కూటమి స్టార్ క్యాంపెయినింగ్ హిట్టా ఫట్టా

Mahakutami Latest News

తెలంగాణ రాజకీయాలు ముందస్తు ఎన్నికలతో రసవత్తరంగా సాగుతున్నాయి.ఇప్పటికీ టీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించి, ప్రచారానికి శ్రీకారం చుట్టగా, మహాకూటమి కూడా త్వరలోనే ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టుబోతోందని తెలుస్తోంది. అయితే మహాకూటమి ప్రచారానికి స్టార్ క్యాంపెయినర్స్ సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. టీడీపీ నుంచి బాలక‌ృష్ణ, కాంగ్రెస్ నుంచి విజయశాంతి ఇప్పటికే ప్రచారానికి సిద్ధమవుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికితోడు కాంగ్రెస్ అధిష్టానం మెగాస్టార్ చిరంజీవిని ప్రచారానికి ఒప్పించే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ముగ్గురు స్టార్స్‌‌ను రంగంలోకి దించడం వెనుక మహాకూటమి ప్లానేమిటి అనేది చర్చనీయాంశంగా మారింది. అయితే వీరు విడివిడిగా ప్రచారం చేస్తారా? కలిసి ప్రచారం నిర్వహిస్తారా అనేది తేలాల్సివుంది.
కూటమిలో ఉన్న వివిధ పార్టీలు సినిమా తారలను క్యాంపెయిన్‌లో విరివిగా వినియోగించుకోవాలని చూస్తున్నాయని సమాచారం. ఇందుకోసం ఇప్పటికే ఆయా పార్టీల నేతలు సీనీతారలతో సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది. సినీ తారలను క్యాంపెయిన్‌లో భాగస్వామ్యం చేయడం ద్వారా తక్కువ సమయంలో ప్రజలకు మహాకూటమిని చేరువచేయవచ్చని కాంగ్రెస్ భావిస్తోందట. గతంలో సినీ నటులు వివిధ రాజకీయ పార్టీలు సాగించే ప్రచారంలో పాల్గొన్నారు. అటువంటి ప్రచారాలన్నీ విజయవంతమయ్యాయి. దీనికితోడు సినీతారలు ప్రచారంలో పాల్గొంటే జనసమీకరణకు ఎటువంటి ఇబ్బందీ ఎదురవదనేది నేతల ఆలోచనగా తెలుస్తోంది. తారలను చూసేందుకైనా జనం వస్తారు.
తద్వారా ప్రజల మధ్య మహాకూటమి ప్రచారాన్ని ఈజీగా చేయవచ్చని, కూటమి ద్వారా చెప్పాలనుకునే విషయాన్ని చేరవేయవచ్చని ఆయా పార్టీల ప్లాన్ గా తెలుస్తోంది. ఒకప్పటి సినిమా నటి, ప్రస్తుత కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి ఇప్పటికే ప్రచారంలో ముందుకు వెళుతున్నారు. అలాగే విజయశాంతి నిర్వహించే రోడ్ షోలకు, బహిరంగ సభలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని తెలుస్తోంది. పైగా జనం కూడా భారీగా తరలిరావడం విశేషం.
సినీ నటులు నిర్వహించే సభలకు జనసమీకరణ కోసం అంతగా కష్టపడాల్సిన అవసరం లేదని, విజయశాంతి సభలను చూస్తే ఇట్టే గ్రహించవచ్చని నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో మరికొంతమంది తారలను ప్రచారంలో భాగస్వాములను చేయాలని ఆయా పార్టీల నేతలు భావిస్తున్నట్టు సమాచారం. ఇటీవల తెలంగాణలోని ఖమ్మంలో టీడీపీ తరపున బాలకృష్ణ చేసిన ప్రచారానికి విశేష స్పందన లభించిన విషయం విదితమే. దీంతో తెలంగాణ అంతటా బాలకృష్ణతో ప్రచారం చేయించాలని టీ టీడీపీ భావిస్తోందని సమాచారం. ఇందుకోసం ఇటీవలే బాలకృష్ణను ఒకసారి టీడీపీ నేతలు కలిశారని సమాచారం. వీరు మహాకూటమి తరపున ప్రచారం చేయాల్సిందిగా కోరగా బాలకృష్ణ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
అయితే తెలంగాణ మొత్తం అంతటా కాకపోయినా టీడీపీ పోటీ చేసే స్థానాల్లోనైనా బాలకృష్ణ ప్రచారం చేస్తారని టీ టీడీపీ నేతలు అంటున్నారు. మరోవైపు మెగాస్టార్‌ చిరంజీవిని కూడా ప్రచారపర్వంలోకి దింపాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం చిరు క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ ప్రచారంలో భాగస్వామిగా చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందట. కాగా పలు సినిమాలలో విజయశాంతి, చిరంజీవి జంటగా నటించారు. వీరి కాంబినేషన్ లో రూపొందిన చిత్రాలు విజయవంతమయ్యాయి. దీంతో వీరిద్దరూ కలసి ప్రచారం చేస్తే, అది కాంగ్రెస్‌ పార్టీకి, మహాకూటమికి కలిసి వస్తుందని నేతలు ఆశలు పెట్టుకున్నారని సమాచారం. అయితే రాజకీయాలపై అనాసక్తి ప్రదర్శిస్తున్న చిరంజీవి కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తారోలేదో తెలియాల్సివుంది. స్టార్ క్యాంపెయినర్లతో మహాకూటమి ప్రచారం చేయించే ఈ ప్లాన్ హిట్ అవుతుందో ఫట్ అవుతుందో తెలియాల్సి వుంది.

Mahakutami Latest News, Political News of mahakutami, Telangana election , Trs latest news, Tdp, Tjs, Congress Mahkutami news

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *