ప్ర‌చారంలో సామాజిక వ‌ర్గ ఫార్ములా..

Telangana Political News

తెలంగాణలో ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ నాయకులు అందివస్తున్న ఏ అవకాశాన్నీ వదలడం లేదు. భిన్న వర్గాల మద్దతు కోసం వినూత్న రూపాల్లో ప్రచారం చేసుకుంటున్నారు. క్షేత్రస్థాయి పర్యటనలు, ప్రచారాలకు తోడు అంతర్గతంగా రకరకాల వ్యూహాలు రచించుకుంటున్నారు. మరి యాదాద్రి భువనగిరి జిల్లాలో అభ్యర్థుల ప్రచారశైలి ఎలా ఉంది? రాజకీయ నాయకులూ అప్‌డేట్ అవుతున్నారు. టెక్నాలజీని బీభత్సంగా వాడేసుకుంటున్నారు. యాదాద్రి జిల్లాలో అయితే సామాజిక మాధ్యమాల వేదికగా ప్రచారం చేసుకుంటూనే సామాజికవర్గాల బాట పట్టారు నేతలు. సంక్షేమ కార్యక్రమాల చిట్టాతో సామాజికవర్గాల వారీగా ఓటర్లను కలుస్తున్నారు. ఓట్లేయమని అడుగుతున్నారు.ఇక అసలే ఎన్నికల వేళ. సభలు, సమావేశాలు, ర్యాలీలతో తెలంగాణ పల్లెలు హోరెత్తుతున్నాయి. ఎన్నికలు మరింత దగ్గరపడుతున్న కొద్దీ పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. టికెట్ కన్‌ఫాం అయిన అభ్యర్థులు, ఇంకా ప్రకటించని పలు పార్టీల్లోని ఆశావహులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎవరికి వారుగా సామాజికవర్గాల వారీగా ప్రచారం చేసుకుంటున్నారు. ఆలేరు నియోజకవర్గంలో అయితే అభ్యర్థుల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్న గొంగడి సునీత, టికెట్ కన్‌ఫాం అయినట్టేనని భావిస్తున్న కాంగ్రెస్ నేత బూడిద భిక్షమయ్యగౌడ్, ఇండిపెండెంట్‌గా బరిలో దిగుతున్న మోత్కుపల్లి నర్సింహులు ప్రచారంలో ముందున్నారు. ముగ్గురూ అన్ని మండలాలు, గ్రామాల్లో విస్తృతంగా తిరుగుతున్నారు. అయితే బయటకు కనిపిస్తున్న ప్రచారం వేరు, వారి అంతర్గత వ్యూహాలు వేరుగా ఉన్నాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయా అభ్యర్థులు, ఆశావహులు ఎక్కడెక్కడ ఏఏ సామాజికవర్గం వారు ఎక్కువ ఉన్నారో లెక్కలు తీస్తున్నారు. ఆ ప్రకారం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. గ్రామాల్లోకి వెళ్తున్నప్పుడు కలవడంతో పాటు రాత్రిళ్లు కులాల వారీగా సమావేశాలు పెట్టుకుంటున్నారు. పనిలో పనిగా ఆశీర్వాద సభలు, అంతర్గత భేటీలు జరుగుతున్నాయి. బరిలోకి దిగుతున్న నేతలు ముందుగా తమ సామాజికవర్గం వారిని కూడగట్టుకుంటున్నారు. వారితో నిరంతరం టచ్‌లో ఉంటూనే.. ఇతర కులాల పెద్దలు, ప్రముఖుల్ని ప్రత్యేకంగా కలుస్తున్నారు. వారి సమస్యలను సావధానంగా వింటున్నారు. తనను గెలిపిస్తే అండగా ఉంటామని అక్కడికక్కడే భరోసా ఇచ్చేస్తున్నారు. సొంత సామాజికవర్గం ఓట్లు తమకే పడతాయని ఆ ముగ్గురు నేతలు ధీమాగా చెబుతున్నారు. తమ కులం ఓట్లతో పాటు.. ఎక్కువ ఓట్లు ఉన్న నాలుగైదు సామాజికవర్గాలను కూడగట్టుకుంటే గట్టెక్కిపోతామంటూ వారు లెక్కలేస్తున్నారు. ఇక రాజకీయపార్టీలకు అన్ని కులాల నుంచి ఎంతోకొంత ఓట్‌బ్యాంక్‌ ఉంటుందని అంచనాలు వేసుకుంటున్నారు. ఇక సామాజికవర్గాల వారీగా తమ ప్రభుత్వం ఎవరెవరికి ఏమేం చేసిందో చెబుతూ సునీత ప్రచారంలో ముందున్నారు. అన్ని కులాల వారికి హైదరాబాద్‌లో ప్రత్యేక భవనాలు కట్టించిన ఘనత తమదేనని ఆమె చెప్పుకుంటున్నారు. వెనుకబడిన కులాలు, కులవృత్తుల వారి ఉన్నతికి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాల గురించి వివరిస్తూ ఆమె సాగుతున్నారు. అదే సమయంలో తమను గెలిపిస్తే ఎవరికేం చేస్తామో చెబుతూ మిగతా ఆశావహులు టిక్కెట్ల వేటలో బిజీ అయిపోయారు. మరి ఆలేరు అభ్యర్థులు, ఆశావహులు వేసుకుంటున్న “సామాజికవర్గాల ఫార్ములా” వర్కవుట్ అవుతుందో లేదో చూద్దాం..!

Telangana Political News, TRS leader Gongadi sunitha , Congress Leader Budida Bikshapathi goud Telangana Yadadri Political News , Buvanagiri Latest news, Election News ,Telangana villages , meetings and rallies.

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *