ఆపరేషన్ ప్రలోభాలు షురూ

Operation Pralobalu Joru

  • రహస్యంగా డబ్బు తరలింపు.. పంపిణీ
  • ఇప్పటికి రూ.140 కోట్లు స్వాధీనం

తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రక్రియలో కీలకమైన ప్రలోభాల పర్వం శరవేగంగా సాగుతోంది. ఎన్నికల సంఘం ఎంత నిఘా పెట్టినా, పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా.. నగదు పంపిణీ మాత్రం జరిగిపోతోంది. ప్రచారం ముగిసి పోలింగ్ కు ఇక కొద్ది గంటలే గడువు ఉన్న నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు రాజకీయ పార్టీలు కరెన్సీ కట్టలను సిద్ధం చేసుకున్నాయి. బుధవారం రాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకూ పంపిణీ చేసేందుకు నగదును రహస్యంగా తరలిస్తున్నారు.

ఇందుకోసం ప్రధాన రాజకీయ పార్టీలు హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో భారీ మొత్తంలో నగదు నిల్వ చేశారని పోలీసులు భావిస్తున్నారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ తోపాటు ఖమ్మం, వరంగల్‌,నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో పోటీ చేస్తున్న కొందరు అభ్యర్థులు రహస్యంగా వీటిని నిల్వ చేసినట్టు తెలుస్తోంది.

ఒక్కో అభ్యర్థికి సగటున రూ.20 కోట్ల వరకూ ఖర్చవుతుందన్న అంచనాతో వారు ముందుకెళ్తున్నారు. హవాలా, స్థిరాస్తి సంస్థల ద్వారా కావాల్సిన ప్రాంతాలకు అత్యంత రహస్యంగా చేరవేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటివరకు దాదాపు రూ.140 కోట్ల మొత్తం పోలీసులకు పట్టుబడింది. దీంతోపాటు ఏకంగా రూ.12 కోట్ల విలువైన మద్యం సైతం సీజ్ చేశారు.

వాస్తవానికి నవంబరు తొలివారం నుంచే నియోజకవర్గాలకు దశలవారీగా నగదు వెళ్లిపోయినట్టు సమాచారం. ఆ నగదును అభ్యర్థులు తమకు నమ్మకస్తుల వద్ద దాచి, ఇప్పుడు బయటకు తీసి పంపిణీ చేస్తున్నట్టు చెబుతున్నారు.

బుధవారం రాత్రి నుంచే ఈ ప్రక్రియ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. తమకు ప్రతికూలంగా ఉన్న ప్రాంతాలపై ప్రధానంగా దృష్టి సారించిన అభ్యర్థులు.. అక్కడి చోటా మోటా నేతల ద్వారా వారి ఓట్లకు గేలం వేస్తున్నారు. ఓటుకు రూ.500 నుంచి రూ.4 వేల వరకు ఇవ్వడానికి బేరం కుదుర్చుకుంటున్నట్టు సమాచారం.

Operation Pralobalu Joru

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *