వైసీపీ దారెటో….

YCP Party news

కాంగ్రెస్‌తో కలవలేరు. ఎందుకంటే అక్కడినుంచి వచ్చి వేరుకుంపటి పెట్టుకున్నవారే. అలా అని కమలంతో కలిసి నడవలేరు. ఎందుకంటే కమలంపార్టీపై ప్రజలు కసిగా ఉన్నారు. నిన్నటి దాకా మరో ప్రాంతీయ పార్టీతో పొత్తు ఉండవచ్చని ప్రచారం జరిగింది. కానీ ఆ పార్టీ అధ్యక్షుడేమో తనది ఒంటరి పోరాటమేనని తేల్చేశారు. ఇంతకీ నాలుగురోడ్ల కూడలిలో ఉన్న ఆ పార్టీ ఏది? ఎక్కడి రాజకీయం ఇదంతా అనుకుంటున్నారా?
నిన్నటిదాకా ఆ పార్టీలో ఉన్న ఆశలు క్రమంగా అడుగంటుతున్నాయి. అంచనాలు, లెక్కలు తారుమరవుతున్నాయి. దీంతో ఆ పార్టీ నేతలలో, శ్రేణులలో ఆందోళన మొదలైంది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సెంటిమెంట్ పుష్కలంగా ఉన్నప్పటికీ 2014లో అధికారానికి అడుగుదూరంలో నిలిచిపోయింది వైసీపీ. ఈసారి ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత చాలా ఉందనీ, అదే తమకు కలిసివస్తుందనీ ఆ పార్టీ పెద్దలు నిన్నమొన్నటి వరకు ధీమాగా ఉన్నారు. అయితే నాలుగు రోజులుగా చోటుచేసుకున్న పరిణామాలు వైసీపీ నాయకులకు మింగుడుపడటం లేదు. రానున్న ఎన్నికల్లో జనసేన, వైసీపీ కలిసి పోటీచేస్తాయని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భావించారు. జగన్, పవన్ కలిస్తే రాష్ట్రంలో తిరుగుండదు అనుకున్నారు.. అయితే పక్కాగా లెక్కలు చూసుకున్న జనసేనాని పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీచేస్తాననీ, ఎవరితోనూ పొత్తులుండవనీ తునిలో తేల్చిచెప్పారు. దీంతో వైసీపీ నేతల గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లయ్యింది. ఇక జాతీయస్థాయిలో కాంగ్రెస్‌తో తెలుగుదేశంపార్టీ జతకట్టడంతో రాష్ట్ర రాజకీయాల్లో మరికొన్ని మార్పులు సంభవించాయి. దీంతో వైసీపీ ఎటూ తేల్చుకోని పరిస్థితిలో చిక్కుకుంది. కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకుని బయటకు వచ్చీరాగానే.. 10 టెన్ జన్‌పథ్‌కీ, పులివెందుల పౌరుషానికీ పోటీ అంటూ సవాళ్లు విసిరారు జగన్. దీంతో ఇరు పార్టీల మధ్య దూరం పెరిగిపోయింది. పైగా వైసీపీలో ఉన్న నేతల్లో 90 శాతం వరకు కాంగ్రెస్ నుంచి వచ్చినవారే. మరోవైపు బీజేపీతో చేతులు కలిపితే ప్రజలు హర్షించే స్థితిలో లేరు. బీజేపీ సారథ్యంలోని కేంద్రం తమను నమ్మించి మోసం చేసిందనే భావనలో ఏపీ ప్రజలున్నారు. అసలు జగన్‌ను నడిపిస్తున్నదే బీజేపీ అనీ, కేసుల నుంచి బయటపడేందుకే ఆయన బీజేపీకి సరెండర్ అయ్యారనే విమర్శలూ ఉన్నాయి. బీజేపీతో ఎలాంటి బంధం లేదని వైసీపీ పెద్దలు పదేపదే వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది. అటు వామపక్ష పార్టీలేమో జనసేనతో కలిసి ముందుకెళ్తున్నాయి. ప్రజాపోరాటాలు, ఉద్యమాలు చేస్తున్నాయి. బీజేపీయేతర కూటమిలోకి రావాలని సీపీఐ, సీపీఎం నేతలతోనూ చంద్రబాబు సంప్రదింపులు జరుపుతున్నారు. అంటే కమ్యూనిస్టులు వైసీపీతో కలిసి రానట్టే! మరోవైపు జగన్, పవన్‌ను కలిపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందనే వార్తలను జనసైనికులు అంగీకరించడం లేదు. అసలు ఆ పార్టీ శ్రేణులు వైసీపీతో కలిసేందుకు సుముఖంగా లేవు. జగన్ పదేపదే పవన్‌పై వ్యక్తిగత విమర్శలు చేస్తుండటమే దీనికి కారణం! రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులతో తమకు రాజకీయంగా ఇబ్బందేనని వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. బీజేపీతో లోపాయికారీ ఒప్పందం ఉందన్న టీడీపీ ఆరోపణల నుంచి బయటపడేందుకే తెగ ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతకు తోడు, ఇతర విపక్ష పార్టీలు ఎవరికి వారుగా పోటీచేస్తే ఓట్లు చీలిపోతాయనీ, తద్వారా తమకు లాభిస్తుందనీ పార్టీ అంచనా వేసింది. కానీ అన్ని పార్టీలు ఏకమవుతుండటంతో ఎటూ పాలుపోని స్థితిలో వైసీపీ ముఖ్యనేతలున్నారు. మరి ఎన్నికలకు మరో ఆరు నెలలే వ్యవధి ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయ ముఖచిత్రం ఎలా మారనుంది? ఎవరు ఎవరితో జట్టుకడతారు? కూటముల వల్ల వైసీపీ ప్రయోజనం పొందుతుందా? మరింత నష్టపోతుందా? చూడాలి.

YCP Party news, YCP Party latest news, Jagan update news , political news, AP political news, telugu news, telugu update news.

YOU MAY ALSO LIKE

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *