విద్యుత్తు రంగంలో తెలంగాణ నంబర్ వన్

Telanagana Update News

దేశంలోనే అత్యధికంగా వినియోగంలో 13.62 శాతం వృద్ధి

తలసరి విద్యుత్ వినియోగంలో 11.34 శాతం పెరుగుదల

ఈ రెండు విభాగాల్లో రాష్ట్రానిదే ప్రథమ స్థానం

గరిష్ట విద్యుత్ డిమాండ్ లో 11.94 శాతం వృద్ధి

ఏడాదికి సగటున 97 వేల వ్యవసాయ కనెక్షన్లు

2017-18 వార్షిక గణాంకాలు వెల్లడించిన సిఇఎ

2018-19లో మరింత వృద్ధి: సిఎండి ప్రభాకర్ రావు

ప్రగతి సూచికలుగా గుర్తించే విద్యుత్ వినియోగం, తలసరి విద్యుత్ వినియోగం విషయంలో అత్యధిక వృద్ధి శాతం నమోదు చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానం సంపాదించింది. 2017-18 సంవత్సరానికి గాను విద్యుత్ రంగంలో వివిధ రాష్ట్రాలు సాధించిన పురోగతి వివరాలను గణాంకాలతో సహా కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ) ప్రకటించింది. ఈ వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం రెండు విభాగాల్లోనూ అత్యధిక వృద్ధిరేటు నమోదు చేసింది. విద్యుత్ వినియోగంలో 13.62 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదు చేసి, దేశంలోనే ప్రథమ స్థానంలో ఉంది. ఇది దేశ సగటు వృద్ధి శాతమైన 6.11 కన్నా 122.91 శాతం అధికం. జనాభా పరంగా తెలంగాణ కంటే చాలా పెద్దదైన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం 11.92 శాతం వృద్ధి రేటు నమోదు చేసి రెండో స్థానంలో నిలిచింది. 7.43 శాతం వృద్ధిరేటుతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో, 7.40 వృద్ధిశాతంతో మహారాష్ట్ర నాలుగో స్థానంలో నిలిచింది. 2016-17 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో 53,017 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరిగింది. 2017-18 సంవత్సరంలో 60,237 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం (13.62 శాతం అధికం) జరిగింది. ఇదే సమయంలో దేశ సగటు వృద్ధి శాతం 6.11 శాతం మాత్రమే కావడం గమనార్హం. 2016-17 సంవత్సరంలో దేశ వ్యాప్తంగా 11,35,334 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం కాగా, 2017-18 సంవత్సరంలో 12,04,697 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం అయింది. 2014లో తెలంగాణ ఏర్పడక ముందు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ వినియోగంలో వార్షిక వృద్ధి రేటు సగటు 6 శాతం మాత్రమే ఉండేది.

తలసరి విద్యుత్ వినియోగంలో 11.34 శాతం వృద్ధి

ఏడాదికి వెయ్యి యూనిట్లకు పైగా తలసరి విద్యుత్ వినియోగం జరిగే రాష్ట్రాల్లో తెలంగాణ అత్యధికంగా 11.34 శాతం వృద్ధిరేటు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. 2016-17 సంవత్సరంలో తెలంగాణలో తలసరి విద్యుత్ వినియోగం 1,551 యూనిట్లుంటే, 2017-18 సంవత్సరంలో 1,727 యూనిట్లకు చేరింది. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా తలసరి విద్యుత్ వినియోగం 2.4 శాతం మాత్రమే వృద్ధి సాధించడం విశేషం. 2016-17లో దేశ వ్యాప్తంగా తలసరి విద్యుత్ వినియోగం 1,122 యూనిట్లు కాగా, 2017-18లో 1,149 యూనిట్లు నమోదైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 5.23 శాతం, మహారాష్ట్ర 4.8 శాతం, హిమాచల్ ప్రదేశ్ 3.95శాతం, మధ్యప్రదేశ్ 3.13 శాతం వృద్ధిరేటును నమోదు చేసింది.
 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తలసరి విద్యుత్ వినియోగం 59.32 శాతం పెరిగింది. 2013-2014లో తెలంగాణలో తలసరి విద్యుత్ వినియోగం 1,084 యూనిట్లు ఉండేది. 2017-18 సంవత్సరంలో 1727కు చేరింది.

వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేయడంతో పాటు, అన్ని రంగాలకు 24 గంటల నిరంతరాయ నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం వల్లనే తెలంగాణ ఈ ఘనతను సాధించగలిగింది. ఎలాంటి కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం వల్ల వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో విద్యుత్ వినియోగం బాగా పెరిగింది. పరిశ్రమలు మూడు షిఫ్టులు పనిచేస్తున్నాయి. వీటన్నింటి కారణంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ వినియోగం దేశంలో మరే రాష్ట్రంలో పెరగని విధంగా పెరిగింది. విద్యుత్ వినియోగంలో పెరుగుదలను ప్రపంచ వ్యాప్తంగా ప్రగతి సూచికగా గుర్తిస్తారు.

గరిష్ట డిమాండ్ లో 11.94 శాతం వృద్ధి
విద్యుత్ గరిష్ట డిమాండ్ వృద్ధి రేటులోనూ తెలంగాణ రాష్ట్రం గణనీయమైన వృద్ధి శాతం నమోదు చేసింది. 2016-17లో తెలంగాణలో 9,187 మెగావాట్ల గరిష్ట డిమాండ్ నమోదు కాగా, 2017-18 సంవత్సరంలో 10,284 మెగావాట్లకు (11.94 శాతం అధికం) చేరింది. ఇదే సమయంలో దేశ సగటు వృద్ధి శాతం కేవలం 2.43 కావడం గమనార్హం. దేశ సగటు కన్నా తెలంగాణ రాష్ట్రం 391 శాతం అధిక వృద్ధిరేటు సాధించింది. 2016-17 సంవత్సరంలో దేశ వ్యాప్తంగా గరిష్ట డిమాండ్ 1,56,934 మెగావాట్లు కాగా, 2017-18 సంవత్సరంలో 1,60,752 మెగావాట్లు నమోదైంది.

51.37 శాతం పెరిగిన వ్యవసాయ కనెక్షన్లు

వ్యవసాయ పంపుసెట్లకు కనెక్షన్లు ఇచ్చే విషయంలో కూడ తెలంగాణ రాష్ట్రం గణనీయమైన ప్రగతి సాధించింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు వ్యవసాయ కనెక్షన్ల మంజూరు విషయంలో నియంత్రణ ఉండేది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ నియంత్రణను తొలగించారు. దీంతో తెలంగాణ ఏర్పడిన నాలుగేళ్లలోనే 4.28 లక్షల వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేశారు. 2010 నుంచి 2014 దాకా తెలంగాణలో 2,82,875 పంపు సెట్లకు కనెక్షన్లు ఇస్తే, 2014 నుంచి 2018 వరకు 4,28,208 వ్యవసాయ పంపెసెట్లకు కనెక్షన్లు ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నాలుగేళ్లలో ఏడాదికి సగటున 70వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేస్తే, తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి నాలుగేళ్ళలో సగటున 97వేల వ్యవసాయ కనెక్షన్లు మంజూరు చేశారు.

గర్వకారణం, ప్రగతి సూచిక: ప్రభాకర్ రావు

విద్యుత్ రంగంలో సాధిస్తున్న ఫలితాలు తెలంగాణ రాష్ట్ర ప్రగతికి సూచికలని జెన్ కో, ట్రాన్స్ కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు అన్నారు. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ 2017-18 సంవత్సరానికి గాను దేశ వ్యాప్తంగా విద్యుత్ పరిస్థితిపై వెల్లడించిన వివరాల ప్రకారం తెలంగాణ రాష్ట్రం చాలా విషయాల్లో అగ్రగామిగా ఉండడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమన్నారు. ప్రగతికి, విద్యుత్ వినియోగానికి అవినాభావ సంబంధం ఉంటుందని ప్రభాకర్ రావు తెలిపారు. విద్యుత్ వినియోగం ఎక్కువ కలిగిన ప్రాంతాల్లోనే ప్రగతి ఎక్కువ ఉంటుందని, ప్రగతి ఎక్కువున్న ప్రాంతాల్లోనే విద్యుత్ వినియోగం ఎక్కువ అని ఆయన వివరించారు. 2017-18 సంవత్సరంలో విద్యుత్ వినియోగంలో 13.64 శాతం వృద్ధి సాధిస్తే, అదే ఏడాదికి తెలంగాణ జి.ఎస్.డి.పి. వృద్ది రేటు 14.1 శాతం నమోదు కావడాన్ని గమనించాలన్నారు. విద్యుత్ సరఫరా మెరుగు కావడం వల్ల వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో ఉత్పత్తి, ఉత్పాదకత పెరిగాయని, సేవా రంగంలో కూడా గణనీయమైన వృద్ధి సాధించడం సాధ్యమైందని వివరించారు. విద్యుత్ వినియోగంలో 2017-18లో సాధించిన ప్రగతి కంటే 2018-19లో మరింత వృద్ధి రేటు సాధించే అవకాశం ఉందని సిఎండి చెప్పారు. 2018 జనవరి 1 నుంచి వ్యవసాయానికి 24 గంటల కరెంటు సరఫరా చేస్తున్నందును గరిష్ట డిమాండ్ 10,818 మెగావాట్లకు చేరుకుందని గుర్తు చేశారు. రబీ సీజన్ లో గరిష్ట డిమాండ్ 11వేలు దాటుతుందని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. రాబోయే కాలంలో తెలంగాణలో ఎత్తిపోతల పథకాలకు కూడా పెద్ద ఎత్తున విద్యుత్ వాడకం జరుగుతుందని, కాబట్టి తెలంగాణలో విద్యుత్ వినియోగం, తలసరి విద్యుత్ వినియోగం మరింతగా పెరుగుతుందని చెప్పారు. ఎంత డిమాండ్ వచ్చినా తట్టుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. వ్యవసాయానికి ఓవైపు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తూనే, ఎక్కువ వ్యవసాయ కనెక్షన్లు ఇవ్వడం ద్వారా రైతు సంక్షేమానికి విద్యుత్ శాఖ ఎంతగా ప్రాధాన్యత ఇస్తుందో అర్థం అవుతుందని వివరించారు.

Telanagana Update News ,  Number one Electricity Sector in Telangana, First place Electricity Sector in Telangana, latest News on  Electricity Sector in Telangana

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *