టీఆర్ ఎస్ షాక్ ఇవ్వ‌నున్న మ‌హిళా నాయ‌కులు

TRS shock news

తెలంగాణ‌ల టీఆర్ఎస్‌లో కీలకపాత్ర పోషిస్తున్న మహిళా నేతలు పార్టీని వీడెందుకు సిద్ధమయ్యారట. పార్టీలో టిక్కెట్ ఆశించి వారు భంగపడ్డారట. మహిళలను ఏడిపిస్తే ఉసురు తగులుతుందని ఓ నేత బహిరంగంగానే కామెంట్ చేస్తున్నారట! జిల్లాలో కీలకంగా ఉన్న ఆ నేతల్లో ఒకరు జడ్సీ ఛైర్‌పర్సన్ అయితే.. మరొకరు తాజా మాజీ ఎమ్మెల్యే! వీరు బీజేపీలో చేరేందుకు ఇప్పటికే రంగం సిద్ధంచేసుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రసమితికి చెందిన ఇద్దరు మహిళా నేతలు ఆ పార్టీకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కరీంనగర్ జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ తుల ఉమ, చొప్పదండి తాజా మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ టీఆర్ఎస్‌కి రాజీనామా చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. వేములవాడ టిక్కెట్ ఆశించిన తుల ఉమ, చొప్పదండిలో తిరిగి పోటీచేయాలనుకుంటున్న శోభకు అవకాశాలు లభించే పరిస్థితి కనిపించడం లేదట. దీంతో వారు పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్టు వినికిడి! టీఆర్ఎస్‌ అధినేత నుంచి ఆఖరు క్షణం వరకైన సానుకూల సంకేతం రాకపోతుందా? అని వారు ఎదురుచూస్తున్నారనీ, ఇతర పార్టీల టిక్కెట్లు ప్రకటించేలోపే వారు ఏదో ఓ నిర్ణయం తీసుకుంటారనీ గుసగుసలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీని రద్దుచేసిన వెంటనే కేసీఆర్ 105 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 నియోజకవర్గాలుంటే.. అందులో 12 స్థానాల్లో తాజా మాజీ ఎమ్మెల్యేలకే మళ్లీ అవకాశం కల్పించారు. చొప్పదండి నియోజకవర్గానికి మాత్రం అభ్యర్థిని ప్రకటించలేదు. దీనితో బొడిగె శోభ తీవ్ర నిరాశ చెందారు. బొడిగె శోభను చొప్పదండి నుంచి తప్పించాలని భావించడంతోనే ఇంతకాలం ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయకుండా ఉంచారని సమాచారం. శోభ ఓవైపు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తూనే.. మరోవైపు కేసీఆర్‌ను, కేటీఆర్‌ను కలిసి తన ఆవేదన వెల్లడించాలని పలుమార్లు ప్రయత్నించారు. కానీ ఆమెకు వారితో చర్చించే అవకాశం దక్కలేదు. పైగా ఆ నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు సుంకె రవిశంకర్‌ను పోటీకి దింపాలని అధినేత ఒక అవగాహనకు వచ్చారని టాక్‌ వినిపిస్తోంది. ఆయన పేరును లాంఛనంగా ప్రకటించాల్సి ఉందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఇంతకాలం వేచిచూసే ధోరణి అవలంభించిన శోభ త్వరలోనే ఒక నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు ఆమె వర్గీయులు చెబుతున్నారు. టీఆర్ఎస్ నుంచి పోటీచేసే అవకాశం కోసం ప్రయత్నిస్తూనే మరోవైపు ఆమె బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ను కలిసి సంప్రదింపులు జరిపారనీ, తనకు చొప్పదండి నుంచి పోటీచేసే అవకాశం కల్పించాలని కోరారనీ అంటున్నారు. ఆమె అభ్యర్థిత్వంపై బీజేపీ సుముఖంగానే ఉన్నట్లు సమాచారం. అయితే బీజేపీలో చేరితే స్థానికంగా ఇబ్బంది ఉంటుందా? అనే ఆలోచనలో ఆమె ఉన్నట్లు తెలుస్తోంది. చొప్పదండి నియోజకవర్గంలో దళితుల ఓట్ల విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయని తర్జనభర్జన పడుతున్నట్టు సమాచారం. అందుకే బహుజన సమాజ్‌పార్టీ నుంచి రంగంలోకి దిగితే ఎలా ఉంటుంది? అనే కోణంలో కూడా శోభ ఆలోచిస్తున్నారట. ఈ మేరకు తన అనుచరుల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నారని చెబుతున్నారు. ఆమె టీఆర్ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీ నుంచి గానీ, బీఎస్పీ నుంచి గానీ పోటీచేస్తారని మాత్రం గట్టి ప్రచారం సాగుతోంది. బొడిగె శోభ, సుంకె రవిశంకర్ పేర్లు ఇప్పటికే వినిపిస్తుండగా తాజాగా మరో నేత పేరు తెరపైకి వచ్చింది. కేసీఆర్ ఆయనకే టిక్కెట్ కేటాయిస్తారన్న చర్చ ఊపందుకుంది. టీఆర్ఎస్ నేత వివేక్ సోదరుడు వినోద్‌కు ఇక్కడ టిక్కెట్ కేటాయిస్తారన్న ప్రచారం జరుగుతోంది. వివేక్ సోదరులు కొంత కాలంగా పార్టీపై అసంతృప్తితో ఉన్నారు. అయితే వినోద్‌కు చొప్పదండి టిక్కెట్ కేటాయించి వారిని కేసీఆర్ బుజ్జగించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామాలను చూస్తుంటే శోభను పొమ్మనలేక పొగబెట్టినట్టుగానే కనిపిస్తోందని కొందరు చెవులు కొరుక్కుంటున్నారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ తుల ఉమ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. వేములవాడ నియోజకవర్గం నుంచి ఉమ మొదటినుంచి టిక్కెట్ ఆశించారు. తాజా మాజీ ఎమ్మెల్యే రమేష్‌బాబు పేరును కేసీఆర్‌ మళ్లీ ఖరారుచేయడంతో నియోజకవర్గంలో తుల ఉమ వర్గీయులు ఆగ్రహించారు. ఆయన అభ్యర్థిత్వాన్ని మార్చాలని కోరుతూ ఆందోళనా కార్యక్రమాలు చేపట్టారు. అయినా అధిష్టానం అవేమి పట్టించుకోలేదు. నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో ప్రజాప్రతినిధులు తుల ఉమకు లేదా.. రమేష్‌బాబుకు కాకుండా మరెవరికైనా టిక్కెట్ కేటాయిస్తే తాము గెలిపించుకుంటామని సమావేశాలు పెట్టి మరీ ప్రకటించారు. ఈ తరుణంలో వారు వేములవాడకు పాదయాత్రలు చేయాలని ప్రయత్నించగా పోలీసులు వారిని భగ్నంచేశారు. ఈ అసమ్మతి కొనసాగుతుండగానే రమేష్‌బాబు తన ప్రచారాన్ని ఉధృతం చేసి గ్రామాల్లోకి వెళ్తున్నారు. ప్రకటించిన 105 స్థానాల్లో ఏ అభ్యర్థిని మార్చేదిలేదని అధిష్టానం తేల్చిచెప్పడంతో తుల ఉమ ఆశలు సన్నగిల్లాయి. దీనితో ఆమె బీజేపీ నుంచి గానీ, కాంగ్రెస్‌నుంచి గానీ పోటీచేసే ప్రయత్నాలు ప్రారంభించారట! ఇరు పార్టీల నేతలతో చర్చలు కూడా జరిపారని ప్రచారం జరుగుతోంది. ఈ చర్చలు తీవ్రం కావడంతో ఆమె హుటాహటిన అధిష్టానం పెద్దలను సంప్రదించి వివరణ ఇచ్చినట్లు కూడా చెప్పుకుంటున్నారు. నిజానికి ఆమె హైదరాబాద్ వెళ్లడం పట్ల కరీంనగర్‌లో కొత్త చర్చ మొదలైంది. గన్‌మెన్‌ను గానీ.. తన అధికారిక వాహనం గానీ, డ్రైవర్‌ను కూడా ఆమె తన వెంట తీసుకెళ్లలేదు. దీనితో ఆమె ఆ రోజే కాంగ్రెస్‌లో లేదా బీజేపీలో చేరుతారని ప్రచారం జరిగింది. అయితే అధిష్టానం పెద్దలను కలిసిన తర్వాత ఆమె తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను కొట్టిపారేశారు. కానీ తుల ఉమ తీరుపై రాజకీయ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆమె టీఆర్ఎస్‌కు షాక్ ఇవ్వడానికే సిద్ధపడ్డారన్న వార్తలు మాత్రం ఇంకా వస్తూనే ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో!

TRS shock news to the women’s leaders, Telangana Latest News, Telugu News, telugu update news, TRS party Shock news, BJP Party News.

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *