లగడపాటి.. సర్వే కథాకమామీషేంటి?

Lagadapati Survey Kadaha  kamakshi ante ?

  • కూటమికే అనుకూల పవనాలు అని వెల్లడి
  • సర్వే ఫలితాలు మార్చారని కేటీఆర్ ఆరోపణ
  • గతనెల 20న లగడపాటి పంపించిన వివరాలు బయటపెట్టిన మంత్రి

ఆంధ్రా ఆక్టోపస్ గా పేరు పొందిన విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే ఫలితాలను నిజంగానే మార్చారా? తమ  సర్వేల్లో వాస్తవంగా వెల్లడైన ఫలితాలను చంద్రబాబు ఒత్తిడితో మార్చి కూటమికి అనుకూల వాతావరణం ఉందని అబద్ధం చెప్పారా? ఈ విషయంలో మంత్రి కేటీఆర్ కు పంపించిన మెసేజ్ తో అడ్డంగా ఇరుక్కున్నారా? ప్రస్తుత పరిణామాలు ఇవన్నీ నిజమే అనిపించేలా ఉన్నాయి. ఎన్నికల సమయంలో సర్వేలు రావడం కామనే. పైగా ఇటీవల కాలంలో ఇలాంటి సర్వేలు కోకొల్లలుగా రోజుకొకటి కనిపిస్తున్నాయి. అయితే, లగడపాటి సర్వేలపై రెండు రాష్ట్రాల్లోనూ క్రేజ్ ఉంది. గతంలో ఆయన వెల్లడించిన సర్వేల ఫలితాలు వాస్తవాలకు దగ్గరగా ఉండటమే ఇందుకు కారణం. దీంతో లగడపాటి సర్వే కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూడటం అలవాటైంది. ఈ నేపథ్యంలో తాను చేయించిన సర్వే ఫలితాలను డిసెంబర్ 7న ప్రకటిస్తానని తొలుత చెప్పిన రాజగోపాల్.. అనూహ్యంగా మూడు రోజుల ముందే వెల్లడించడం చర్చనీయాంశమైంది. తొలుత తిరుపతిలో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థుల పేర్లు వెల్లడించిన ఆయన.. తాజాగా దాదాపు మొత్తం వివరాలను బయటపెట్టారు. ప్రజానాడి కాంగ్రెస్ వైపు ఉందని వెల్లడించారు.అయితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో ఇప్పుడే చెప్పనని పేర్కొన్నప్పటికీ.. సర్వే ఫలితాలు ఎలా వచ్చాయో చెప్పేశారు. ఖమ్మం, నల్గొండ, ఆదిలాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో ప్రజా కూటమి హవా కనిపిస్తుండగా.. వరంగల్‌,నిజామాబాద్‌, మెదక్‌ జిల్లాల్లో టీఆర్ఎస్ కు ఆధిక్యం ఉందని తేల్చారు. కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో రెండింటికీ పోటాపోటీగా సీట్లు వస్తాయన్నారు. హైదరాబాద్‌లో అత్యధికం ఎంఐఎం గెలుచుకుంటుందని తెలిపారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ దఫా బీజేపీకి సీట్లు పెరుగుతాయని పేర్కొన్నారు.

గత ఎన్నికల్లో తెలంగాణలో 68.5 శాతం పోలింగ్‌ శాతం నమోదైందని, ఈ సారి ఓట్ల సరళిని బట్టి ఫలితాలు మారొచ్చని రాజగోపాల్‌ అభిప్రాయపడ్డారు. ఓట్ల శాతం పెరిగితే అధికార పార్టీపై వ్యతిరేకత ఉందన్న అంచనాకు రావచ్చన్నారు. ఒకవేళ పోలింగ్‌ శాతం తగ్గితే హంగ్‌ వచ్చే అవకాశం ఉంటుందన్నారు. అయితే, ఈ ఫలితాలపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. చంద్రబాబు ఒత్తిడితోనే రాజగోపాల్ అసలు ఫలితాలను తారుమారు చేశారని ఆరోపించారు. తన వాదనకు మద్దతుగా నవంబర్ 20న రాజగోపాల్ తో జరిగి వాట్సప్ చాట్ ను బయట పెట్టారు. కుట్రను ఎదుర్కోవడానికే తాను తప్పనిసరి పరిస్థితుల్లో ఈ చాట్ ను బయటపెట్టాల్సి వచ్చిందన్నారు. అందులో టీఆర్ఎస్ కు 65 నుంచి 70 స్థానాలు వస్తాయంటూ రాజగోపాల్ పంపిన వివరాలున్నాయి. దీంతో కేటీఆర్ వాదన సరైనదే అనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి. మొత్తమ్మీద ఆంధ్రా ఆక్టోపస్ కు ఊహించని రీతిలో ఎదురుదెబ్బ తగిలిందని అంటున్నారు. తద్వారా లగడపాటి సర్వేలఫై ఇంతవరకు ప్రజల్లో ఉన్న నమ్మకం సన్నగిల్లడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు.

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *