ఎల్బీనగర్ అడిగితే ఇబ్రహీంపట్నం ఇచ్చారు

Telangana TDP latest news

· టీడీపీపై సామ రంగారెడ్డి అసంతృప్తి

· ఎల్బీ నగరే కావాలని పట్టు.. బాబుతో భేటీ

· సర్దుకుపోవాలని సూచించిన టీడీపీ అధినేత

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రోజురోజుకూ సమీకరణాలు మారుతున్నాయి. ఊహించని సంఘటనలు జరుగుతున్నాయి. పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీకి 14 స్థానాలు కేటాయించడానికి కాంగ్రెస్ అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 9 మందితో టీడీపీ తొలి జాబితా కూడా వెలువడింది. మరో ఐదు స్థానాలపై స్పష్టత రావాల్సి ఉండటంతో అభ్యర్థుల ప్రకటన వాయిదా పడింది. అయితే, అనూహ్యంగా బుధవారం ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్ స్థానాలకు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. వాస్తవానికి పొత్తు చర్చల్లో ఈ రెండు స్థానాలను టీడీపీకి కేటాయించే అంశమే అస్సలు చర్చకు రాలేదు. ఇవి రెండూ కాంగ్రెస్ చేతిలోనే ఉన్నాయి. అయితే, ఏమి జరిగిందో తెలియదు గానీ, అకస్మాత్తుగా ఈ రెండింటినీ టీడీపీకి కేటాయించారు. దీంతో ఇబ్రహీంపట్నం నుంచి సామ రంగారెడ్డిని, రాజేంద్రనగర్ నుంచి గణేశ్ గుప్తాను టీడీపీ ఎంపిక చేసి ప్రకటించింది. అయితే, నియోజకవర్గ మార్పుపై రంగారెడ్డి అసంతృప్తితో ఉన్నారు. తాను ఎల్బీనగర్‌ నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటే పక్క నియోజకవర్గ కేటాయించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎల్బీనగర్‌ టీడీపీ సిట్టింగ్‌ స్థానం కావడంతో తొలి నుంచి తనకే ఇవ్వాలని రంగారెడ్డి డిమాండ్‌ చేస్తున్నారు.అధికారికంగా ఈ స్థానం ఎవరికి కేటాయిస్తారన్నది ప్రకటించకపోయినా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సుధీర్‌రెడ్డి తనకే టికెట్టు వస్తుందని ప్రచారం చేసుకొంటున్నారు. దీంతో కలత చెందిన సామ రంగారెడ్డి అనుచరులు కొద్దిరోజుల క్రితం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌కు పెద్దఎత్తున వచ్చి ఆందోళన చేశారు. అనూహ్యంగా ఇబ్రహీంపట్నం టికెట్ ఇవ్వడంతో సామ రంగారెడ్డికి ఏమి చేయాలో పాలుపోవడంలేదు. తాను ఎల్బీనగర్‌ టిక్కెట్‌ కావాలని కోరానని, అందుకు విరుద్ధంగా ఇబ్రహీంపట్నం ఇచ్చారని వాపోయారు. ఎల్బీనగర్‌లో పార్టీని పటిష్టానికి ఎంతో కష్టపడ్డానని, ఇప్పుడు వేరే నియోజకవర్గానికి మారమని చెప్పడంలో ఆంతర్యం అర్థం కావడం లేదన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేతను కలిసి తన గోడు వెళ్లబోసుకునేందుకు అమరావతి వెళ్లారు. అయితే, చంద్రబాబు ఆయన్ను సర్దుకుపోవాలని సూచించినట్టు తెలిసింది. పరిస్థితులురీత్యా ఎల్బీ నగర్ స్థానం ఇవ్వడం కుదరలేదని, అయితే పార్టీ కోసం కష్టపడినవారిని వదులుకోకూడదనే ఉద్దేశంతోనే ఇబ్రహీంపట్నం సీటు కేటాయించినట్టు వివరించినట్టు సమాచారం. ఈ విషయంలో అర్థం చేసుకుని సహకరించాలని, ఆ నియోజకవర్గంలో మీ గెలుపునకు పార్టీ పూర్తిగా సహకరిస్తుందని భరోసా ఇచ్చినట్టు తెలిసింది.

TDP latest news , Sama rangareddy from IbrahimPatnam and Rajendra nagar were selected in TDP party , TDP given IbrahimPatnam seat to Sama rangareddy

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *