క‌మ‌లం నేత‌ల మ‌ధ్య కోల్డ్‌వార్‌

War in BJP Leaders
కర్నూలు జిల్లాలో కమలం పార్టీ నేతల మధ్య కోల్డ్‌వార్ సాగుతోందా? బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకి అందిన రహస్య సర్వే రిపోర్ట్ ఎలా ఉంది? 2019 ఎన్నికలలో అభ్యర్థుల అన్వేషణలో భాగంగా బీజేపీ అధినాయకత్వం ఎవరిని టార్గెట్ చేసింది? మొత్తంగా జిల్లా నేతల మధ్య విభేదాల వల్ల బీజేపీకి ఎలాంటి నష్టం జరుగుతోంది?రాయలసీమలో అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలతో పోల్చితే కర్నూలు జిల్లాలో బీజేపీకి బలమైన క్యాడర్ ఉంది. అయితే నేతల మధ్య అంతర్గత విభేదాల కారణంగా  కర్నూలు కోటలో కమలంపార్టీ ప్రభ క్రమంగా మసకబారుతోంది. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కపిలేశ్వరయ్య, జిల్లా అధ్యక్షుడు హరీశ్‌బాబులకు అస్సలు పొసగటం లేదు. వీరిద్దరి మధ్య సాగుతున్న కోల్డ్‌వార్ ఇటీవల పార్టీ పెద్దల ముందే బహిర్గతమైంది. మంత్రాలయంలో ఈ మధ్య జరిగిన ఆర్ఎస్‌ఎస్ సమావేశాలకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వచ్చారు. రాత్రి డిన్నర్‌ కోసం కర్నూలు శివారులోని టోల్‌ప్లాజా భవనానికి వెళ్లారు. ఆ సమయంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కపిలేశ్వరయ్య, జిల్లా అధ్యక్షుడు హరీశ్‌బాబు బలప్రదర్శన చేశారు. ఈ సీన్‌ చూసి అమిత్‌షా వెంటవచ్చిన తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు సైతం ఆశ్చర్యానికి గురయ్యారట!కపిలేశ్వరయ్య, హరీశ్‌బాబుల మధ్య అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరాయి. ఈ క్రమంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ జిల్లా పర్యటనకు వచ్చారు. కర్నూలు, నంద్యాల పార్లమెంట్ స్థానాల పరిధిలో పదాధికారుల సమావేశం జరిగింది. సమావేశానికి తమను ఎందుకు పిలవలేదని కొంతమంది కన్నా లక్ష్మీనారాయణ ఎదుటే ఆందోళనకు దిగారు. అంతేకాదు- జిల్లా అధ్యక్షుడు హరీశ్‌బాబు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కపిలేశ్వరయ్య వర్గీయులు ఆయనకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన హరీశ్‌బాబు “నిబంధనల ప్రకారం కార్యక్రమానికి ఎవరిని పిలవాలో వారందరినీ పిలిచాను. నాపై వస్తున్న ఆరోపణలు అర్ధరహితం..” అని సమాధానం  ఇచ్చారట. ఈ ఘటన తర్వాత నుంచి కపిలేశ్వరయ్య, హరీశ్‌బాబు వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇద్దరి మధ్య నెలకొన్న విభేదాలకు పుల్‌స్టాప్ పెట్టేందుకు పార్టీ అధినాయకత్వం నానా ప్రయత్నాలు చేస్తోంది.. కానీ వార్ మాత్రం కంటిన్యూ అవుతోందట!కర్నూలు జిల్లాలో బీజేపీకి మూడు లక్షలకు పైగా సభ్యత్వం ఉంది. బలమైన క్యాడర్ ఉన్నందున ఏ కార్యక్రమం అయినా సరే- కర్నూలు నుంచే ప్రారంభిస్తుంది బీజేపీ. దీనికితోడు కోట్ల హరిచక్రపాణిరెడ్డి వంటి నాయకులు పార్టీలోకి వస్తున్నట్టుగా సంకేతాలున్నాయి. ఈ పరిస్థితుల్లో స్థానికంగా బీజేపీని పటిష్టపరచాల్సింది పోయి.. వ్యక్తిగత విభేదాలతో బలహీనపరుస్తున్నారంటూ కపిలేశ్వరయ్య, హరీశ్‌బాబులపై బీజేపీ జాతీయ, రాష్ట్ర అగ్రనేతలు సీరియస్ అయ్యారట! తనను జిల్లా అధ్యక్ష పదవి నుంచి దించేందుకు కపిలేశ్వరయ్య వర్గం కుట్రలు చేస్తోందని ఈ సందర్భంగా హరీశ్‌బాబు పార్టీ పెద్దల వద్ద ఆరోపించారట. ఇతర పార్టీ నాయకులతో హరీశ్‌బాబు కలివిడిగా ఉండటం తమకు రుచించడం లేదని కపిలేశ్వరయ్య వర్గం అగ్రనాయకులకు చెప్పిందట! ఇలా ఒకరిపై మరొకరు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నారట. ఈ పరిణామం ఇటు కార్యరక్తలకు, అటు బీజేపీ అధిష్టానానికి తలనొప్పిగా మారిందట! కర్నూలు జిల్లా బీజేపీలో విభేదాలు భగ్గుమంటున్న తరుణంలో.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా జిల్లా నేతలకు తెలియకుండా మూడుసార్లు రహస్యంగా సర్వే చేయించారట. సర్వే రిపోర్టులు కొంత నెగటివ్‌గా వచ్చినట్లు బీజేపీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో స్థానిక నేతలకి గట్టి ఆదేశాలందాయట. “జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలి. టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలకు దూరంగా ఉన్న ముఖ్యనేతలు, వారి అనుచరవర్గంపై ఫోకస్ పెట్టండి. ఎలాగైనా వారిని ఒప్పించి పార్టీలో చేర్పించే బాధ్యత మీదే! పార్టీ నిబంధనల ప్రకారం నడుచుకునేవారికే.. వచ్చే ఎన్నికల్లో ప్రాధాన్యం ఉంటుంది. లేకుంటే ఊహించని పరిణామాలు చవిచూడాల్సి వస్తుంది” అని  బీజేపీ ముఖ్య నేతలు హెచ్చరించారట. దీంతో అప్పటినుంచి జిల్లా బీజేపీ నేతలు అభ్యర్థుల అన్వేషణలో బిజీబిజీగా ఉన్నారు. పార్టీలోకి ఎవరిని ఆహ్వానించబోతున్నదీ ఎప్పటికప్పుడు రాష్ట్ర అధినాయకత్వానికి తెలియజేస్తున్నారట. ఇదే సమయంలో పార్టీలో అంతర్గతంగా ఓ మాట వినిపిస్తోంది. ఏళ్లతరబడి పార్టీనే నమ్ముకున్న వారికి కాకుండా కొత్తగా వస్తున్న వారికి అధినాయకత్వం ప్రాధాన్యం కల్పిస్తోందని కొంతమంది సీనియర్లు గుర్రుగా ఉన్నారట. ఇదిలా ఉంటే, కాంగ్రెస్ సీనియర్ నేతలు కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ ప్రజల వద్దకు వేగంగా దూసుకెళ్తోంది. పరిస్థితిని గమనించిన బీజేపీ పెద్దలు జిల్లా కమలంపార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారట! తెలుగుదేశం ప్రభుత్వ విధానాలలో లోపాలను ఎత్తిచూపుతూ, స్థానిక సమస్యలపై శంఖారావం పూరించాలని ఆదేశాలిచ్చారట. మంత్రాలయం బీజేపీ ఇన్‌ఛార్జ్‌ గుడిసె శివన్న, మరికొందరు మాత్రమే సమస్యలపై పోరాడుతున్నారు. మిగతా నేతలు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో అధికార టీడీపీ నేతలు బీజేపీ వైఖరిని దుమ్మెత్తిపోస్తున్నారు. ఏపీకి ఆ పార్టీ చేసిన అన్యాయంపై గట్టిగా గళమెత్తుతున్నారు. దీంతో బీజేపీ గ్రాఫ్‌ జిల్లాలో క్రమంగా పడిపోతోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ పెద్దలు ఎలాంటి నష్టనివారణ చర్యలు చేపడతారో, కర్నూల్‌ జిల్లాలో కమలం పార్టీని ఎలా బలోపేతం చేస్తారో వేచిచూద్దాం.
War in BJP Leaders ,Secret Survey Report to BJP Chief Amit Shah ,Secret Survey Report Latest News, BJP Party Latest news, AP Latest News.

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *