జనగామ సీటు కోదండరామ్ కే..

Janagama seat for Kodandaram

· కాంగ్రెస్ అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్

· 19న నామినేషన్ వేయనున్న టీజేఎస్ అధినేత

· నేడు ఢిల్లీకి వెళ్లనున్న కోదండరామ్

సస్పెన్స్ రేకెత్తిస్తున్న జనగామ నియోజకవర్గ వ్యవహారం కొలిక్కి వచ్చినట్టేనా? అక్కడ నుంచి పోటీ చేయడానికి తెలంగాణ జనసమితి అధినేత కోదండరామ్ కు లైన్ క్లియర్ అయినట్టేనా? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అక్కడ నుంచి కోదండరామ్ బరిలోకి దిగడం ఖాయమనే తెలుస్తోంది. ఇందుకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఆయనకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన ప్రచారానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తిచేసుకోవడం ఈ పరిణామాలను బలపరుస్తోంది. ప్రచార రధం సిద్ధం చేసుకోవడంతోపాటు జనగామలో టీజేఎస్ కార్యాలయం కూడా ఏర్పాటైంది. 19న జనగామ స్థానం నుంచి టీజేఎస్ అభ్యర్థిగా కోదండరామ్ నామినేషన్ వేయడానికి కూడా సన్నాహాలు చేసుకుంటున్నట్టు సమాచారం. వాస్తవానికి జనగామ సీటుపై మొదటి నుంచీ పీటముడి కొనసాగుతోంది. ఆ స్థానాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య ఆశిస్తున్నారు. అధిష్టానం తనకే టికెట్ కేటాయిస్తుందని భావించారు. అయితే, పొత్తులో భాగంగా ఆ స్థానాన్ని టీజేఎస్ కు కేటాయించాలని కాంగ్రెస్ నిర్ణయించినట్టు వార్తలు వచ్చాయి. అలాగే అక్కడి నుంచి టీజేఎస్ అధినేత కోదండరామ్ బరిలోకి దిగనున్నారనే ప్రచారం పొన్నాలకు మింగుడుపడలేదు. దీనికి తగ్గట్టుగానే తొలి రెండు జాబితాల్లో ఆయన పేరు కనిపించలేదు. దీంతో ఆందోళనకు లోనైన వెంటనే హస్తిన బాట పట్టారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిసి తన గోడు వెళ్లబోసుకున్నారు. ఈ విషయంపై తాను మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారని అనంతరం పొన్నాల మీడియాకు తెలిపారు. అయితే, వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. పొన్నాలతోపాటు సనత్ నగర్ సీటు ఆశిస్తున్న మర్రి శశిధర్ రెడ్డిని బుజ్జగించే బాధ్యతను కాంగ్రెస్ కోర్ కమిటీ సభ్యుడు అహ్మద్ పటేల్ తీసుకున్నారు. వీరిద్దరికీ ఏదైనా ఇతర స్థానం నుంచి టికెట్ ఇస్తారా? లేక ప్రత్యామ్నాయంగా ఏదైనా పదవి ఆఫర్ చేస్తారా అన్నది ఇంకా తెలియలేదు. మరోవైపు కాంగ్రెస్ పిలుపు మేరకు కోదండరాం శుక్రవారం ఢిల్లీ వెళ్తున్నారు. పొత్తులో భాగంగా టీజేఎస్ కు ఇవ్వాల్సిన సీట్ల గురించి మాట్లాడటానికే ఆయన్ను ఢిల్లీ పిలిపించినట్టు తెలుస్తోంది.

Janagama seat for Kodandaram , Congress Latest news, Telugu News, Telangana latest news, Janagama seat for TJS Party President Kodandaram 

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *