జనగామ బరిలో కోదండరామ్.. మరి పొన్నాల పరిస్థితేంటి

kodhandaram latest news

మహాకూటమి అభ్యర్థిగా జనగామ నుంచి టీజేఏసీ అధ్యక్షుడు కోదండరామ్ కు పోటీచేయడానికి కాంగ్రెస్  నిర్ణయం తీసుకుంది. ఒకవైపు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య సొంత నియోజకవర్గం కావడం.. ఇప్పటివరకూ పొన్నాలకే అనుకున్న టికెట్ విషయంలో ఇప్పుడు కోదండరామ్ పేరు వినిపిస్తుండడంతో పొన్నాల అనుచరుల్లో టెన్షన్ నెలకొంది.

మహాకూటమి పొత్తుల వ్యవహారం మాజీ పీసీసీ చీఫ్ పొన్నాలకు నిద్ర లేకుండా చేస్తోంది. నిన్నటివరకూ వరంగల్ తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట, స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గాలపై దృష్టి సారించిన కూటమి నేతలు ఇప్పుడు తాజాగా వాటన్నిటికంటే జనగామ బెటర్ అంటూ డిసైడయ్యారట. ఢిల్లీలో కాంగ్రెస్, టీజేఎసీ నేతలతో రాహుల్ గాంధీ జనగామ సీటుపై చర్చించారు. జనగామ జిల్లా సాధనకు జేఏసీ పట్టువదలకుండా చివరివరకూ పోరాడడం, ఉద్యోగులతో పాటు యువతలో ఫాలోయింగ్ ఉందన్న అంచనాలతో టీజేఎస్ ఈ స్థానాన్ని కోరుతున్నట్లు సమాచారం.

మహాకూటమి టికెట్ల కేటాయింపుపై ఇప్పటికే చాలాసార్లు చర్చలు జరిగాయి. అయితే ఈ చర్చల్లో టీజేఏసీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొదట్లో నాలుగు టికెట్లు అడిగినప్పటికీ.. చివరినిముషంలో రెండు టికెట్లు చాలంటూ చెప్పింది. దీంతో వరంగల్ ఈస్ట్, వెస్ట్, స్టేషన్ ఘన్ పూర్ వదిలేసి కొత్తగా జనగామ తెరపైకి వచ్చింది. గతంలోనూ జనగామ నుంచి కోదండరామ్ పోటీ చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ.. అప్పట్లో అవన్నీ ఊహాగానాలే అంటూ టీజేఏసీ నేతలు కొట్టిపారేశారు. తాజాగా ఢిల్లీ చర్చలు అనంతరం పొన్నాల స్థానంలో కోదండరామ్ అయితే కొంత బెటర్ గా ఉంటుందని రాహుల్ గాంధీ అలోచించారట. ఢిల్లీ చర్చల్లో కోదండరామ్ జనగామ టికెట్ అడిగినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కోదండరామ్ ఎక్కడ టికెట్ అడిగితే అక్కడ ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు గతంలోనే కాంగ్రెస్ పెద్దలు ప్రకటించిన నేపథ్యంలో కోదండరామ్ టికెట్ ఇప్పుడు పొన్నాల సీటుకు ఎసరు తెచ్చిపెట్టింది. గత ఎన్నికల తప్పిదాలను పునరావృతం చేయకుండా గెలుపుగుర్రాలకే టికెట్లు ఇవ్వాలంటూ కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర కసరత్తు చేస్తున్న నేపథ్యంలో తెలంగాణలో అన్ని నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ సర్వే చేయించారు. దీనికితోడు వయసుపైబడిన వారి లిస్ట్ ను రాహుల్ గాంధీ టీపీసీసీ నుంచి తీసుకున్నారు.

తన టిక్కెట్‌కు ఎసరు రాబోతోందని గ్రహించిన పొన్నాల పదిరోజుల ముందే రాహుల్ గాంధీని కలిసి టికెట్ హామీ తీసుకున్నాకే క్షేత్రస్థాయిలో ప్రచారం ప్రారంభించారు. గతంలో నాలుగుసార్లు జనగామ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా పనిచేసిన అనుభవం కలిగిన పొన్నాలను సముదాయించి ఆయనకు భువనగిరి ఎంపీ టికెట్ ఇవ్వడానికి ఒప్పించేందుకు ఢిల్లీ పెద్దలు ప్రయత్నిస్తున్నారు.

టీజేఎసీ కూడా జనగామ విషయంలో తమ అధ్యక్షుడు కోదండరామ్ పోటీచేస్తే విజయం తథ్యమన్న ధీమాతో ఉంది. జనగామ జిల్లా కోసం జరిగిన ఉద్యమానికి నేతృత్వం వహించిన టీజేఏసీ జిల్లాలో ఉన్న ఉద్యోగ, నిరుద్యోగులు, యువతనంతా ఒక్కతాటిపైకి తేవడంలో సక్సెసయింది. మరి పొన్నాల పరిస్థితేంటి.. అధిష్టానం బుజ్జగింపులకు పొన్నాల కరుగుతారా..? భువనగిరి ఎంపీ టికెట్ హామీతో రాజీ పడుతారా..? ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తే ఊరుకుంటారా ? టీజేఏసీకి జనగామ టికెట్ కేటాయిస్తే స్థానిక కాంగ్రెస్, టీడీపీ శ్రేణులు ఆయనకు సహకరిస్తారా..? అన్నది ఆసక్తికరంగా మారింది.

kodhandaram latest news,tjs chief kodhandaram contesting mla from janagam constituency,ponnala lakshmaiah latest news,tjs leader kodhandaram latest news

 

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *