టీటీడీపీలో మహిళానేతల టికెట్ పంచాయితీ

TTDP Political News

నిన్నటి దాకా టీడీపీ కి ఒకరకమైన సమస్య ఉంటె ఇప్పుడు కొత్త సమస్య వచ్చి పడింది. అలా సీట్ల సర్దుబాటు పంచాయితీ ఒక కొలిక్కి వచ్చిందో లేదో మరో పంచాయితీ ప్రారంభం అయ్యింది. తమకు టికెట్లు కేటాయించాల్సిందే అని మహిళా నేతలు పట్టు పడుతున్నారు.
తెలంగాణ తెలుగుదేశంలో మహిళా నేతలంతా ఏకమయ్యారు. తమకు కనీసం మూడు సీట్లు కేటాయించాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా పార్టీ ని వీడకుండా పని చేశామని,టికెట్లు ఇవ్వకుంటే కఠిన పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఆ మేరకు పార్టీ అధిష్టానంపై ఒత్తిడి పెంచుతున్నారు. తమకు టికెట్లు కేటాయించాల్సిందే అంటూ తెలంగాణ తెలుగుదేశానికి మహిళా నేతలు అల్టిమేటమ్‌ ఇస్తున్నారు.
తెలంగాణలో టీడీపీ 12 సీట్లలో పోటీ చేసేందుకు ఆశావహులు భారీగా పోటీ పడుతుంటే.. తమకు ఎంతోకొంత న్యాయం జరగాల్సిందేనని పట్టుపడుతున్నారు తెలుగు దేశం మహిళా నేతలు . ఎవరిని నిరాశ పరిస్తే ఏం జరుగుతోందో అన్న ఆందోళనలో పార్టీ పెద్దలు ఆచితూచి అడుగులు వేస్తుంటే తెలుగు మహిళా నేతలు మాత్రం తమకు కనీసం మూడు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో మహిళలకు అన్యాయం జరిగిందని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలంటే తమకు తగిన ప్రాధాన్యం కల్పించాలని కోరుతున్నారు.
తెలుగు మహిళ అధ్యక్షురాలు బండ్రు శోభారాణి ఆలేరు నుంచి టికెట్‌ అడుగుతున్నారు. పార్టీ అధికార ప్రతినిధి పాల్వాయి రజిని తుంగతుర్తి… వీలు కాకపోతే నల్గొండ జిల్లాలోని మరో సీటు కేటాయించాలని కోరుతున్నారు. పార్టీ మరో అధికార ప్రతినిధి అనుషారామ్ జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వీరే కాకుండా మరి కొందరు మహిళా నేతలు ఎన్నికల బరిలో నిలిచేందుకు రెడీ అవుతున్నారు. ప్రజాకూటమిలో భాగంగా టీడీపీకి తక్కువ సీట్లను కేటాయించినా కూడా… మహిళలకు కనీసం మూడు సీట్లు కేటాయించాల్సిందేనని మహిళా నేతలు డిమాండ్ చేస్తున్నారు.
బండ్రు శోభారాణి, పాల్వాయి రజిని, అనుషారామ్‌… .సంక్లిష్ట సమయంలోనూ పార్టీని అంటి పెట్టుకుని ఉన్నారు. పెద్ద పెద్ద నేతలు పార్టీని వీడినప్పటికీ… పార్టీని కాపాడుకునేందుకు బహిరంగ వేదికలపై పార్టీ గొంతును వినిపించారు. అందుకే తమకు కచ్చితంగా పోటి చేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలుంటాయని అంతర్గత సమావేశాల్లో హెచ్చరికలు జారీచేస్తున్నారు. పార్టీ కోసం సకలం నష్టపోయిన తమకు… టికెట్ కేటాయించపోతే పార్టీ కార్యాలయంలోనే అమరణ నిరసనకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. దీంతో టికెట్ల లెక్క తేలింది కానీ టీడీపీలో ఈ లేడీస్ లెక్క తేలక తెగ తర్జనభర్జనలు పడుతున్నారు తెలుగు తమ్ముళ్ళు .

TTDP Political News , Women’s Ticket Panchayat in TTDP , Political News on Telangana TDP ,

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *