వాళ్లు బయటికొస్తే టీఆర్ఎస్‌కే ప్లస్

TRS Latest News
తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన టీఆర్ఎస్‌ను మరోసారి గద్దెనెక్కనీయకుండా చేయాలన్న ఉద్దేశంతో ఏర్పాటైంది మహాకూటమి. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, సీపీఐ, తెలంగాణ జనసమితిలు కలిసి ఏర్పాటు చేసిన మహాకూటమి గురించి రోజుకో వార్త హాట్ టాపిక్‌గా మారుతోంది. కూటమిలో నుంచి ఆ పార్టీ బయటకు వెళ్లిపోతుంది.. ఈ పార్టీ గుడ్‌బై చెప్పబోతుంది అంటూ పలు పుకార్లు షికార్లు చేసిన విషయం తెలిసిందే. అసలు ఇప్పటి వరకు కూటమిలో సీట్ల సర్ధుబాటు వ్యవహారం ఇంకా కొలిక్కిరాని కారణంగా ఎవరికి వారు తమకు తోచిన ఫిగర్స్‌ను చెప్పేస్తున్నారు. దీంతో అటు కూటమిలోనూ, ఇటు ఆయా పార్టీల నేతలు అయోమయంలో పడిపోయారు. తమ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి..? అందులో వారికి సీటు దక్కుతుందా..? లేదా..? అనే ఆసక్తితో చాలా మంది ఆశావాహులు వేచి చూస్తున్నారు. ఇలాంటి సమయంలో కూటమిలోని ఓ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుందంటూ ప్రచారం జరిగింది. మహాకూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించింది సీపీఐ. అయితే, ఈ పార్టీ సీట్ల సర్ధుబాటు విషయంలో కాంగ్రెస్ పార్టీ అవలంభిస్తున్న వైఖరికి నిరసన వ్యక్తం చేసింది. అంతేకాదు, సర్ధుబాటు త్వరగా తేల్చకుంటే కూటమి నుంచి బయటకు వెళ్లిపోతామని కూడా తెగేసి చెప్పింది. పైకి ఇలా చెప్పినా సీపీఐ కూటమి నుంచి బయటకు వెళ్లదు అనే టాక్ కూడా వినిపించింది.
 అయితే, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సీపీఐ రెండు రోజులుగా దీనిపై తీవ్రంగా చర్చలు జరుపుతోంది. నిన్న పార్టీ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఐదు సీట్లు ఇవ్వాల్సిందేనని, ఒకవేళ ఇవ్వకుంటే కూటమి నుంచి బయటికి వెళ్తామని కాంగ్రెస్ పార్టీకి తేల్చి చెప్పింది. సోమవారం తాము అడిగినన్ని సీట్లు ఇవ్వకుంటే కూటమిలో నుంచి బయటకు వెళ్లిపోవాలని అనుకుంటున్నట్లు ఆ పార్టీ నేతలు ప్రకటించారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవం సుధాకర్ రెడ్డితో సమావేశమైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడా వెంకటరెడ్డి తాము పోటీ చేసే స్థానాలను వెల్లడించారు. హుస్నాబాద్, బెల్లంపల్లి, కొత్తగూడెం, ఆలేరు, మునుగోడు, మంచిర్యాల, పినపాక, దేవరకొండ, వైరా స్థానాల్లో తాము పోటీకి సిద్ధమని చాడా తెలిపారు. మహాకూటమిలో అడిగిన ఐదు స్థానాలు ఇవ్వకపోతే, ఒంటరిగా ఈ తొమ్మిది స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పడంతో కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ సీపీఐను లైట్ తీసుకుంటుందన్న ఆరోపణలకు ఈ పరిణామం బలం చేకూర్చుతోంది. ఒకవేళ సీపీఐ బయటకు వెళ్లిపోతే మహాకూటమికే తీవ్ర నష్టం అని చెప్పాలి. ఆ పార్టీ ప్రభావం చూపే స్థానాలు రాష్ట్రంలో చాలా ఉన్నాయి. ఆయా స్థానాల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయినా.. అది తెలంగాణ రాష్ట్ర సమితికే అనుకూలంగా మారే అవకాశం ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది.
TRS Latest News, Telangana Mahakutami Political news, CPI Party Latest News, Congress Update news, CPI party given Shock to Congress Party, Telugu news

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *