్న ప్రచారం సాగుతోంది. రెండోసారి టికెట్ దక్కించుకున్న టీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్‌కుమార్ భవిష్యత్ ఈ ఎన్నికల ఫలితంతో తేలిపోనుంది. గతంలో ఓడిపోయిన సానుభూతితో పాటు కవిత అండ ఉండటం ఆయనకు కలిసిరావచ్చని పార్టీ శ్రేణులు అంచనా వేస్తున్నాయి. జగిత్యాలకు సంబంధించి మరో ఆసక్తికర అంశమేంటంటే పట్టణ ఓటర్లంతా ప్రతీ ఎన్నికల్లో జీవన్‌రెడ్డికి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఎల్‌.రమణ ద్వారా ఈసారి ఆ ఓట్లు తనకే కలిసివస్తాయని ఆయన భావిస్తున్నారు.కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న యావర్ రోడ్డు విస్తరణ సమస్యను ఓటర్లు ఎత్తి చూపుతున్నారు. అయితే మూడు పార్టీల నేతలూ ఆ నెపాన్ని ఒకరిమీద ఒకరు నెట్టేసుకుంటున్నారు. మరి జగిత్యాల ఓటర్లు ఈసారి ఎవరికి పట్టం కట్టనున్నారు? ఇద్దరు ఓవైపు, ఒకరు మరోవైపు ఉండి సాగిస్తున్న పోరులో గెలుపు ఎవరి పక్షం వహిస్తుంది? జగిత్యాల ఓటరు దేవుడి నాడి ఎలా ఉంది? ఈ వివరాలు వెల్లడి కావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Jagityala Political news, L Ramana , Jeevan reddy , TRS  Latest news, Congress Update news, Telugu news, TRS Cndidate Sanjay kumar.

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *