గందరగోళానికి తెరతీసిన టీజేఎస్

TJS Party in confusion

  • 12 స్థానాల్లో పోటీ చేస్తున్నామని ప్రకటన
  • కాంగ్రెస్, టీడీపీ స్థానాల్లోనూ బరిలోకి దిగుతున్నట్టు వెల్లడి

కూటమిలో కాంగ్రెస్ తర్వాత ఎక్కువ సీట్లకు పట్టుబడుతున్న తెలంగాణ జనసమితి సంచలన నిర్ణయం తీసుకుంది. తాము 12 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించి, కూటమిలో కలకలానికి తెరతీసింది. వాస్తవానికి పొత్తు లెక్కల్లో భాగంగా టీజేఎస్ కు 8 స్థానాలు కేటాయించడానికి కాంగ్రెస్ సముఖత వ్యక్తంచేసింది. అందుకు సూత్రప్రాయంగా అంగీకరించిన టీజేఎస్.. తర్వాత మాట మార్చింది. ఆరు స్థానాలపై ఏకాభిప్రాయం కుదిరిందని, అయితే, తాము మరో ఐదు స్థానాలు అడుగుతున్నామని ఆ పార్టీ అధినేత కోదండరాం వెల్లడించారు. ఈ నేపథ్యంలో సీట్ల సర్దుబాటు ఖరారు కాకుండా కాస్త సందిగ్ధత నెలకొంది. మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు పూర్తిగా కొలిక్కి రాకపోవడంతో కాంగ్రెస్ కూడా 19 స్థానాల్లో తన అభ్యర్థులను ప్రకటించకుండా పెండింగ్ లో ఉంచాల్సి వచ్చింది. ఓ పక్క ఇలా సందిగ్ధత కొనసాగుతుండగానే, టీజేఎస్ అకస్మాత్తుగా తన నిర్ణయం ప్రకటించి సంచలనానికి కేంద్ర బిందువైంది. బుధవారం సాయంత్రం తాము 12 స్థానాల్లో పోటీకి దిగుతున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు పి.ఎల్‌ విశ్వేశ్వరరావు టీజేఎస్‌ పోటీ చేసే స్థానాల పేర్లు ప్రకటించారు. దుబ్బాక, మెదక్, మల్కాజ్‌గిరి, అంబర్‌పేట, సిద్దిపేట, వరంగల్‌ తూర్పు, వర్ధన్నపేట, ఆసిఫాబాద్, స్టేషన్‌ ఘన్‌పూర్, జనగాం, మహబూబ్‌నగర్, మిర్యాలగూడ స్థానాల నుంచి పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. కాగా, మహాకూటమిలో సీట్ల సర్దుబాటుపై సంప్రదింపులు ఇంకా సాగుతున్నట్లు టీజేఎస్‌ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి చెప్పడం గమనార్హం. టీజేఎస్‌ పోటీ చేయనున్నట్లు ప్రకటించిన స్థానా ల్లో మహాకూటమి పక్షాలు కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులను ప్రకటించిన స్థానాలు కూడా ఉన్నాయి. స్టేషన్‌ఘన్‌పూర్, ఆసిఫాబాద్‌ స్థానాల నుంచి కాంగ్రెస్‌ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. మహబూబ్‌నగర్‌ స్థానాన్ని పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించారు. పొన్నాల లక్ష్మయ్య ఆశిస్తున్న జనగాం స్థానం నుంచి తామే పోటీలో ఉంటామని టీజేఎస్‌ ప్రకటించింది. మొత్తమ్మీద కూటమిలో టీజేఎస్ గందరగోళం సృష్టించేలా వ్యవహరిస్తోందని ఆరోఫణలు వినిపిస్తున్నాయి.

TJS Party in confusion , Telangana Janasena samithi party in confusion , Kodandaram update news , telangana latest news , Telugu news

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *