Tuesday, March 19, 2024

మాతో గోక్కున్న వాడెవ‌డూ బాగుప‌డ‌లే

  • మాతో గోక్కున్న వాడెవ‌డూ బాగుప‌డ‌లే
  • కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టేందుకు బీజేపీ-బీఆర్ఎస్ కుట్ర‌లు
  • మేం గేట్లు తెరిస్తే కేసీఆర్ ఇంట్లో వాళ్లు త‌ప్ప ఎవరుండరు
  • మ‌ణుగూరు ప్ర‌జా దీవెన స‌భ‌లో సీఎం రేవంత్ రెడ్డి

టీఎస్​, న్యూస్​:రాష్ట్రంలో ఇందిర‌మ్మ రాజ్యంలో అభ‌య‌హ‌స్తం ప‌థ‌కాలు అమ‌లు చేస్తుంటే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో 14 సీట్లు కాంగ్రెస్ గెలుస్తుంద‌ని, తెలంగాణ గ‌డ్డ‌పై కాంగ్రెస్ జెండా ఎగురుతుంద‌ని గుర్తించినందునే బీజేపీ, బీఆర్ఎస్ క‌లిసి కాంగ్రెస్ను ఓడించేందుకు కుట్ర చేస్తున్నాయ‌ని ముఖ్య‌మంత్రి, పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి విమ‌ర్శించారు. మ‌ణుగూరు ప్ర‌జా దీవెన స‌భ‌లో ప్ర‌సంగించారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల‌య్యాక ఈ ప్ర‌భుత్వం ఉండ‌ద‌ని బీజేపీ నాయ‌కుడు డాక్టర్ ల‌క్ష్మ‌ణ్ రోజుకోసారి అంటున్నార‌ని, ఆ పార్టీకి ఉన్న ఎనిమిది మంది ఎమ్మెల్యేల‌తో ఎలా ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. అంటే బీజేపీ, బీఆర్ఎస్ కుమ్మ‌క్కై, కుట్ర చేసి ఈ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టాల‌ని ఆలోచ‌న చేస్తున్నాయ‌ని మండిప‌డ్డారు. కాంగ్రెస్‌ను ఓడించేందుకు బీజేపీ,బీఆర్ఎస్ కుమ్మ‌క్కై కుట్ర‌లు చేస్తున్నాయ‌ని, ఇందులో భాగంగానే బీజేపీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన 9 సీట్ల‌లో బీఆర్ఎస్ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌లేద‌ని, బీఆర్ ఎస్ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించిన నాలుగు సీట్ల‌లో బీజేపీ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌లేద‌ని ఆయ‌న ఆరోపించారు. ప‌ర‌స్ప‌రం ప్ర‌చారం చేసుకునేందుకే అలా చేస్తున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు నామా నాగేశ్వ‌ర‌రావు, మాలోత్ క‌విత‌ల‌కు ఖ‌మ్మం, మ‌హ‌బూబాబాద్ టిక్కెట్లు ఎందుకు ప్ర‌క‌టించ‌లేదో తెలియ‌జేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. కేసీఆర్‌, హ‌రీశ్‌రావు ఎమ్మెల్యేలుగా ఉన్న మెద‌క్ లోక్‌స‌భ స్థానానికి ఎందుకు అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌లేద‌ని, అక్క‌డ‌ అభ్య‌ర్థి దొర‌క‌డం లేదా అని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. కేసీఆర్ బిడ్డ క‌విత గ‌తంలో పోటీ చేసిన నిజామ‌బాద్ నుంచి ఆమెను ఎందుకు అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించ‌డం లేద‌ని, ఆమెకు టిక్కెట్ ఇవ్వ‌రా, లేక అక్క‌డ ప్ర‌జ‌లు మ‌రోసారి బండ‌కేసి కొడ‌తార‌ని అనుమానమా అని ప్ర‌శ్నించారు. మొన్న‌టి వ‌ర‌కు మంత్రిగా ఉన్న త‌ల‌సాని శ్రీ‌నివాస్ యాద‌వ్ కుమారుడు గ‌తంలో సికింద్రాబాద్ నుంచి పోటీ చేశార‌ని, ఇప్పుడు ఆయ‌న‌కు టిక్కెట్ ఇవ్వ‌డం లేదా తెలియ‌జేయాల‌న్నారు. క‌లిసి క‌నిపిస్తే తెలంగాణ ప్ర‌జ‌లు చెప్పుతో కొడ‌తార‌నే భ‌యంతో, చీక‌ట్లో ఒప్పందం చేసుకొని అలాయ్ బ‌లాయ్ చేసుకొని మోదీ, కేడీ కాంగ్రెస్ ప్ర‌భుత్వంపై కుట్ర‌లు చేస్తున్నార‌ని సీఎం రేవంత్‌రెడ్డి విమ‌ర్శించారు.

మేం గేట్లు తెరిస్తే బీఆర్​ఎస్​లో ఒక్కరుండరు

బీజేపీ, బీఆర్ఎస్ క‌లిసి కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టేందుకు కుట్ర‌లు చేస్తుండంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇందిర‌మ్మ రాజ్యాన్ని కాపాడుకునేందుకు మ‌ద్ద‌తు ఇస్తామ‌ని త‌న‌తో చెబుతున్నార‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇన్నేళ్లు తాము బీఆర్ఎస్‌లో పార్టీలో ఉన్నా గ‌తంలో ఒక్క‌రోజు ముఖ్య‌మంత్రిని క‌ల‌వ‌లేద‌ని, ఆయ‌న‌ త‌మ మాట విన‌లేద‌ని, ఆయ‌న ఎట్ల‌ ఉన్న‌డో తాము చూడ‌లేద‌ని వారు వాపోయార‌న్నారు. కాంగ్రెస్‌ ప్ర‌భుత్వం వ‌చ్చాక మంత్రులు స‌చివాల‌యంలో ఉంటున్నార‌ని, ముఖ్య‌మంత్రిని ఇంటి ద‌గ్గ‌ర‌, స‌చివాయంలో పేద‌లు, కార్య‌క‌ర్త‌లు, ఆడ బిడ్డ‌ల‌ను క‌లుస్తున్నార‌ని బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు చెబుతున్నార‌న్నారు. ముఖ్య‌మంత్రి అధికారులను క‌లుస్తూ స‌మీక్ష‌లు చేస్తూ అభివృద్ధి చేస్తున్నందున, అయిదేళ్లు కాంగ్రెస్‌ ప్ర‌భుత్వాన్ని కాపాడే బాధ్య‌త త‌మ‌ద‌ని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు త‌న‌ను క‌లిసి చెబుతున్నార‌ని రేవంత్ రెడ్డి వెల్ల‌డించారు. ఒక వేళ తాను గేట్లు తెరిస్తే కేసీఆర్‌, ఆయ‌న కొడుకు, అల్లుడు త‌ప్పితే బీఆర్ఎస్ నేత‌లంతా కాంగ్రెస్ జెండా క‌ప్పుకొనిఇందిర‌మ్మ రాజ్యానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అండ‌గా నిల‌బ‌డ‌తార‌ని ముఖ్య‌మంత్రి అన్నారు. భ‌ద్రాచ‌లం ఎమ్మెల్యే వెంక‌ట్రావు త‌మ‌కు మ‌ద్ద‌తుగా నిలిచార‌ని తెలిపారు. తాము మ‌ర్యాద‌పూర్వ‌కంగా, నైతిక‌త‌తో కూడిన రాజ‌కీయాలు చేయాల‌నుకుంటున్నామ‌ని రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. త‌మ‌ ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టాల‌ని మోదీ, కేడీ క‌లిసి కుట్ర‌లు చేస్తే చూస్తూ ఊరుకోమ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. త‌మ‌కు లోతు, ఎత్తులు తెలుస‌ని, ఏం చేయాలో తెలుస‌ని వ్యాఖ్యానించారు. తాము అల్లాట‌ప్పాగా రాలేద‌ని, న‌ల్ల‌మ‌ల్ల నుంచి తొక్కుకుంటూ వ‌చ్చి ప్ర‌గ‌తి భ‌వ‌న్ బ‌ద్ద‌లుకొట్టి కేసీఆర్‌ను బ‌జారుకు ఈడ్చి ఇందిర‌మ్మ రాజ్యం, కాంగ్రెస్ ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చామ‌ని సీఎం తెలిపారు. త‌మ‌తో గోక్కోవ‌ద్దు.. గోక్కొన్న‌వాడెవ‌డూ బాగుప‌డ‌లేద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హెచ్చ‌రించార‌ను. చాలామంది ఎన్నిక‌ల‌కు ముందు కాంగ్రెస్ ఎక్క‌డ ఉంద‌న్నార‌ని, మ‌ణుగూరు వ‌చ్చి చూస్తే కాంగ్రెస్ ఎక్క‌డ ఉందో తెలుస్తుంద‌న్నారు.

బీఆర్ఎస్ బిల్లా రంగా స‌మితి….

ఇందిర‌మ్మ ఇల్లు వ‌ద్దు… అవి డ‌బ్బా ఇల్లు అంటూ కేసీఆర్ భాష‌, యాస‌ల‌తో మోస‌గించార‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మండిప‌డ్డారు. సూర్యుడి తూర్పున ఉద‌యించి… ప్ర‌పంచానికి ఎలా వెలుగు ఇస్తాడో.. అలానే తెలంగాణ‌కు ఖ‌మ్మం జిల్లా భ‌ద్రాచ‌లం, మ‌ణుగూరు తూర్పునే ఉంటుంద‌ని, అందుకే ఇందిర‌మ్మ ఇళ్ల ప‌థ‌కాన్ని భ‌ద్రాచ‌లంలో శ్రీ‌రామ‌చంద్రస్వామి ఆశీర్వాదంతో ప్రారంభించామ‌న్నారు. తాము మంచి చేస్తుంటే చూడ‌బుద్ది కాక తండ్రీకొడుకులు, బిడ్డ అల్లుడు శాపాలు పెడుతున్నార‌ని, పిల్లి శాపాల‌కు ఉట్టి తెగుప‌డుతుందా అని ఆయ‌న ప్ర‌శ్నించారు. 90 రోజుల్లోనే తాము హామీల‌న్నీ అమ‌లు చేస్తున్నామ‌ని, బీఆర్ ఎస్ ఇచ్చిన హామీలు ప‌దేళ్ల‌లో అమ‌లయ్యాయా అని కేటీఆర్ ఆయ‌న తండ్రి కేసీఆర్‌ను ప్ర‌శ్నించాల‌ని ముఖ్య‌మంత్రి సూచించారు. తాము 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చామ‌ని, గ‌త ప్ర‌భుత్వంలో ఉద్యోగాలు రాక‌, ప్ర‌శ్నాప‌త్రాలు లీకై నిరుద్యోగులు ఆత్మ‌హ‌త్య‌లుచేసుకుంటుంటే ఒక్క‌నాడైనా కేసీఆర్‌, హ‌రీశ్‌రావు, కేటీఆర్ ప‌రామ‌ర్శించారా అని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌శ్నించారు. బీఆర్ఎస్ అంటే బిల్లా రంగా స‌మితి అని, హ‌రీశ్‌రావు, కేటీఆర్ రాష్ట్రాన్ని కొల్ల‌గొట్టిన తోడు దొంగ‌లని ముఖ్యమంత్రి మండిప‌డ్డారు. కేసీఆర్ ఛార్లెస్ శోభ‌రాజ్ అని, ఆయ‌న పాపాల‌తో కాళేశ్వ‌రం కూలిపోయి, మేడ‌గ‌డ్డ మేడిపండై, అన్నారం ప‌గిలిపోయి సుందిళ్ల దెబ్బ‌తింద‌ని ముఖ్య‌మంత్రి ఆరోపించారు. ఉమ్మ‌డి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం రాజీవ్ సాగ‌ర్‌, ఇందిరా సాగ‌ర్ ప్రారంభిస్తే సీతారామ‌, భ‌క్త‌రామ‌దాసు ఎత్తిపోత‌ల పేరుతో బీఆర్ఎస్ ప్ర‌భుత్వం రూ.కోట్లు కొల్ల‌గొట్టి ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాకు తాగ‌డానికి నీళ్లు లేకుండా చేసింద‌ని ముఖ్య‌మంత్రి ఆరోపించారు.

ఖ‌మ్మం జిల్లా గ‌డ్డ‌పైనే తెలంగాణ ఉద్య‌మం మొద‌లు

ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో పాల్వంచ‌లో ఒక ఉద్యోగం కోసం 1969 తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకుంద‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ గ‌డ్డ మీద నుంచి మొద‌లైన ఉద్య‌మం
స్ఫూర్తితో 60 ఏళ్ల ఆకాంక్ష నెర‌వేరి తెలంగాణ ఏర్ప‌డింద‌ని, తాను ఈ రోజు తెలంగాణ ముఖ్య‌మంత్రిగా మాట్లాడ‌డానికి ఖ‌మ్మం జిల్లా ప్రారంభించిన పోరాట‌మే కార‌ణ‌మ‌న్నారు. ఖ‌మ్మం గ‌డ్డ మీద గాలి, ఈ నేల నీరు నింపిన ఉద్య‌మ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర సాధ‌న సాధ్య‌మైంద‌న్నారు. సాధించిన తెలంగాణలో రాష్ట్రంలో కేసీఆర్ ప‌దేళ్లు ముఖ్య‌మంత్రి అయి ద‌ళితుల‌కు మూడెక‌రాల భూమి, డ‌బుల్ బెడ్‌రూం ఇళ్లు, గిరిజ‌నుల‌కు పోడు భూముల‌కు ప‌ట్టాలు, గిరిజ‌నులు, మైనారిటీల‌కు 12 శాతం చొప్పున రిజ‌ర్వేష‌న్లు, ఇంటికో ఉద్యోగం ఇస్తామంటూ ర‌క‌ర‌కాల హామీలు ఇచ్చి తెలంగాణ స‌మాజాన్ని మోసం చేశార‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విమ‌ర్శించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular