టీడీపీ ర‌హ‌స్య స‌ర్వేలో తేలిందేమిటి

TDP secret survey

ఒక కలయిక వంద ప్రశ్నలను సంధిస్తోంది. వేయి సందేహాలను లేవనెత్తుతోంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ అనేక పక్షాలతో పొత్తు పెట్టుకుంది. కానీ 2018లో జాతీయస్థాయిలో తెలుగుదేశం, కాంగ్రెస్ అధినేతల భేటీ కొత్త సమీకరణాలకు తెరలేపింది. ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు రహస్యంగా ఒక సర్వే నిర్వహించారు. ఫోన్ ద్వారా నిర్వహించిన ఈ సర్వేలో అనేక ఆసక్తికరమైన ప్రశ్నలు వినిపించాయి. పార్టీ సీనియర్ నేతలు వాటికి సరైన సమాధానమిచ్చి ఆయా సందేహాలను నివృత్తిచేయాలని చంద్రబాబు సలహా ఇచ్చారు. గతంలో కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ప్రదర్శించిన నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగానే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. తెలుగుజాతి ఆత్మగౌరవం పేరిట టీడీపీ వినిపించిన నినాదం దేశమంతటా వినిపించింది. తదనంతర కాలంలో కాంగ్రెస్‌పార్టీకి వ్యతిరేకంగా జాతీయ, రాష్ట్రస్థాయిల్లో అనేక కూటముల ఏర్పాటులో టీడీపీ కీలకపాత్ర పోషించింది. 1982లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌టీఆర్‌ ఒక ప్రభంజనాన్నే సృష్టించారు. “తెలుగుదేశం పిలుస్తోంది రా.. కదిలి రా” అని ఆయన పిలుపు ఇస్తే కోట్లమంది ఆయన వెంట అడుగులో అడుగు వేశారు. ఆనాడు ఆ పార్టీలో చేరి.. నాటి నుంచి నేటివరకూ టీడీపీనే అంటిపెట్టుకున్న నేతలున్నారు. తెలుగుదేశంలో వారే ఇప్పుడు సీనియర్లు! స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు, ఆర్ధికమంత్రి యనమల రామకృష్ణుడు, సిహెచ్.అయ్యన్నపాత్రుడు, కేఈ.కృష్ణమూర్తి వంటి పలువురు పెద్దలు ఈ కోవకు చెందినవారే! సీఎం చంద్రబాబు ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని కలిసి వచ్చిన తర్వాత నేతల అభిప్రాయం కోసం ఒక సర్వే నిర్వహించారు. పదివేల మంది పార్టీ నేతలు, కార్యకర్తలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అందులో 83 శాతం మంది బాబు నిర్ణయాన్ని సమర్ధించారు. 17 శాతం మంది వ్యతిరేకించారు. ఈ తరుణంలో వ్యతిరేకించిన వారి నెంబర్లు తీసుకుని వారి మనోభావాలు ఏంటో తెలుసుకోవాలని ముఖ్యమంత్రి సంకల్పించారు. వారిలో కొందరి అభిప్రాయాలను ఆయన నేరుగా విన్నారు. వ్యతిరేకించిన 17 శాతం మందిలో ఎక్కువమంది టీడీపీలో సీనియర్ కార్యకర్తలు, ద్వితీయశ్రేణి నేతలుగా ఉన్నారు. కాంగ్రెస్‌తో జాతీయస్థాయిలో టీడీపీ కూటమి కట్టడాన్ని వ్యతిరేకించిన వారు మూడు ముఖ్యమైన అభిప్రాయాలను వెలిబుచ్చారు. కాంగ్రెస్ నిరంకుశ విధానాల ఫలితంగా ఆవిర్భవించిన తెలుగుదేశంపార్టీ అదే కాంగ్రెస్‌తో స్నేహం చేయడంపై ఎవరైనా ప్రశ్నిస్తే ఏమి సమాధానం చెప్పాలని వారు సూటి ప్రశ్న వేశారు. 2014 ఎన్నికలకు ముందు రాష్ట్రవిభజన చేసిన పాపానికి ఏపీ ప్రజానీకం కాంగ్రెస్‌పార్టీని మట్టి కరిపించిందనీ, 175 నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా రాకుండా చేసి ఓటర్లు పగతీర్చుకున్నారనీ వారు గుర్తుచేశారు. అటువంటి కాంగ్రెస్‌తో చేతులు కలపడాన్ని ఎలా జీర్ణించుకోవాలో చెప్పమని ప్రశ్నించారు. ఈ పరిణామం వల్ల నైతికంగా ఇబ్బంది పడతామేమో అని సందేహపడ్డారు. 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు టీడీపీలో చేరడాన్ని కూడా వారు తప్పుబట్టారు. సీఎం చంద్రబాబు ఈ అంశాలన్నింటినీ గమనించారు. వీటికి పార్టీలోని సీనియర్లు సమాధానం చెప్పాలని సూచించారు. 1982 నాటి నేపథ్యం వేరనీ, ఆనాడు ఎలాంటి నియంతృత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశామో.. ఇప్పుడు కూడా అదే తరహా పోరాటం చేస్తున్నామనీ చంద్రబాబు వివరించారు. నాడు ఆ స్థానంలో కాంగ్రెస్ ఉంటే, నేడు అదే పీఠంపై బీజేపీ ఉందని ఆయన గుర్తుచేశారు. రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనీ, ఆ కారణంగానే తెలుగుబిడ్డగా తిరగబడ్డాననీ స్పష్టంచేశారు. రాష్ట్ర విభజనకు నిరసనగా గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెప్పారనీ, దీంతో తప్పుచేశామని ఆ పార్టీ గ్రహించిందని చెప్పుకొచ్చారు. తప్పు సరిదిద్దుకునేందుకే… 2019 ఎన్నికల్లో గెలిస్తే.. ఏపీకి ప్రత్యేకహోదా, విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే ఫైల్‌పైన తొలి సంతకం చేస్తానని కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ ప్రకటించడాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు ఉదహరించారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వడం సాధ్యంకాదని స్పష్టంచేసిన బీజేపీ కేంద్ర పెద్దలు రాష్ట్రంపై కత్తిగట్టారనీ, ఈ సమయంలో జాతీయస్థాయిలో ప్రత్యామ్నాయ శక్తిగా కాంగ్రెస్ మాత్రమే ఉందని చంద్రబాబు వివరణ ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తప్పనిసరి పరిస్థితుల్లోనే కాంగ్రెస్‌పార్టీతో కలవాల్సి వచ్చిందనీ చంద్రబాబు తేల్చిచెప్పారు. చంద్రబాబు ఇచ్చిన ఈ వివరణను పార్టీ ముఖ్య నేతలు ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సి ఉంది. దీనికి సర్వేలో భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేసినవారు సంతృప్తిచెందుతారో, లేదో చూడాలి. తాజా పరిణామం పట్ల అసంతృప్తి వ్యక్తంచేసిన 17 శాతం మందిని సమాధానపరచడానికి టీడీపీలో గట్టి ప్రయత్నమే జరుగుతోంది. మరి ఈ గురుతర బాధ్యతను పార్టీ సీనియర్‌ నేతలు ఏ మేరకు నెరవేర్చుతారో.. చూద్దాం..!

TDP secret survey , TDP Latest News , Chandrababu secret Phone survey , TDP party Update news, telugu news, telugu update news.

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *