టీడీపీ, వైసీపీ అభ్యర్థుల ప్ర‌చార జోరు 

TDP and YCP Campaign
చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గంలో ఎన్నికల కాక అప్పుడే మొదలైంది. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీల అభ్యర్థులు ఖాయమైపోయారు. దాదాపు రెండు పార్టీలు ఎన్నికల సమరానికి సిద్ధమయ్యాయి. నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేసేస్తున్నారు నాయకులు. గ్రామగ్రామాన తిరుగుతూ ప్రత్యర్థి పార్టీల నుంచి నాయకులు, శ్రేణులను తమవైపు తిప్పుకుంటున్నారు. చేరికలపైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. “ప్రశాంత పుంగనూరు” నినాదంతో టీడీపీ ముందుకు వెళ్తుంటే.. పట్టు నిలుపుకునే దిశగా వైసీపీ సైతం తనదైన ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి పుంగనూరు నియోజకవర్గం ఆ పార్టీకి కంచుకోట. పెద్దపంజాణి మండలంలోని కెళవాతికి చెందిన నూతనకాల్వ రామకృష్ణారెడ్డి కుటుంబానికి టీడీపీతో విడదీయలేని బంధముంది. పార్టీ ఆవిర్భావం నుంచి పుంగనూరు నుంచి పలుమార్లు రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తరవాత ఆయన చిత్తూరు పార్లమెంట్ స్థానానికి వెళ్లారు. రామకృష్ణారెడ్డి రాజకీయ వారసుడిగా ఆరంగేట్రం చేసిన తనయుడు అమర్నాథ్‌రెడ్డి పుంగనూరు నుంచి పలు దఫాలు ఎమ్మెల్యేగా గెలిచి చట్టసభలోకి అడుగుపెట్టారు. అయితే నియోజకవర్గాల పునర్విభజన ఫలితంగా అమర్‌నాథ్‌రెడ్డి  పుంగనూరును వదిలి పలమనేరుకు మారాల్సి వచ్చింది. ఆ సమయంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీలేరు నుంచి పుంగనూరుకు షిఫ్ట్ అయ్యారు. తదనంతర కాలంలో పెద్దిరెడ్డి వైసీపీలో చేరారు. ఇప్పుడాయనే అక్కడ ఎమ్మెల్యే! 2009, 2014 ఎన్నికల్లో పెద్దిరెడ్డిపై రెండుసార్లు బీసీ నాయకుడు వెంకట్రమణరాజును టీడీపీ పోటీకి నిలిపింది. అయితే పెద్దిరెడ్డి రాజకీయ వ్యూహం ముందు టీడీపీ పాచిక పారలేదు. పెద్దిరెడ్డి హవా కారణంగా నియోజకవర్గంలో టీడీపీ క్రమంగా పట్టుకోల్పోయింది. అయితే ఈసారి చంద్రబాబు మరో స్కెచ్ వేస్తున్నారు. గతంలో అక్కడ పార్టీని నిలబెట్టిన రామకృష్ణారెడ్డి చిన్న కుమారుడు శ్రీనాథ్‌రెడ్డి సతీమణి అనిషారెడ్డిని తెరపైకి తీసుకువచ్చారు. 2019లో టికెట్ ఆమెకే అని ప్రకటించారు. వైసీపీ నుంచి మళ్లీ  రామచంద్రారెడ్డే పోటీ చేయనున్నారు. అక్కడ అభ్యర్థులు ఎవరో తేలిపోవడంతో రాజకీయానికి కొత్త ఊపు వచ్చింది.  రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులు దూకుడుగానే సాగుతున్నారు. సుడిగాలిలా చుట్టేస్తూ ఓట్లు వడిసిపట్టేందుకు శ్రమిస్తున్నారు.కొంతకాలంగా పుంగనూరులో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా అనీషారెడ్డిని నియమించిన దగ్గర్నుంచీ టీడీపీ గ్రాఫ్ క్రమంగా పెరుగుతోందన్నది పరిశీలకుల మాట. న్యాయశాస్త్రం చదివిన అనీషా తన వాగ్ధాటితో అందరినీ కట్టిపడేస్తున్నారు. శ్రేణులకు ధైర్యాన్ని, భరోసాను కల్పిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కుటుంబపెద్దలు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉండటం ఆమెకు బాగా కలిసివస్తోంది. పరిచయాలు, బంధుత్వాలను మరింత బలోపేతం చేసుకుంటూ ఆమె సాగుతున్నారు.ఇటీవలే పుంగనూరులో అన్న క్యాంటీన్, మంగళ సబ్ స్టేషన్లకు ప్రారంభోత్సవాలు చేశారు. మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి హాజరైన ఆ కార్యక్రమాలకు ఆశించిన దానికంటే మంచి రెస్పాన్స్‌ వచ్చింది. దీంతో తెలుగు తమ్ముళ్లు ఎంతో సంబరపడుతున్నారు. ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టగానే పార్టీలోని వివిధ శ్రేణులతో భేటీలు నిర్వహించారు అనీషా. నియోజకవర్గానికి చెందిన మండలస్థాయి నాయకులు, పలువురు ప్రముఖులను పార్టీలోకి తిరిగి తీసుకురాగలిగారు. నాయకులతో పాటు కిందిస్థాయి కార్యకర్తలను ఆమె క్రియాశీలం చేశారు. అందుకు భర్త శ్రీకాంత్‌రెడ్డి సహకారం తీసుకుంటున్నారు. రామకృష్ణారెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి అనుచరులుగా ఉన్న పెద్దలను ఆమె కలుస్తున్నారు. వారి మద్దతు కోరుతున్నారు. “పుంగనూరు ప్రశాంతతకు సహకరించండి” అనే నినాదంతో ప్రత్యర్ధుల దౌర్జన్యాలను ఆమె ప్రజల దృష్టికి తెస్తున్నారట. 30 ఏళ్ళ నూతనకాల్వ కుటుంబీకుల హయాంలో పుంగనూరు ఎంతో ప్రశాంతంగా ఉండేదనీ,  ఇప్పుడు రౌడీయిజం, దౌర్జన్యాలు పెరిగిపోయాయనీ గుర్తుచేస్తున్నారట. నియోజకవర్గం ప్రశాంతంగా ఉండాలంటే తమకు సహకరించాలని ఊరువాడా తిరుగుతూ విజ్ఞప్తిచేస్తున్నారట. అంతేకాదు- స్థానికంగా ఉండి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు అనీషా దంపతులు.  అటు పెద్దిరెడ్డి సైతం పుంగనూరులో తన పట్టు నిలుపుకునేందుకు పక్కా వ్యూహాలు రచిస్తున్నారు. వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన ప్రస్తుతం తిరుపతిలో నివసిస్తున్నారు. అయినప్పటికీ నియోజకవర్గంలని పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండేలా ప్రణాళిక రూపొందించుకున్నారు. 2009లో నియోజకవర్గంలో అడుగుపెట్టింది మొదలు.. ప్రత్యర్థి పార్టీల ముఖ్యులను తనవైపు తిప్పేసుకున్నారు. బలమైన నేతగా స్థిరపడిపోయారు. ఇప్పుడాయన దృష్టంతా చేరికలపైనే ఉంది. నియోజకవర్గంలో తాజా పరిణామాలను గమనిస్తూ.. స్థానికంగా తన పట్టు ఏమాత్రం తగ్గకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. మరి వచ్చే ఎన్నికల్లో అనీషా వర్సెస్‌ పెద్దిరెడ్డి రాజకీయ సమరంలో ఎవరిది పైచేయి అవుతుందో చూద్దాం.
TDP and YCP Campaign, Chittoor Poilitical News, TDP , YCP  Political News, Telugu news, AP Political News, Telugu Breaking News 

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *