ఉత్తమ్ కు నాయిని రాజేందర్ రెడ్డి సూటి ప్రశ్న

వరంగల్ పశ్చిమ స్థానాన్ని కాంగ్రెస్ పొత్తులో భాగంగా టీడీపీకి కేటాయించింది. ఇప్పటికే టీడీపీ రేవూరి ప్రకాష్ రెడ్డిని అభ్యర్థిగా కూడా ప్రకటించింది. అయితే స్థానిక కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ స్థానాన్ని నాయిని రాజేందర్‌రెడ్డికే కేటాయించాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాజేందర్‌రెడ్డి కూడా తనకు టిక్కెట్ ఇవ్వకుండా అన్యాయం చేసారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘విద్యార్థి దశ నుంచి పార్టీని తల్లిలా భావించి పని చేశాను. మూడు సార్లు టిక్కెట్‌ రాకపోయినా పార్టీని వీడలేదు… ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా అన్నింటిని భరిస్తూ పార్టీని భుజాన మోశాను. తీరా నాకు జరిగిన మేలు అవమానం. టిక్కెట్‌ దక్కకపోవడం. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు.. రాష్ట్ర నాయకత్వానికో దండం’ అంటూ రాజేందర్‌రెడ్డి ఆవేదన చెందారు.

   హన్మకొండ డీసీసీ భవన్‌లో ఆమరణ దీక్ష చేపట్టిన నాయకులను కలిశారు. దీక్ష విరమించాలని కోరారు. బీ-ఫాం వచ్చే వరకు విరమించబోమని నాయకులు స్పష్టం చేశారు. అనంతరం రాజేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. పార్టీ రాష్ట్ర నాయకత్వంపై మండిపడ్డారు. దిగ్విజయ్‌సింగ్‌, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ, జానారెడ్డి మా ఇంటికి వచ్చి టిక్కెట్‌ నీకే అన్నారు. పార్టీ కోసం కష్టపడుతున్నావని చెప్పారు. ఇప్పుడా మాటలు ఏమయ్యాయని ప్రశ్నించారు. పార్టీ అధినాయకత్వం నమ్మించి గొంతు కోసిందని రాజేందర్‌రెడ్డి ఆవేదన చెందారు. కొద్ది రోజుల క్రితం బస్సుయాత్ర నిర్వహణ ఆర్థికంగా భారమైనా భరించి నిర్వహించానని, అంతకు ముందు ఎన్నో సభలు, సమావేశాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. నా కష్టమంతా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంతలోనే మరిచారా అని ప్రశ్నించారు. ఇంత చేస్తే చివరకు పొత్తులో టీడీపీకీ కేటాయిస్తారా అని ప్రశ్నించారు.

టీఆర్‌ఎస్ తో చేతులు కలిపిన కొందరు పార్టీ ద్రోహుల కుట్రలకు తాను బలయ్యానని రాజేందర్‌రెడ్డి ఆరోపించారు. కోవర్టు ఆపరేషన్‌ నడించిందన్నారు. టీఆర్‌ఎస్‌, టీడీపీలతో కాంగ్రెస్ లోని కొందరు ద్రోహులు కలిసి ఆడిన నాటకంలో తనకు టికెట్‌ దక్కలేదన్నారు. పార్టీని నమ్ముకొని పని చేస్తే తనకు టిక్కెట్‌ రాదు కానీ, ఒక్కో కుటుంబంలో రెండు టిక్కెట్లు మాత్రం దక్కుతాయా అని మండిపడ్డారు. వరంగల్‌ పశ్చిమలో గెలుపు దిశగా పార్టీని తీసుకెళితే, ఓడిపోయే రేవూరి ప్రకాష్ రెడ్డికి అప్పగిస్తారా అని అధినాయకత్వాన్ని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ నిజానిజాలు పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. ఇక పశ్చిమ నాయకులు, కార్యకర్తలే నా హై కమాండ్‌. వారి నిర్ణయమే శిరోధార్యమని రాజేందర్‌రెడ్డి వెల్లడించారు.

uttam kumar reddy latest news,nayini rajender reddy sensational comments on uttam,nayini rajender serious on uttam kumar reddy,

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *